Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాకూబ్ మెమన్ ఉరితో శ్రీనగర్ రాజుకుంటోందా?

యాకూబ్ మెమన్ ఉరితో జమ్మూకాశ్మీర్ రాజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్ జెండాలు మాత్రమే జమ్మూకాశ్మీర్ లో అడపాదడపా ఎగిరేవి. ఈ మధ్య కాలంలో శ్రీనగర్ లో పాక్ జెండాలతో పాటు, ఐఎస్ఐఎస్ జెండాలు కూడా రెపరెపలాడుతున్నాయి. తాజాగా యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ జెండాలు కూడా ఎగిరాయి. భారత జాతీయ జెండా కంటే ఎక్కువ సార్లు పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం నిరసనకారులు మెమన్ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పేట్రేగిపోయారు. పహారా కాస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఎప్పట్లానే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా, యాకూబ్ మెమన్ ను అన్యాయంగా ఉరి తీశారని హురియత్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ ఫరూఖ్ అభిప్రాయపడ్డారు. నిన్న మొన్నటి వరకు పాక్ అనుకూల నినాదాలకు పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు భారత వ్యతిరేకత నినాదాలతో మరింత రాజుకుంటున్నాయి. మెమన్ ఉరి పట్ల కాశ్మీర్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఆందోళనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో, మెమన్ ఉరిపై ఎలాంటి వ్యాఖ్యలు, ఆందోళన, నిరసనలు వ్యక్తం చేయరాదంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసినప్పటికీ జమ్మూకాశ్మీర్లో ఆందోళనలు జరగడం విశేషం.

More Telugu News