రంగంలోకి 'ట్రబుల్ షూటర్' తోట త్రిమూర్తులు... సర్కారీ మధ్యవర్తిత్వం ఫలించేనా?
కాపులకు రిజర్వేషన్ల పేరిట కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం చల్లారుతుందా? లేక రేపటి నుంచి మరింత రగులుతుందా? అన్న అంశంపై ఏపీ వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో నిర్వహించిన ‘కాపు ఐక్య గర్జన’ ఒక్కసారిగా కట్టు తప్పింది. పెను హింసకు దారి తీసింది. ఈ నేపథ్యంలో దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ముద్రగడ, నేటి సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సిందేనని దాదాపు అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే అందుకు కొంత సమయం పట్టి తీరుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలలో ఏమాత్రం ఆలస్యం జరిగినా, రేపటి నుంచి తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ముద్రగడ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో దీక్షను విరమించేలా ముద్రగడను ఒప్పించే బాధ్యతను చంద్రబాబు... ట్రబుల్ షూటర్ గా పేరున్న తోట త్రిమూర్తులుకు అప్పగించినట్లు సమాచారం. ముద్రగడ సొంత జిల్లా... తూర్పుగోదావరిలోని రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న తోటకు కాపుల్లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన తోట, ముద్రగడ దీక్ష కార్యరూపం దాల్చకుండా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరి ముద్రగడను శాంతింపజేసే విషయంలో ఆయన సఫలీకృతులవుతారో, లేదో నేటి రాత్రికి తేలిపోనుంది.