యూపీలో ఉద్యోగాల జాతర
ఉత్తరప్రదేశ్ లో ఇక ఉద్యోగాల జాతరకు తెరలేవనుంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఉద్యోగాల భర్తీపై కొనసాగుతున్న నిషేధాన్ని అఖిలేష్ యాదవ్ సర్కారు ఎత్తివేయడంతో దాదాపు 5 లక్షల మేర కొత్తగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయట. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్ల దిశగా అధికార యంత్రాంగం ఇప్పటికే కార్యరంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్ లో వాస్తవానికి 10.45 లక్షల ఉద్యోగులు ఉండాలట. అయితే ప్రస్తుతం కేవలం 4.97లక్షల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న 5 లక్షల మేర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జనల అనంతరం తీర్మానించేసింది.
భర్తీ కానున్న పోస్టుల్లో 1.38 లక్షల ఉద్యోగాలు పోలీసు శాఖవేనట. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ల్యాబ్ అసిస్టెంట్, లెక్చరర్ల పోస్టులతో పాటు సాంఘిక సంక్షేమం, అటవీ, పంచాయతీరాజ్, సాంకేతిక విద్య, పర్యాటకం, రెవెన్యూ, ప్రాథమిక, సెకండరీ విద్య, మైనార్టీ సంక్షేమం తదితర శాఖల్లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఇక దశలవారీగా భర్తీ కానున్నాయి.