Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమె నేపాలీలకు ప్రత్యక్ష దైవం...అపరకాళి అవతారం!

పన్నెండేళ్ల బాలిక సమితా భట్టాచార్యను ప్రత్యక్ష దైవం... అపరకాళి అవతారంగా భావిస్తూ పూజిస్తున్నారు నేపాల్ ప్రజలు. నేపాలీలు ప్రత్యక్ష దైవంగా భావించే కుమారీలను నేవారీ జాతికి చెందిన శాక్య లేదా బర్జాత్యాల కుటుంబాలకు చెందిన వారిని అనేక పరీక్షల అనంతరం విజయం సాధించిన వారిని ఎన్నుకుంటారు. వీరు ముఖ్యంగా ఖాట్మండులో ఉంటారు. తాజా తేలేజు (కుమారి)గా రాజధాని ఖాట్మండు దగ్గర్లోని లలిత్ పూర్ ప్రాంతంలో నివసించే సమితను ఎన్నుకున్నారు.

కుమారి రజస్వల కాగానే ఆమెలో దైవత్వం పోతుందని అక్కడివారి నమ్మకం. అప్పటి నుంచి మరో కుమారిని ఎన్నుకునేందుకు పరీక్షలు జరుగుతాయి. సమిత భట్టాచార్య నియమనిష్టలతో ఉండాలి. పండగల్లో కాలు కిందపెట్టకూడదు. అందరూ ఆమెను కొలిచేందుకు వస్తారు. పూజలు, పునస్కారాలు చేస్తారు. ఈ నేపధ్యంలో కుమారి తల్లిని మీ అమ్మాయిని దేవతగా కొలవడం ఎలాంటి అనుభూతినిస్తుంది? అంటూ ప్రశ్నిస్తే... దేవతగా పూజించడం సంతోషంగా ఉందని, కానీ, నియమనిష్టలు పాటించడం, ఆమెను ప్రత్యేకంగా తయారు చేయడం కాస్త కష్టంగా ఉన్నాయని చెబుతారు.

కుమారీల నియమాలపై సమితకు ముందు పదేళ్లు కుమారిగా ఉన్న చనీరా బజ్రాచార్య వ్యాఖ్యానిస్తూ, సందుల ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూసేదానినని, తన దైవత్వం వీడిన తరువాత నడవడం తెలియలేదని, తన తల్లిదండ్రులే నడక నేర్పించారని తెలిపారు. దేవతగా ఉన్నప్పుడు మహారాణికి జరిగినట్టు సకలోపచారాలు జరుగుతాయని తెలిపారు. చదువు కూడా టీచర్లు ఇంటికి వచ్చి చెప్పేవారని తెలిపారు.

అంతకు ముందు చదువు చెప్పేవారు కాదనీ స్కూల్లో ఎవరూ మాట్లాడేందుకు ప్రయత్నించే వారు కాదని, టీచర్లు కూడా ప్రత్యేకంగా చూసేవారని, దేవత అని పిలిచేవారని చనీరా తెలిపారు. చనీరాకు 15 ఏళ్లు వచ్చినప్పుడు రజస్వల అయ్యారు. దీంతో తనను దేవతగా కొలవడం మానేశారని, అన్నీ మామూలుగానే ఉన్నాయని, తన జీవితం ఇలా అయిపోతుందని తానెప్పుడూ అనుకోలేదని చనీరా పేర్కొన్నారు. తరువాత జరిగిన పరీక్షల్లో నెగ్గిన సమీత కుమారిగా ఎంపికయ్యారు. దీంతో ఆమె నేపాలీల ప్రత్యక్ష దేవతగా పూజలందుకుంటున్నారు.

More Telugu News