అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరపాలని ప్రజలు భావిస్తున్నారు: స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రవాసంలో కాకుండా, రాష్ట్రంలోనే జరపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ భవనాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించే విషయమై మూడ్రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు. డిసెంబరులో శాసనసభ శీతాకాల సమావేశాలు ఉంటాయని, 5 నుంచి 8 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. రక్షణ, రవాణా, విడిది, ఇతర మౌలిక సదుపాయాలకు ఇక్కడ ఇబ్బంది లేదని అన్నారు. ఏదేమైనా, సమావేశాలు ఇక్కడ నిర్వహించే విషయమై తుది నిర్ణయం ముఖ్యమంత్రి, ప్రభుత్వానిదేనని కోడెల స్పష్టం చేశారు.