కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీల్లోకి జంప్ కావడానికి 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రకటించడంతో వారెవరా? అన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన ఆయన కుమార్తె పెళ్లికి టీడీపీ దండు తరలిరావడం అనుమానాలను బలపరుస్తోంది. మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ కూడా మారతారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఎప్పుడో ఖాయమైపోయింది.

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జగ్నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు హస్తాన్ని వదిలేసేలా ఉన్నారని సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు, అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, తమ్ముడు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. రానున్న నెలా రెండు నెలల్లో గోడదూకటాలు తారస్థాయికి చేరనున్నాయి.