ఓ ఇంటివాడైన టెన్నిస్ ఆటగాడు జోకోవిచ్
సెర్బియన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ అతని ప్రియురాలు జెలీనా రిస్టిక్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆగ్నేయ ఐరోపాలో ఉన్న మోంటెనెగ్రో దేశంలోని అడ్రియాటిక్ (సముద్ర తీర ప్రాంత) రిసార్ట్ లో వారి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గరి స్నేహితులు, వందలమంది అతిథులు హాజరయ్యారు. రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా, జోకోవిచ్ కోచ్, పలువురు సెర్బియన్ టెన్నిస్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో ఉన్నారు.
హైస్కూల్ నుంచే లవర్స్ అయిన వీళ్ళిద్దరూ, దాదాపు ఎనిమిదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం జెలీనా గర్భవతి కావడంతో జోకోవిచ్ హడావుడిగా పెళ్లి చేసుకున్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ దంపతులిద్దరికి తొలి బిడ్డ జన్మించనుందట.