అల్లూరి సీతారామరాజు మరణం వెనుకా ట్విస్ట్... చరిత్ర చెబుతున్నది అబద్ధమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లూరి సీతారామరాజు మరణం వెనుకా ట్విస్ట్... చరిత్ర చెబుతున్నది అబద్ధమా?

అల్లూరి సీతారామరాజు... ఆంధ్రప్రదేశ్ లోని మన్య ప్రాంతాల వీరుడు. పోరాడితేనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన గిరిజన ఆరాధ్య దైవం. బ్రిటీష్ వారి తుపాకులకు 1924, మే 7న మృతి చెందారు. ఇది చరిత్రలో మనం చదువుతున్నది. కానీ, ఆయన మరణం వెనుక కూడా నేతాజీ తరహాలోనే ట్విస్ట్ వుందని తెలుస్తోంది. సీతారామరాజు అనుచరుడు ఉప్పరపల్లి వీర వెంకటాచారిని కాల్చి చంపిన తెల్ల దొరలు, ఆయనే సీతారామరాజని పొరపాటు పడ్డారని పలువురు నమ్ముతున్నారు. ఆపై పోరాటాన్ని వదిలి తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడిలో శ్రీ పరమహంస చిద్వెంకట రామ బ్రహ్మానంద మహర్షి అలియాస్ బెండపూడి సాధు పేరిట సీతారామరాజు ఎంతో కాలం బతికారని కొందరు వాదిస్తున్నారు. కావాలంటే, ఆయన దంతాలు, తల వెంట్రుకల డీఎన్ఏలతో అల్లూరి వారసుల డీఎన్ఏను పోల్చి చూడాలని, అల్లూరి మరణం వెనుక అసలు నిజాన్ని బయట పెట్టాలని జన్యు శాస్త్ర విద్యార్థి నాగ సింహాద్రి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ అధికారులు ఇటీవల బెండపూడిని సందర్శించి వివరాలు సేకరించారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శాంపిళ్లను సీసీఎంబీకి పంపవచ్చా? అన్న విషయమై న్యాయ సలహాలు కోరారు. కాగా, అల్లూరి సీతారామరాజు తన 27వ ఏట మరణించారని చరిత్ర చెబుతుండగా, బెండపూడి సాధు 1968లో తనువు చాలించారు. ఇక మనం చదివిన చరిత్ర అబద్ధమా? లేక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అల్లూరి బతికున్నా ఆయన బయటకు రాలేకపోయారా? అసలు నిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం డీఎన్ఏ పరీక్షలతో తెలుస్తుందేమో!

More Telugu News