జైలులో ఉన్న నేతతో డీల్: మంత్రిని తొలగించిన సీఎం అఖిలేష్
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి నుంచే వేడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. తాజాగా అధికార సమాజ్ వాదీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన ఖువామీ ఎక్తా దళ్(క్యూఈడీ) విలీనమైంది. ఓ హత్య కేసులో చిక్కుకుని దశాబ్దకాలంగా జైలులో ఉన్న క్యూఈడీ నేత ముఖ్తార్ అన్సారీతో ఎస్పీ మంత్రి బలరామ్ యాదవ్ చర్చలు జరిపి పార్టీ విలీనమయ్యేందుకు కృషి చేశారు. అయితే జైలులో వున్న నేత పార్టీతో ఎస్పీ జతకట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో తేరుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రి బలరాం యాదవ్ ను తొలగించారు. క్యూఈడీ.. ఎస్పీతో జతకట్టిన కొద్ది గంటల్లోనే మంత్రిపై వేటు యూపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు ఎస్పీ, క్యూఈడీ విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రజల మద్దతు కోల్పోయిన అఖిలేష్ నేరస్తులతో జతకట్టి వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎస్పీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేరస్తులను అక్కున చేర్చుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డీపీ సింగ్ ధ్వజమెత్తారు. విమర్శల వెల్లువపై స్పందించిన సీఎం అఖిలేష్ మాట్లాడుతూ తమకే పార్టీ మద్దతూ అవసరం లేదని, ప్రజల ఆదరణ తమవైపే ఉందని, ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.