Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టిన రోజు వైభవం సరే... ఇంతకీ అమ్మెక్కడ?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ, అభిమానులకు, కార్యకర్తలకే కాదు... మంత్రులకు కూడా ఆమె దర్శనం కరవైంది. నేడు ఆమె బయటకు రాబోరని, ఎవరినీ కలిసే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అత్యధిక తమిళవాసులు ప్రేమగా 'అమ్మ' అని పిలుచుకునే జయలలిత పుట్టినరోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 122 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మ క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. నేడు ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బాలిక పేరిటా తక్షణం రూ. 10 వేలు డిపాజిట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలో పుట్టే ప్రతి ఆడపిల్లకూ బంగారు ఉంగరం ఇస్తామని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ జయకుమార్ ప్రకటించారు. కార్యకర్తలు 68 కిలోల ప్రత్యేక కేక్ ను తయారు చేయించి వేడుకలు జరిపారు. కాగా, జయలలిత పుట్టిన రోజు వేడుకల ఖర్చులు, ఏర్పాట్లపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కేవలం స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, టీవీ చానళ్లలో పాత ఫైల్స్ లో మాత్రమే ఆమె కనిపిస్తోందని డీఎంకే విమర్శించింది. ఆమె బయటకు రాకపోవడాన్ని ఆక్షేపించింది. నేడు జయలలితను ఒక్కసారన్నా కళ్లారా చూద్దామని ఆమె ఇంటి ముందు వేల సంఖ్యలో అభిమానులు వేచి చూస్తున్న పరిస్థితి. స్వయంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారిని జయలలిత కరుణిస్తారో? లేదో?

More Telugu News