తమిళ తెరపై మరో 'స్లమ్ డాగ్ మిలియనీర్'!
విదేశీ దర్శకుడు డ్యానీ బోయెల్, భారతీయ మురికివాడలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా దేశీ దర్శకుడు, అదీ తొలిసారి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మణికందన్, మరో స్లమ్ డాగ్ మిలియనీర్ ను తెరకెక్కించారు. తమిళంలో ‘కాక్క ముత్తై’ పేరిట రజనీ అల్లుడు, తమిళ స్టార్ ధనుష్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం టోరంటో చలన చిత్రోత్సవంలో విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఏ ఒక్క స్టార్ హీరో లేకుండా, పాటలు, ఫైట్లు లేకుండా తీసిన ఈ చిత్రం, నాడు స్లమ్ డాగ్ మిలియనీర్ ఏ స్థాయిలో విజయం సాధించిందో, దానిని మించిన రీతిలో ప్రశంసలను మూటగట్టుకోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.
ఈ చిత్రంలో ఇద్దరు చిన్నారులే హీరోలు. తండ్రి జైలుకెళ్లడంతో తప్పనిసరిగా పనిలో కుదిరే ఆ ఇద్దరు అన్నదమ్ములు, పిజ్జా కొనుక్కునేందుకు అవసరమైన డబ్బును సంపాదించుకునే క్రమంలో ఏకంగా పిజ్జా విక్రయ శాలను ఏర్పాటు చేయడాన్ని చిత్రంలో దర్శకుడు హృద్యంగా చిత్రీకరించారు. భారత దేశంలోని మురికివాడల్లోని పరిస్థితుల నేపథ్యంలో సాగిన ఈ చిత్రం, భారత పేదరికాన్ని ఏమాత్రం స్పృశించని రీతిలో తెరకెక్కించినట్లు దర్శకుడు మణికందన్ చెబుతున్నారు. ఈ చిత్రం దీపావళి తర్వాత విడుదల కానుంది. ఆ లోగానే వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. తాజాగా టోరంటో చలన చిత్రోత్సవంలో భారత్ తరఫున ప్రదర్శితమవుతున్న చిత్రం 'కాక్క ముత్తై' ఒక్కటే కావడం గమనార్హం.