Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడేజా చెప్పిన 'సర్'దా సంగతులు

భారత క్రికెట్లో తాజా సంచలనం రవీంద్ర జడేజా! బ్యాట్స్ మన్ గా జట్టుకు ఎంపికై బౌలర్ గా సెటిలైన ఈ యువ క్రికెటర్ ఎప్పుడూ సరదాగా ఉంటూ, తన చుట్టూ ఉన్నవారిలోనూ అదే మూడ్ ని క్రియేట్ చేయడంలో ఘనాపాఠీ. అందుకే సహచరులందరికీ జడేజా అంటే అంత అభిమానం. ఆ అభిమానం ఒక్కోసారి అవధులు తెంచుకుని ఇంటర్నెట్ కూ విస్తరిస్తుంది. సీన్ కట్ చేస్తే, మూతిపై సరిగా మీసాలు కూడా మొలవని జడేజాకు ఏకంగా 'సర్' బిరుదు ఇచ్చేంతవరకూ అది పాకుతుంది మరి. ఎంతలా అంటే, చెన్నై సూపర్ కింగ్స్ సహచరులు నెట్ లో రవీంద్ర జడేజాను 'సర్' అని సంబోధించడమే కాకుండా, అతనిపై పలు చిత్రవిచిత్రమైన జోకులనూ పేల్చేంతవరకూ!

ఈ సరదా నెటిజంను తానూ ఆస్వాదిస్తున్నానని జడేజా అంటున్నాడు. తన పేరుకు ముందు బ్రిటిష్ నైట్ హుడ్ బిరుదు 'సర్' చేర్చడం ఓ సమస్యే కాదని చెప్పాడు. ఇదో జోక్ అనుకుంటున్నానని, టీమ్ మేట్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ ఈ లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ హాయిగా నవ్వేశాడు. ధోనీ, అశ్విన్ తదితరులు ప్రతి రోజూ తనపై ట్విట్టర్లో విసురుతున్న చెణుకులు నవ్వుపుట్టించేలా ఉన్నాయని జడేజా అన్నాడు. అయితే, వాస్తవానికి వారు పేర్కొనేంత గొప్పవ్యక్తిని కాదని వినమ్రంగా సెలవిచ్చాడీ సౌరాష్ట్ర చిన్నోడు.

More Telugu News