థాంక్యూ అమెరికా... సంతృప్తిగా వెళుతున్నా: మోడీ
‘‘థ్యాంక్యూ అమెరికా! అనుకున్న దాని కంటే ఎక్కువే సాధించాను. సంతృప్తిగానే భారత్ కు తిరిగి వెళుతున్నాను’’ అన్నారు ప్రధాని మోడీ. ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశం పయనమైన సందర్భంగా వాషింగ్టన్ లో మోడీ చేసిన వీడ్కోలు వ్యాఖ్యలివి. పలు అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, భారత్ లో పెట్టుబడులు పెట్టే దిశగా అమెరికా పారిశ్రామిక దిగ్గజాలను ఒప్పించాలన్న లక్ష్యంతో అమెరికాలో అడుగిడిన మోడీ, అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే సాధించారు.
‘‘అమెరికాలో నా పర్యటన విజయవంతమైంది’’ అని మోడీ బారత్ బయలుదేరే ముందు ప్రకటించారు. మోడీ అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పారిశ్రామిక దిగ్గజాలతో మోడీ నిర్వహించిన సమావేశం మంచి ఫలితాలను ఇచ్చిందని కూడా వారు చెబుతున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' నినాదం అమెరికా పారిశ్రామికవేత్తలను బాగా ఆకట్టుకుందని, భవిష్యత్తులో భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వారు అంగీకరించారని మోడీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.