ఓయూలో హైటెన్షన్!... విద్యార్థి జేఏసీ బైక్ ర్యాలీ అడ్డగింత, పరిస్థితి ఉద్రిక్తం!
తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉస్మానియా వర్సిటీలో సంబరాలకు చెక్ పెట్టిన ప్రభుత్వం... నిషేధాజ్ఞలను విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్సిటీలో సంబరాలకు తావు లేదని ప్రకటించిన రిజిస్ట్రార్... సంబరాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
అయితే వర్సిటీ రిజిస్ట్రార్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకున్న విద్యార్థులు కొద్దిసేపటి క్రితం బైక్ ర్యాలీతో గన్ పార్క్ కు బయలుదేరారు. అయితే ఎన్ సీసీ గేటు వద్ద అప్పటికే మోహరించిన పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.