దేవుడి అనుగ్రహం ఉంటే... 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: లోకేష్
దేవుడి అనుగ్రహం ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి కన్వీనర్ నారా లోకేష్ అన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం శాసనసభకు వెళ్లే ప్రయత్నమేదీ చేయబోనని ఆయన చెప్పారు. సోమవారం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు.
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మృతి నేపథ్యంలో తన సొంత జిల్లా చిత్తూరులోనే శాసనసభకు పోటీ చేసే అవకాశం చిక్కింది కదా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే, వారి కుటుంబ సభ్యులకే అవకాశం కల్పించాలన్న సంప్రదాయాన్ని పాటించనున్నామని లోకేష్ తెలిపారు.