సరబ్ జిత్ కుమార్తెకు పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరబ్ జిత్ కుమార్తెకు పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగం

పాకిస్తాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో మే 2న మరణించిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకువచ్చింది. సరబ్ జిత్ కుమార్తె స్వప్నదీప్ కౌర్ (25) ను పంజాబ్ ప్రభుత్వం రెవిన్యూ అధికారిణిగా నియమించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అపాయింట్ లెటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా బాదల్ మాట్లాడుతూ.. పాక్ జైలులో తీవ్ర వేదన అనుభవించిన సరబ్ జిత్ జాతి కోసం అమరవీరుడయ్యాడన్నారు. అతని కుమార్తెకు ఉద్యోగం ఇవ్వడం సరబ్ త్యాగానికి గుర్తింపని చెప్పారు. దేశంకోసం ప్రాణాలు విడిచిన వారిని ఇలా గౌరవించడం తమ ప్రాథమిక బాధ్యత అని తెలిపారు.

మే నెలలోనే సీఎం బాదల్.. సరబ్ ఇద్దరి కుమార్తెలకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. అందుకు తగ్గట్టే రెండో కుమార్తెను ఓ స్కూల్ టీచర్ గా నియమించారు. అతని కుటుంబానికి ఆర్ధిక సాయంగా కోటి రూపాయలు ఇచ్చారు. భారత గూఢచారి అన్న ఆరోపణలతో 1999 ఆగస్టులో సరబ్ జిత్ ను పాక్ అరెస్టుచేసింది. 20 సంవత్సరాల నుంచి పాక్ జైళ్ళలో ఉంటున్న సరబ్ ను విడిచిపెట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఏప్రిల్ 26న లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైల్లో తోటి ఖైదీలు సరబ్ పై దాడి చేశారు. దాంతో, తీవ్రంగా గాయపడిన అతను, జిన్నా ఆసుపత్రిలో ఆరు రోజుల పాటు కోమాలో ఉండి ప్రాణాలు విడిచాడు.

More Telugu News