బ్యాటింగ్ లో 8వ ర్యాంకుకు ఎగబాకిన టీమిండియా సారథి... బౌలింగ్ టాపర్ అజ్మల్
వరల్డ్ కప్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన టీమిండియా సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఐసీసీ ర్యాంకుల్లో తన స్థానాన్ని మెరుగుపరచుకున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండు మెట్లు పైకెగబాకిన ధోనీ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడో ర్యాంకులో నిలవగా, వైస్ కెప్టెన్, భారత ఆశాకిరణం విరాట్ కోహ్లీ తన నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా సారథి ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లంక స్టార్ సంగక్కర, సౌతాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక నిషేధం వేటు పడిన పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.