Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటతడి పెట్టిన మోదీ...జుకెర్ బర్గ్ తో చిట్ చాట్ లో తల్లి కష్టాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని

ధీశాలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. 'ఫేస్ బుక్' వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తో జరిపిన చిట్ చాట్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ, మార్క్ జుకెర్ బర్గ్ తో నిన్న ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ‘‘మీకు, మాకు చాలా సారూప్యత ఉంది. మనకు కుటుంబం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా కీలకం కదా?’’ అంటూ జుకెర్ బర్గ్ అన్నారు. దీంతో తనను పెంచడానికి తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్న మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడిని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మేం అప్పుడు చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిమనిషిగా చేసేది. తన పిల్లలను పెంచడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో చూడండి. కేవలం ఒక్క నరేంద్ర మోదీ తల్లే కాదు, భారత్ లోని ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పెంచడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇఫ్పుడు 95 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన పనులను తనే స్వయంగా చేసుకుంటారు’’ అని మోదీ గద్గద స్వరంతో చెప్పారు.

More Telugu News