కసబ్ వివరాలను బహిరంగపరచిన హోంమంత్రిని డిస్మిస్ చేయండి: శివసేన
మహరాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ని వెంటనే కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని శివసేన ఎమ్మెల్సీ అనిల్ పరబ్ రాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ ను కోరారు. కరడుగట్టిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు సంబంధించి పాటిల్ ఓ మరాఠీ మేగజీన్ లో నాలుగు పేజీల ఆర్టికల్ రాశారని ఆయన ఆరోపించారు. ఇందులో జైలు బ్యారక్స్ లో కసబ్ ప్రవర్తన, ఎరవాడ జైలులో ఉరి, అంత్యక్రియలపై సవివరంగా రాశారని విమర్శించారు. రాష్ట్ర హోం మంత్రిగా ఉంటూ అత్యంత గోప్యమైన విషయాలను ఎలా బహిర్గతం చేస్తారని అనిల్ పరబ్ ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసిన పాటిల్ పై కఠిన చర్యలను తీసుకోవాలని గవర్నర్ ను అనిల్ కోరారు.