తెలంగాణకు ఆశాభంగం... పుష్కరాలకు నీళ్లు వదల్లేమన్న మహారాష్ట్ర
పవిత్ర గోదావరి పుష్కరాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలోని బాసర నుంచి ఏపీలోని అంతర్వేది వరకు గోదావరి తీరాలు లక్షలాది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే, ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలోని గోదావరిలో పుష్కర స్నానాలకు సరిపడా నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతుంటే, ఏపీలోని గోదావరి నీటితో కళకళలాడుతోంది. ఈ క్రమంలో, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. పుష్కరాల నేపథ్యంలో, గోదావరిలోకి నీటిని వదలాలని మహారాష్ట్ర సర్కారును కోరింది. అయితే, తెలంగాణ వినతిని మహారాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. నీటిని వదిలే పరిస్థితి లేదని మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తమ రిజర్వాయర్లలో కూడా తగినంత నీరు లేదని... ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదల్లేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఫడ్నవిస్ తెలిపారు. దీంతో, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది.