రాహుల్ కు గుడ్ బై... ప్రియాంకకు వెల్ కం చెప్పండి: కాంగ్రెస్ శ్రేణులు
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి రాహుల్ గాంధీ నాయకత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. రాహుల్ తన జోకర్ల టీంను నమ్ముకున్నంత కాలం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగుపడదని వారు భావిస్తున్నారు. అసోం, మహారాష్ట్రల్లో అసమ్మతి సెగను రాహుల్ డీల్ చేసిన విధానాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీపై పెరుగుతున్న వ్యతిరేకతపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. పార్టీ విషయాల్లో రాహుల్ గాంధీ మరింత ఎక్కువగా, చురుగ్గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ లో కొందరు నాయకులు రాహుల్ ను విమర్శించడంతో సరిపెట్టుకుంటే... మరికొందరు మరో అడుగు ముందుకువేశారు. పార్టీ పగ్గాల నుంచి రాహుల్ ను తప్పించి ప్రియాంక గాంధీకి అప్పగించాలని వారు కాంగ్రెస్ హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ప్రియాంకగాంధీయే అమిత్ షా, మోడీల ద్వయానికి రాబోయే రోజుల్లో చెక్ పెట్టగలరని వారు అభిప్రాయపడుతున్నారు.