మరింతగా తగ్గనున్న పెట్రోలు ధర... నేడో రేపో ప్రకటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరింతగా తగ్గనున్న పెట్రోలు ధర... నేడో రేపో ప్రకటన!

వివిధ దేశాల కరెన్సీల మారకపు విలువతో పోలిస్తే బలపడుతున్న యూఎస్ డాలర్ క్రూడాయిల్ ట్రేడింగుపై ప్రభావం చూపింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు మరింతగా పడిపోయాయి. నేటి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే, 1.05 శాతం తగ్గి 48.01 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గురువారం నాడు న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో బ్యారలు క్రూడాయిల్ ధర 27 సెంట్లు పడిపోయి 48.52 డాలర్ల వద్దకు చేరింది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 7 సెంట్లు తగ్గి 53.31 డాలర్లకు చేరింది. క్రూడాయిల్ డిమాండు పెరిగిందని స్పష్టమైన సంకేతాలు వెలువడేంత వరకూ ధరల్లో ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఇండియాలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం శుద్ధి చేస్తున్న క్రూడాయిల్ జూన్ రెండో వారంలోది. ఆపై రేపటి నుంచి జూలై తొలివారంలో డెలివరీ తీసుకున్న ముడి చమురు శుద్ధి, విక్రయాలు ప్రారంభం అవుతాయి. జూలై తొలివారంలో సైతం క్రూడాయిల్ ధరలు తగ్గుముఖంగానే ఉన్నందున మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం వెలువడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు చమురు సంస్థలు సమావేశమై తమ నిర్ణయాన్ని వెలువరించవచ్చని తెలుస్తోంది.

More Telugu News