ఖురాన్ ను అడ్డుచూపుతూ బహు భార్యాత్వమా?: గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖురాన్ ను అడ్డుచూపుతూ బహు భార్యాత్వమా?: గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కొందరు ముస్లింలు తమ స్వీయ ప్రయోజనాల కోసం ఖురాన్ లోని 'బహు భార్యాత్వం' అన్న పదాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పురుషులు ఖురాన్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు. ఐపీసీ సెక్షన్ 494 (ఒకరి కన్నా ఎక్కువ భార్యలుంటే వేయాల్సిన శిక్షల గురించి చర్చించే సెక్షన్)పై జరిగిన వాదనల అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరో పెళ్లి చేసుకోవడంపై జాఫర్ అబ్బాస్ అనే వ్యక్తి మొదటి భార్య పోలీసు కేసు పెట్టగా, అది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జాఫర్, ఖురాన్ ను ప్రస్తావించాడు. ముస్లిం పర్సనల్ లా తనకు ఆ హక్కును ఇచ్చిందని, తనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైందని, దాన్ని రద్దు చేయాలని వాదించాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. "ఖురాన్ లో బహు భార్యాత్వానికి అనుమతించడం వెనుక సరైన కారణాలున్నాయి. కానీ నేటి తరంలో దాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. ఖురాన్ లో సైతం బహు భార్యాత్వంపై ఒక్క చోటే ప్రస్తావన ఉంది. అది కూడా కొన్ని నిబంధనలు, పరిమితుల మేరకు మాత్రమే" అని పార్దీవాలా అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం ఓ భార్యను హింసకు గురి చేయమని చెప్పడం లేదని, ఆమెను ఇంటి నుంచి పంపేసి, మరొకరిని వివాహం చేసుకోవాలని ఏ చట్టమూ చెప్పదని, దేశమంతా ఒకే చట్టం అమలు కావాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.

More Telugu News