రాజ్ భవన్ లో కేసీఆర్!... గవర్నర్ తో తెలంగాణ సీఎం భేటీ!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ వారంలో ఇప్పటికే రెండు సార్లు రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్... తాజాగా కొద్దిసేపటి క్రితం మరోమారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో ఆయన భేటీ అయ్యారు. నిన్న విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వరం పెంచిన సంగతి తెలిసిందే. ‘మాకు నోరు లేదా?’ అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు... తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు గవర్నర్ తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.