మహిళలను కలవరపరిచే మెనోపాజ్... దీనిపై దృష్టి పెట్టండి!

అప్పటి వరకూ ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గిపోతుంది. లైంగికాసక్తి సన్నగిల్లుతుంది. రుతుక్రమం గతి తప్పుతుంది. చివరికి రుతు చక్రాలు పూర్తిగా నిలిచిపోతాయి. స్త్రీలలో ఈ దశనే మెనోపాజ్ గా చెబుతారు. హార్మోన్ల ఉత్పత్తి కూడా నిలిచిపోయే ఈ దశలో స్త్రీలు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.


ఏమిటి ఈ దశ
12 నెలలుగా నెలసరి రావడం ఆగిపోతే దాన్ని మెనోపాజ్ గా తేల్చి చెబుతారు. రుతుచక్రం ఆగిపోవడం అంటే వారిలోని ఓవరీలు పనిచేయడం పూర్తిగా నిలిచిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది రాత్రికి రాత్రే జరగదు. క్రమంగా జరుగుతుంది. ఇలా క్రమంగా జరిగే దశను పెరిమెనోపాజ్ ట్రాన్సిషన్ పీరియడ్ (మెనోపాజ్ ప్రారంభ దశ) గా చెబుతారు. ప్రతీ మహిళకు ఈ సమయంలో భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి.

మెనోపాజ్ దశలో స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. హార్మోన్లు అన్నవి రక్తం ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ... శరీరంలోని అన్ని వ్యవస్థల్లో శారీరక, రసాయనిక చర్యలు ప్రారంభం, నిలిచిపోవడం, పెంచడం, తగ్గించడం వంటి చర్యలకు కారణమవుతాయి. మహిళల్లో ఓవరీలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తికి మూల కేంద్రం. ఈ రెండు హార్మోన్లు మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ అంటే రుతుచక్రం, సంతానోత్పత్తిని నిర్ణయిస్తాయి. మెనోపాజ్ సమయంలో ఒవేరియన్ ఫాలికుల్స్ తగ్గిపోతాయి. దీంతో ఓవరీలు పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లకు స్పందించడం తగ్గిపోతుంది. దీంతో మొత్తం మీద హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇదే మెనోపాజ్ దశలో ప్రధానంగా జరిగేది. ఇదే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఏ సమయంలో?
మెనోపాజ్ అన్నది ఎక్కువ మందిలో 45 నుంచి 51 ఏళ్ల సమయంలో మొదలవుతుంది. కొద్ది మందిలో ముందుగానే 30 సంవత్సరాలకే ప్రారంభం కావచ్చు. కొందరిలో ఆలస్యంగా 60 ఏళ్లప్పుడు కూడా మొదలు కావచ్చు. ఎప్పుడు ఇది మొదలవుతుందని చెప్పేందుకు ఎటువంటి పరీక్షలు లేవు. మెనోపాజ్ ప్రారంభం కావడానికి వారు ఏ వయసులో మెచ్యూర్ అయ్యారన్న అంశం పాత్ర లేదు.  

ఎలా గుర్తించొచ్చు...
ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే ఆ ప్రభావం శరీరంలో ఎన్నో వ్యవస్థలపై పడుతుంది. మెదడులో నాడీ వ్యవస్థపై, మూత్రకోశం, గుండె, రక్తనాళాలు, ఎముకలు, వక్షోజాలు, చర్మం, శిరోజాలు, మ్యూకస్ మెంబ్రేన్లు, పెల్విక్ కండరాలపై ప్రభావం ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రభావాలకు లోనైతే లక్షణాలు బయటకు కనిపిస్తాయి. చాలా వరకు లక్షణాలనేవి మెనోపాజ్ ప్రాథమిక దశలోనే బయటపడతాయి. కొన్నేళ్ల పాటు ఉండొచ్చు. అయితే అందరిలోనూ ఇలానే జరగాలని లేదు. కొంత మంది మహిళలు ఎటువంటి లక్షణాలు, సమస్యల్లేకుండా మెనోపాజ్ లోకి అడుగుపెడతారు.

మెదడు, నాడీ వ్యవస్థపై...
ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల జీవ రసాయనిక చర్యల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. దీంతో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు, అలసట, వేడి ఆవిర్లు, రాత్రులు చెమటలు పట్టడం, ఒత్తిడి, ఆందోళన, మానసికంగా కుంగిపోవడం ఇలా ఎన్నో విధాల లక్షణాలు కనిపిస్తాయి. దీంతో నిద్ర సరిగా పట్టక ఇబ్బందిని ఎదుర్కోవచ్చు.

గుండెపై...
ఈస్ట్రోజన్ హార్మోన్ లోపించడం వల్ల గుండె, గుండె రక్తనాళాల సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. ఫలితంగా గుండెపోటు, మెదడుకు రక్త సరఫరా తగ్గి స్ట్రోక్ రావడం, ఇతర గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలుంటాయి. ఒకవేళ గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీ శస్త్రచికిత్స చేయించుకుంటే, లేదా ఓవరీలను తొలగించే ఊఫొరెక్టమీ చేయించుకున్నవారు, ముందుగానే మెనోపాజ్ దశకు చేరిన వారికి గుండె జబ్బుల ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. మెనోపాజ్ దశలో ఇంత ప్రమాదం ఉంటుందా? అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో కుటుంబ చరిత్ర, జీవన విధానం, తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

పునరుత్పత్తి వ్యవస్థ
సంతానం కలిగే అవకాశాలు మెనోపాజ్ తో ముగిసిపోయినట్టే. ఎందుకంటే ఒవేరియన్ పనితీరు ఆగిపోయి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కనుక. యవ్వనం ప్రారంభమైన దగ్గర నుంచి నెలనెలా వచ్చే పీరియడ్స్ మెనోపాజ్ తో ఆగిపోతాయి. దాంతో ఇకపై గర్భధారణకు అవకాశం ఉండదు. మెనోపాజ్ దశ ప్రారంభంలో క్రమం తప్పి పీరియడ్స్ వస్తుంటాయి. అధికంగా రక్తస్రావం లేదా కొంచెమే రక్తస్రావం కనిపిస్తుంది. అంతేకాదు, ఒక పీరియడ్ నుంచి తదుపరి పీరియడ్ కు మధ్య సమయం పెరిగిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు. మహిళల్లో నెలలపాటు పీరియడ్స్ ఆగడం సాధారణంగా రెండు సందర్భాల్లోనే జరుగుతుంది. గర్భం దాల్చినప్పుడు, మెనోపాజ్ లోకి ప్రవేశించినప్పుడు. వరుసగా 12 నెలల పాటు పీరియడ్స్ రాలేదంటే మెనోపాజ్ లోకి వెళ్లినట్టే. అంతకాలం పాటు రాకుండా ఆ తర్వాత ఒక్కసారిగా రక్తం కనిపిస్తే కేన్సర్ ఉందో, లేదో అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

ఎముకలు కుదేలు
30 ఏళ్ల తర్వాత శరీరంలో ఎముకల వృద్ధి అన్నది ఎముకల క్షీణత అంత స్థాయిలో ఉండదు. ఇక మెనోపాజ్ లో ఈస్ట్రోజన్ హర్మోన్ పడిపోవడం వల్ల ఎముకల్లో ఖనిజ సాంద్రత తగ్గిపోతుంది. దీంతో ఆస్టోపీనియా, ఆస్టో పోరోసిస్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. మెనోపాజ్ వచ్చిన ఐదు, పదేళ్ల తర్వాత ఎముకల సాంద్రత మరింత క్షీణించడం వల్ల ఫ్రాక్చర్లు, ఎముకల గాయాల ముప్పు పెరిగిపోతుంది.  

చర్మంపై
మన శరీరమంతటినీ కప్పి ఉంచే చర్మం మెనోపాజ్ కారణంగా మార్పులకు గురవుతుంది. ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల శరీరంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. దాంతో చర్మం సాగే తత్వం కూడా తగ్గిపోతుంది. పొడితనం పెరిగి దురదలు, చర్మం ముడతలు పడడం జరుగుతుంది. గాయాలైతే త్వరగా మానవు కూడా. చర్మం గాయాలకు గురైనప్పుడు అవి త్వరగా మానేందుకు ఈస్ట్రోజన్ తోడ్పడుతుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది.

మూత్రకోశంపై
ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మూత్రకోశం పొడిగా, సన్నగా మారి, సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు మూత్రం లీకవుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఈ విధమైన ఇన్ఫెక్షన్ల నుంచి సహజంగా రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.

జననేంద్రియాలపైనా ప్రభావం
ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గడంతో స్త్రీ జననేంద్రియాల్లో పొడితనం పెరిగిపోతుంది. దీంతో చిరాకు, అసౌకర్యం కలుగుతాయి. కండరాలు కుచించుకుపోతాయి. అదే సమయంలో లూబ్రికేషన్ సైతం తగ్గిపోతుంది. ఈ విధమైన పరిస్థితుల్లో జీవిత భాగస్వామితో శారీరకంగా కలవడం అసౌకర్యంగా, బాధగా అనిపిస్తుంది.

మెనోపాజ్ ను ఎదుర్కోవడం ఎలా...?
ప్రతీ మహిళకు ఏదో ఒక దశలో మెనోపాజ్ తప్పనిసరి. కాకపోతే ఈ దశలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు ఆధారంగా తాము మెనోపాజ్ లోకి వెళుతున్నామా అనేది గమనించుకుంటూ ఉండాలి. ప్రారంభంలోనే గుర్తించి వాటి ప్రభావం శరీరంలోని ఏదైనా వ్యవస్థలపై పడుతుందా? అన్నది కనిపెట్టాలి. వైద్యులను సంప్రదించి, సమగ్ర పరీక్షలు చేయించుకుని, వారు సూచించే చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెనోపాజ్ దశలో ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకోవచ్చు.

హార్మోన్ థెరపీ
మెనోపాజ్ లో ఓవరీలు పనిచేయకపోవడం, శారీరక మార్పుల కారణంగా హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి పలు లక్షణాలు, ఇబ్బందులు కనిపిస్తుంటే వైద్యులు తగ్గిన హార్మోన్లను బయటి నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. గర్భాశయం కలిగి ఉన్న మహిళలకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిన్ (ప్రొజెస్టరాన్ కు సింథటిక్ రూపం) టాబ్లెట్లను కలిపిన చికిత్సను సిఫారసు చేస్తారు. ఒక్క ఈస్ట్రోజన్ ను మాత్రమే వాడితే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అందుకే దీనికి రక్షణగా ప్రొజెస్టిస్ ను కూడా సూచిస్తారు. ఇటీవలి కాలంలో డవీ అనే మందు కూడా వచ్చింది. ఇందులో ఈస్ట్రోజన్లు, బజెడాక్సీఫెన్ ఉంటాయి. దీనికి ఎఫ్ డీఏ ఆమోదం ఉంది. ఈ టాబ్లెట్లు వేడి ఆవిర్లు, ఆస్టియోపోరోసిస్ ను నివారిస్తాయి.

గర్శసంచి తొలగించిన వారికి వైద్యులు కేవలం ఈస్ట్రోజన్ థెరపీ మాత్రమే సూచిస్తారు. ఇక గర్భాశయం ఉండి ఈస్ట్రోజన్ ప్రారంభ దశలో ఉన్న కొంత మంది మహిళలకు ప్రొజెస్టరాన్ మాత్రమే సూచిస్తుంటారు. ఈ థెరపీతో వేడి ఆవిర్లు తగ్గుతాయి. హార్లోన్ల చికిత్సలో నోటి ద్వారా తీసుకునే మందులున్నాయి. క్రీమ్ లేదా జెల్ రూపంలో చర్మంపై అప్లయ్ చేసుకునే చికిత్స కూడా ఉంది. హార్మోన్లతో కూడిన ప్యాచ్ లను చర్మంపై అంటించుకునేవీ ఉన్నాయి. నేరుగా జననేంద్రియాల ద్వారా తీసుకునే ముందులూ ఉన్నాయి. ఈ మందుల వల్ల తక్కువ మందిలో దుష్ప్రభావాలకు అవకాశం లేకపోలేదు. అయితే, వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే అవసరమైతే మార్పులు, చేర్పులు వారే సూచిస్తారు. క్రమం తప్పకుండా వైద్యులను కలుస్తూ వారి సూచన, సలహాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మెనోపాజ్ లోనూ హ్యాపీగా ఉండొచ్చు. మెనోపాజ్ లక్షణాలను పట్టించుకోకుండా వదిలేయడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.


More Articles