రెండు రాష్ట్రాల సమస్యలనూ ప్రస్తావించండి: ఎంపీలకు వైఎస్ జగన్ సూచన
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రెండు రాష్ట్రాల సమస్యలను ప్రస్తావించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం పార్టీ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. సభలో పార్టీ వ్యవహరించాల్సిన వైఖరిపై ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలు చేశారు.
పార్లమెంట్ చర్చల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఇరు రాష్ట్రాల్లో జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి, సంబంధిత మంత్రులతోనూ భేటీలు నిర్వహించాలని జగన్ సూచించారని పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదలయ్యేలా మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని కూడా సూచించారన్నారు. నంద్యాల, అరకు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలను అనర్హులుగా ప్రకటించాలని మరోమారు స్పీకర్ ను కోరతామని మేకపాటి తెలిపారు.