బెజవాడకు వెళుతున్న రాంగోపాల్ వర్మ... రేపు దేవినేని నెహ్రూతో భేటీ?
సెన్సేషనల్ డైరెక్టర్ గానే కాక పలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హీటెక్కించే కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి బెజవాడకు తాను వెళుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్లు విజయవాడలో హైటెన్షన్ వాతావరణాన్నే సృష్టించేలా ఉన్నాయి. దివంగత నేత వంగవీటి మోహనరంగ జీవితం ఆధారంగా 'వంగవీటి’ పేరిట ఓ చలన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. వంగవీటి మోహన రంగ గురించి తెలుసుకునేందుకు స్వయంగా విజయవాడ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజాగా నేటి సాయంత్రమే విజయవాడకు వస్తున్నట్లు వర్మ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంతేకాకుండా వంగవీటి గురించి పలు విషయాలను తెలుసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూను కలవనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఈ భేటీ విషయంపై నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. నెహ్రూతో భేటీకి రేపు ఉదయం ఏ సమయంలో ఇంటికి రావాలంటూ ఆయన అవినాశ్ ను ఆరా తీసినట్లు సమాచారం. ఈ వార్తలు బెజవాడలో కలకలం రేపుతున్నాయి.