ఇక్కడ అమ్మాయి పుడితే గర్విస్తారు... పండగ చేస్తారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక్కడ అమ్మాయి పుడితే గర్విస్తారు... పండగ చేస్తారు

అమ్మాయి పుట్టిందంటే చాలు, భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న కంగారు. కంటికి రెప్పలా కాపాడాలి. మూట సంపాదించి ఓ అయ్యచేతిలో పెట్టాలి. అప్పటికీ ఆమె సుఖంగా ఉంటుందన్న ఆశ లేదు. అందుకే అమ్మాయి అంటే చాలామందికి ఏదో తెలియని గుబులు. కానీ అక్కడ మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే చాలు పండగే పండగ. నర్సులు, బాయ్ లు స్వీట్సు పంచుతారు. మహారాష్ట్రలోని పూణెలో హదాప్పర్ ప్రాంతంలోని మెడికేర్ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ప్రసవం ఖర్చంతా ఆసుపత్రే భరిస్తుంది.

ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 270 మంది బంగారు బొమ్మలు పుట్టారు. డాక్టర్ గణేష్ రఖ్ స్థాపించిన ఈ ఆసుపత్రి 2007 నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఆసుపత్రికి నష్టం వస్తున్నా వారు బాధపడడం లేదు. కొంత మంది సంపన్నులు ఆసుపత్రి ఖర్చు చెల్లిస్తున్నా... పేదవారికి ఆ డబ్బు అందజేయాలని వైద్యులు చెప్పడం విశేషం.

ఓ కార్మికుడు (ఆది నాథ్ 67), పనిమనిషి (సింధు 60) దంపతుల బిడ్డైన గణేష్ రఖ్ 2001లో స్కాలర్ షిప్ ల సహాయంతో వైద్య విద్యను పూర్తి చేశారు. తనను వైద్యుడ్ని చేసిన సమాజానికి కృతజ్ఞతగా ఆయన ఈ ఆసుపత్రిని స్థాపించారు. ఆయన కృషికి సహచరులు, నర్సులు సహాయం చేస్తారు. అక్కడ చేరిన గర్భిణులకు ఛీత్కారాలు ఉండవు. సరికదా ఆడపిల్లకు జన్మనిస్తే పండగే. ఒక్కోసారి ఆసుపత్రి సిబ్బందికి జీతాలు ఆలస్యమైనా వారు ఏమీ అనరని, అదంతా సహచరులు మంచితనమని ఆయన చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఓ గ్రామంలోని పురుషులు తమకు పెళ్లిళ్లు చేస్తే ఓట్లేస్తామని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగా మేల్కోవాలని, ఆడపిల్లలను పురిట్లోనే వదుల్చుకునే సంస్కృతికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ఆయన పేరు విస్తరించింది. దీంతో ఆయన దగ్గర్లోని వైద్యశాలలకు వెళ్లి ఉచితంగా ప్రసూతి సేవలు ఎలా అందించవచ్చో అవగాహన కల్పిస్తుండడం విశేషం.

More Telugu News