నేతాజీ బతికే ఉన్నారట... భద్రత కల్పిస్తే తీసుకువస్తారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేతాజీ బతికే ఉన్నారట... భద్రత కల్పిస్తే తీసుకువస్తారట!

భారత స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ప్రత్యేక స్థానం. అయితే, ఆయన బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది. ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని కొందరు చెబుతుంటారు. ఆయన రష్యాలోని ఓ జైల్లో ఉన్నారని ఇటీవలే ఓ కథనం వచ్చింది. తాజాగా, బోస్ బతికే ఉన్నారని, ఆయన భద్రతకు హామీ ఇస్తే కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమని తమిళనాడులో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బతికున్నారన్న దానికి ఆధారమంటూ ఆయన రమేశ్ కుమార్ ఓ ఫొటోను కోర్టుకు సమర్పించారు. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతిస్తే కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్ వివరణ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఇక, సోమవారం నాటి తదుపరి విచారణ సందర్భంగా, రమేశ్ కుమార్ భారతీయ సుభాష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అళగుమీన తరపున మరో పిటిషన్ వేశారు. 1962లో జరిగిన చైనా యుద్ధంలోనూ, 1964లో నెహ్రూ అంతిమయాత్రలోనూ నేతాజీ పాల్గొన్నారని తాజా పిటిషన్ లో పేర్కొన్నారు. 1963-64 ప్రాంతంలో పశ్చిమబెంగాల్లోని సౌల్ మరి ప్రాంతంలో నేతాజీ సాధువుగా ఉన్నారన్న విషయాన్ని నిఘా విభాగం కూడా గుర్తించిందని వివరించారు. నేతాజీ యుద్ధ నేరస్తుడు కావడంతో, ఆయనను బ్రిటీషర్లకు అప్పగిస్తామని గతంలో కేంద్రం ప్రకటించిందని, ఆ ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే, నేతాజీని అప్పగించబోమని కేంద్రం స్పష్టం చేస్తేనే ఆయనను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు.

More Telugu News