మరికాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్... తొలిసారిగా ‘నోటా’కు అవకాశంం!
తెలంగాణ పరిధిలోని ఆరు జిల్లాల్లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన శాసన మండలి ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్ లో ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
హైదరాబాదు-రంగారెడ్డి-మహబూబ్ నగర్; వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన దేవీప్రసాద్ ను టీఆర్ఎస్ హైదరాబాదు-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి విద్యా సంస్థల అధినేత పల్లా రాజేశ్వరరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
వీరిద్దరి గెలుపు కోసం మంత్రులే నేరుగా రంగంలోకి దిగారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలని టీడీపీ-బీజేపీ కూటమితో పాటు, వామపక్షాల కూటమి తీవ్రంగా యత్నిస్తోంది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ దఫా ‘నన్ ఆప్ ద అబౌ’ (నోటా) ఆప్షన్ ను కూడా ఎన్నికల సంఘం తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. బరిలోని అభ్యర్థుల్లో ఏ ఒక్కరిపైనా సదభిప్రాయం లేకపోతే, ఓటర్లు నోటాపై ఓటేయవచ్చు.