అసలు కేరళలో ప్రభుత్వం అంటూ ఉందా?: ప్రధాని మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలు కేరళలో ప్రభుత్వం అంటూ ఉందా?: ప్రధాని మోదీ

ఓ దళిత విద్యార్థినిపై అత్యాచారం జరిగితే ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదని, చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టుగా లేదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా మోదీ పాలక్కాడ్ లో శుక్రవారం ఎన్నికల సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వంతోపాటు సీపీఎంపై నిప్పులు చెరిగారు. దళిత సోదరి అత్యాచారం, హత్యకు గురై 9 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడమని మోదీ అన్నారు. కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వ హాయంలో జరిగిన సోలార్ ఉత్పత్తుల కొనుగోలు కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ... ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గమైన వారణాసిలో చేపల వేట బోట్లకు డీజిల్ ఇంజన్లను సోలార్ ఇంజన్లుగా మార్పు చేశామని చెప్పుకొచ్చారు. ‘ఇదే విధానాన్ని కేరళలోనూ ఎందుకు అమలు చేయకూడదని నా ఆలోచన. కానీ ఒకవేళ కేరళకు వెళ్లి సోలార్ గురించి మాట్లాడితే అది కూడా కుంభకోణమని ప్రజలు అనుకుంటారని భయపడ్డాను’ అని ప్రధాని అనగానే సభ నుంచి చప్పట్ల మోత మోగింది. సీపీఎం హింసాత్మక రాజకీయ పంథా అనుసరిస్తోందని, గత కొన్నేళ్ల కాలంలో ఎంతో మంది అమాయక బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యకర్తల చేతుల్లో హత్యకు గురయ్యారని అన్నారు.

More Telugu News