షాకిచ్చిన అమెరికా... ఏం జరిగినా సిద్ధమేనన్న భారత్
అమెరికా ఫెడ్ ప్రపంచ మార్కెట్లను ఒక్క కుదుపు కుదిపింది. వడ్డీ రేట్ల పెంపు తప్పదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ఛైర్పర్సన్ జెనెత్ యెల్లెన్ స్పష్టం చేశారు. అన్ని అంశాలనూ పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపి షాక్ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లకు ఈ నిర్ణయం అత్యంత ప్రతికూలమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, జూన్ నుంచి అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అమల్లోకి రావొచ్చని సమాచారం. ఇదే జరిగితే, 2006 తర్వాత తొలిసారిగా అమెరికా వడ్డీ రేట్లను పెంచినట్లు అవుతుంది.
ఇదిలావుండగా, యూఎస్ ఫెడ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై అమెరికా వడ్డీ రేట్ల పెంపుతో వచ్చే మార్కెట్ ఒడిదుడుకులపై చర్చలు జరిపారు. అమెరికా ప్రభావాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్టాక్ మార్కెట్ వ్యవస్థ స్తంభించకుండా చూసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా మార్కెట్ మాత్రం వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని స్వాగతించింది. మన మార్కెట్లు మాత్రం నష్టాలను నమోదుచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.