Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ఫోనూ ట్యాపింగ్?... టీఎస్ సర్కారు వైఖరిపై కేంద్రం ఆగ్రహం!

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసు దరిమిలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కలకలం రేపుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూ ఉండే అధికారులు, నేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఓటుకు నోటు కేసు వెలుగుచూడక ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ఫోన్ ను ట్యాపింగ్ చేసిందట. ఈ విషయాన్ని గుర్తించిన నిఘా వర్గాలు సదరు కేంద్ర మంత్రికి ట్యాపింగ్ జరిగిన వైనంపై సమాచారమందించాయట. హైదరాబాదు వచ్చిన సందర్భంగా సదరు కేంద్ర మంత్రి ఇతర పార్టీకి చెందిన ఓ నేతతో తన ఇంటిలోని ల్యాండ్ ఫోన్ నుంచి మాట్లాడారట. ఇలాంటిదేదో జరుగుతుందన్న భావనతోనే తెలంగాణ పోలీసులు ఆయన పోన్ పై నిఘా పెట్టారట. విషయం తెలిసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ సర్కారు చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏకంగా కేంద్ర మంత్రి ఫోన్ నే ట్యాపింగ్ చేయడం దుందుడుకు చర్యేనని కూడా ఆ శాఖాధికారులు వాదిస్తున్నారు.

More Telugu News