శవాసనాన్ని సీరియస్ గా తీసుకుని నిద్రపోయిన రైల్వే మంత్రి!
ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మోదీ సర్కారు ఎంతో తపించిపోయింది. ఆ రోజున దేశంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న ప్రధాని మోదీతో సహా ఎందరో నేతలు యోగాసనాలు వేసి స్ఫూర్తిని చాటారు. అదే రోజున కేరళలోని కొచ్చిలో కూడా యోగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొన్నారు. అయితే, శవాసనం సందర్భంగా, అందరూ చేతులు కాళ్లు బార్లా చాపుకుని పడుకున్నారు. కాసేపటి తర్వాత అందరూ లేచినా, మంత్రివర్యుడు మాత్రం లేవలేదు. శవాసనాన్ని సీరియస్ గా తీసుకుని నిద్రపోయారట. దీని గురించి ఓ కేరళ దినపత్రిక ప్రముఖంగా రాసింది. ఆయన శవాసనం తాలూకు ఫొటోలను కూడా ప్రచురించింది. అందరూ లేచినా, సురేశ్ ప్రభు పడుకుండిపోగా ఓ వ్యక్తి వచ్చి లేపుతుండడం ఆ ఫొటోల్లో కనిపించింది. ఇది యోగా శక్తికి నిదర్శనమంటూ ఆ పత్రిక కొనియాడింది.