సిడ్నీలో చెమటోడ్చుతున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో ఈ నెల 26న జరిగే సెమీఫైనల్ సమరం కోసం టీమిండియా తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ మ్యాచ్ కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. శనివారం నాడు సిడ్నీ చేరుకున్న ధోనీ సేన ఆదివారం జిమ్ లో గడిపింది. ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం పలు రకాల కసరత్తులు చేశారు. ఇక, సోమవారం సిడ్నీ మైదానంలో నెట్ ప్రాక్టీసు చేశారు. ఉదయం ఫుట్ బాల్ ఆడారు. అనంతరం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ నెట్స్ లో చెమటలు కక్కేలా ప్రాక్టీసు చేశారు.
రోహిత్... స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతో బంతులు వేయించుకుని సాధన చేయగా, కోహ్లీ, ధావన్ పేస్ ను ఎదుర్కొనేందుకు మొగ్గుచూపారు. అందరిలోకి కోహ్లీ ఎక్కువ సేపు నెట్స్ లో గడిపాడు. కోహ్లీ... పాక్ తో మ్యాచ్ మినహా భారీ స్కోర్లు సాధించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ఆసీస్ తో మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఈ ఢిల్లీ యువకెరటం దృఢనిశ్చయంతో ఉన్నాడు. కాగా, సిడ్నీ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దీంతో, అశ్విన్-జడేజా జోడీ కీలకం కానుంది.