రానున్న 48 గంటల్లో తుపాను... ఉత్తరకోస్తాకు పొంచి ఉన్న పెను ముప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానున్న 48 గంటల్లో తుపాను... ఉత్తరకోస్తాకు పొంచి ఉన్న పెను ముప్పు

అండమాన్ తీరం దాటిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరకోస్తాకు పెనుముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. దీంతో, రాష్ట్ర సర్కారు అప్రమత్తత ప్రకటించింది. మంత్రి రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న 48 గంటల్లో దీని ప్రభావంతో 182 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు స్పష్టం చేశారు.

కాగా, సహాయక చర్యల సమన్వయం కోసం సెక్రటెరియట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. దాని నెంబర్ 23456005 అని చెప్పారు. కోస్తా తీరం వెంబడి 9 జిల్లాల్లోనూ సీనియర్ ఐపీఎస్ అధికారులను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. 50 మంది అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచామని రఘువీరా తెలిపారు. ఓ హెలీకాప్టర్ కూడా తీసుకున్నామని.. ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని అన్నారు. మరలా సూచనలిచ్చే వరకు వేటకు వెళ్లవద్దని ఆయన మత్స్యకారులకు సూచించారు. లోతట్టు ప్రాతాల్లో ఉన్నవారికి ఆశ్రయం కల్పించేందుకు 850 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

తుపాను నేపథ్యంలో ఉద్యోగులను సమ్మె విరమించాలని కోరామని ఆయన తెలిపారు. ఉద్యోగులు కూడా తమ సహకారం అందజేస్తామని తెలిపారని రఘువీరా అన్నారు. తుపానుకు 'ఫైలిన్' అనే పేరు ఖరారు చేసే అవకాశముందని ఆయన అన్నారు.

More Telugu News