వివిధ దశల్లో ఉద్యోగాన్వేషణ ఎలా?

ఉద్యోగం సంపాదించడం అన్నది కొందరికి చాలా సులభం. చిటికెలో పని. కొందరికి మాత్రం అదో పెద్ద టాస్క్. ఒక ఉద్యోగం విడిచి పెట్టాలంటే జంకు. కొత్తగా ఉద్యోగం కోసం పోటీ పడాలంటే బెరుకు. ఉద్యోగం పొందేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారున్నారు. ఈ నేపథ్యంలో జీవితంలో వివిధ దశల్లో (వయసును బట్టి) ఉద్యోగ అన్వేషణలో విజయవంతం అయ్యేందుకు కొత్తగా ఏం చేయాలన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా చూద్దాం.

representational image20+ వయసులో..
అప్పుడే కాలేజీ నుంచి పట్టాతో బయటకు అడుగు పెట్టి ఉంటారు. మంచి ఉత్సాహం మీదుంటారు. ఉద్యోగం సంపాదించుకుని గొప్పవాళ్లమని నిరూపించుకోవాలనే కసితోనూ ఉంటారు. కానీ, అనుభవం ఉండకపోవచ్చు. ఫ్రెషర్ అన్న ట్యాగ్ తో ఉంటారు. ఒక విధంగా ఉద్యోగం సంపాదించేందుకు ఫ్రెషర్ కూడా ఓ అర్హతే. అదే సమయంలో అనుభవం ఉంటే సంపాదించే ఉద్యోగాలు, వేతన ప్యాకేజీలు మరో విధంగా ఉంటాయి. అందుకే నేటి తరం కాలేజీ విద్య నుంచే పార్ట్ టైమ్ జాబ్ రూపంలో అనుభవం సంపాదించే ప్రయత్నాల్లో ఉంటున్నారు. 

కళాశాల స్థాయిలోనే చేస్తున్న కోర్సును బట్టి... అందుకు అనుబంధ రంగాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవడం ముందు ముందు బాగా అనుకూలిస్తుంది. విద్య పూర్తయిన వెంటనే ఆ రంగానికి సంబంధించి చక్కని ఉద్యోగాన్ని తేలిగ్గా సంపాదించుకోవచ్చు.ఈ విధమైన అనుభవం లేకపోతే నిరాశ చెందాల్సిన పనేలేదు. ముఖ్యంగా ఉద్యోగ అన్వేషణకు సంబంధించి ఏ దశలోనూ నిరాశను దగ్గరకు రానీయకూడదు. అప్పుడే సక్సెస్ దరి చేరుతుంది. నేడు మల్టీ నేషనల్ కంపెనీలు యువకులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే యువత తక్కువ వేతనాలకే అందుబాటులో ఉంటారు గనుక. పైగా అనుభవం ఉన్న వారికంటే ఫ్రెషర్ల లభ్యత అధికం. ఇంకా నేడు టెక్నాలజీలు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఐటీ రంగంలోనూ టెక్నాలజీలు వేగంగా మారిపోతున్నాయి. అందుకే అనుభవం ఉన్న వారు సైతం ఫ్రెషర్లుగా మారి కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఫ్రెషర్లు, అనుభవం ఉన్న వారు అంటూ ఈ విధమైన భారీ గీతలు నేడు పలుచనపడుతున్నాయి. కనుక ఫ్రెషర్లు ఉద్యోగ అన్వేషణ విషయంలో ఏ మాత్రం జంకాల్సిన పనిలేదు.

కళాశాల విద్య అయిన తర్వాత ఏ రంగంలో అయితే ఉద్యోగాన్వేషణ చేస్తున్నారో ఆ రంగానికి సంబంధించి నియామకాల తీరుతెన్నులపై పరిశీలన చేయడం అవసరం. దీంతో హైరింగ్ మేనేజర్లు అభ్యర్థుల నుంచి ఏమి ఆశిస్తున్నారన్న విషయాలు తెలుస్తాయి. నోటిఫికేషన్లలో ఎక్కువ ఫ్రెషర్లకు అవకాశం ఇస్తున్నారా? లేక ప్రత్యేకంగా ఏదేనీ అనుభవం ఆశిస్తున్నారా? అన్నది గమనించాలి. అనుభవం కోరుతుంటే అందుకు సంబంధించి స్వల్ప కాలం పాటు శిక్షణ పొందడం ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు ఐటీ రంగలోకి వెళ్లాలనుకుంటే ఒక్క దానికే పరిమితం కాకుండా రెండు మూడు వెర్టికల్స్ కు సంబంధించిన కోర్సులను చేయడం అదనపు అర్హతలనిస్తుంది. అంతేకాదు, ఉద్యోగం పొందిన తర్వాత నిలదొక్కుకునేందుకు ఈ అనుభవం, కోర్సులు ఉపయోగపడతాయి.

representational image30+ వయసులో...
సాధారణంగా ఈ వయసులో చేసే ఉద్యోగాన్వేషణ వెనుక మెరుగైన వేతన ప్యాకేజీ లేదా ప్రస్తుత కంపెనీలో రోల్స్ లేదా వాతావరణం నచ్చకపోవడం తదితర అంశాలు ఉండి ఉంటాయి. ఫ్రెషర్ కంటే అనుభవం ఉన్న వారిగా 30లలో చేసే ఉద్యోగాన్వేషణ భిన్నంగా ఉంటుంది. ఫ్రెషర్లకు బోలెడు అవకాశాలు. ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. కానీ, ఎక్స్ పీరియెన్స్ డ్ వారికి ఫ్రెషర్లతో పోలిస్తే తక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో తాము సమర్థులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత మరింత ఉంటుంది. సాధారణంగా మధ్య వయసు కాబట్టి జీవిత భాగస్వామి, పిల్లల రూపంలో తనపై ఆధారపడిన కుటుంబం ఉంటుంది. ఉద్యోగాన్వేషణ, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారిపోవడం వంటి సమయాల్లో కుటుంబ పోషణావసరాలకు సరిపడా ఓ మూడు నెలల బడ్జెట్ ను పక్కన పెట్టుకోవాలి.

లీడర్ షిప్ నైపుణ్యాలు ఈ దశలో ఉద్యోగాన్వేషణకు తోడ్పడతాయి. సహజంగా అనుభవం ఉన్న వారిగా సీనియర్ పొజిషన్లకు ప్రయత్నిస్తుంటారు కాబట్టి బాధ్యతలు కూడా అదే విధంగా ఉంటాయి. వాటిని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇంకా ఈ రంగంలో ఉన్న వారితో పరిచయాలు కూడా కీలకం అవుతాయి. అందుకే పనిచేస్తున్న రంగంలో సీనియర్లతో ఎప్పుడూ సఖ్యతతో మెలుగుతూ ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నూతన ధోరణులపై నిపుణులతో ఏటా ఓ సదస్సు నిర్వహించడం ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఆ సమావేశంలో మీదైన ప్రసంగం ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీలోని చొరవ, ఉత్సాహం, ఆసక్తి ఆ రంగంలోని ప్రముఖులకు తెలుస్తాయి. మిమ్మల్ని మీరు ఫాస్ట్ ఫార్వార్డ్ గా పరిచయం చేసుకునేందుకు కాన్ఫరెన్స్ లు, శిక్షణా కార్యక్రమాలు మేలు చేస్తాయి.

మేనేజర్లు, బాస్ లతో సత్సంబంధాలు ఏదో రూపంలో అక్కరకు వస్తాయి. అవసరమైన సందర్భాల్లో వారి రిఫరెన్స్ లు నూతన ఉద్యోగాన్వేషణలో సాయపడతాయి. మీకంటే సీనియర్ పొజిషన్  లో ఉన్నవారు కంపెనీని వీడి మరో కంపెనీలో మెరుగైన జాబ్ లో సెటిలైతే... వారు అవకాశాలు ఇచ్చే వారిలో ముందు మాజీ సహచరులే ఉంటారు. ప్రొఫెషనల్ నెట్ వర్క్ కూడా అవసరమే. ఇందుకు లింకెడిన్ సరైనది. మీకు తోచిన అద్భుత వ్యాఖ్యాలతో రూపొందించిన రెజ్యుమే కంటే ఓ వ్యక్తి తన కెరీర్, వృత్తిపరమైన నైపుణ్యం, అర్హతలు తదితర వివరాలతో లింకెడిన్ ప్రొఫైల్ ను చక్కగా తీర్చిదిద్దడం అదనపు క్వాలిఫికేషన్ అవుతుంది. ఇంకా ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీలు కూడా ఉపయోగపడతాయి. సంబంధిత రంగానికి సంబంధించిన వార్తలు, ఇతర అంశాలతో ట్వీట్స్ చేస్తుంటే అదే రంగంలోని ప్రముఖులనూ చేరతాయి. దాంతో మీరేంటో ప్రత్యేకంగా పరిచయం చేసుకోనక్కర్లేదు. ఇంకా మీకు సమయం, ఓపిక ఉంటే పనిచేస్తున్న రంగానికి సంబంధించి ఓ బ్లాగ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రంగంలోని ప్రముఖులు, సీఈవోలు, సీనియర్ మేనేజర్లతో ఇంటర్వ్యూలు తీసుకుని వాటిని బ్లాగు లేదా ట్విట్టర్ వేదికగా వెల్లడించడం వల్ల మంచి సక్సెస్ సాధించొచ్చు. ఈ పరిచయాలు, అనుభవాలు అదే రంగంలో మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు దారితీస్తాయి.

representational image40+ వయసులో
కెరీర్ లో ఇది మిడిల్ పాయింట్ (మధ్యస్థ దశ). వేతన జీవులకు, వృత్తి నిపుణులకు ఎక్కువ ఆదాయం తెచ్చి పెట్టే దశ. అంతేకాదు, ఉద్యోగ బాధ్యతల పరంగా మీరెంత సమర్థులో కొత్త కంపెనీ రిక్రూటర్ వద్ద నిరూపించుకోవాల్సిన దశ. ఎందుకంటే సాధారణంగా ఈ వయసులో ఆశించే వేతనాలు కూడా అధికంగానే ఉంటాయి. మరి ఆ వేతన స్థాయిలకు తగ్గ సమర్థత మీలో ఉందని నిరూపించుకోక తప్పని పరిస్థితి. ఈ దశలో ఉద్యోగాన్వేషణ అన్నది భిన్నంగా ఉండాలి. ప్రొఫెషనల్ గా మీకున్న నెట్ వర్క్ పరిధిలో అవకాశాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. అదే సమయంలో ఆన్ లైన్ వేదికగానూ ప్రయత్నాలు సాగాలి. సాధారణంగా కెరీర్ పరంగా ఈ వయసులో కనీసం 10 - 15 ఏళ్లకుపైనే అనుభవం సంపాదించి ఉంటారు. విలువైన నైపుణ్యాలను మీ బాస్కెట్ లో వేసుకుని ఉంటారు. కనుక కొత్త రోల్స్, ప్రస్తుత అనుభవానికి సరిపోలని ఉద్యోగాలను ట్రై చేయొద్దు.

కొత్త కంపెనీలో మీకప్పగించే బాధ్యతలను మీరెంత సమర్థంగా నిర్వహించగలరు, కంపెనీకి అదనపు ప్రొడక్టివిటీని ఏ విధంగా తీసుకురాగలరు, ఇంకెంత గొప్పగా చేయవచ్చన్న అంశాలను వివరించే ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. ఎందుకంటే ఈ వయసులో ఉన్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటే కంపెనీలు అధికంగా వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి మీరు ఏ మేరకు విలువను చేకూర్చగలరో తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. కుటుంబ పరమైన బాధ్యతల కారణంగా, పర్సనల్ లైఫ్ ప్రాముఖ్యత కోణంలో తక్కువ బాధ్యతలు ఉండే జాబ్ ను కోరుకోవడం సరైనది కాదు. మీ కంటే చిన్న వయసులోని వారు మీపై అధికారం చలాయించే పొజిషన్ లో ఉండకూడదన్న భావనలోనూ ఉండొద్దు. మీకున్న సామర్థ్యాలపైనే ఫోకస్ చేయాలి గానీ లేని వాటి గురించి సంకోచిస్తూ ఉండొద్దు. వయసులో ఉన్న వారికి మించి కంపెనీకి లాభం చేకూర్చగలన్న పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. మరీ ముఖ్యంగా రెజ్యుమే పరంగా అస్సలు తప్పులుండకూడదు. ఇప్పటి వరకు కెరీర్ లో మీరు సాధించిన ప్రగతి, గతంలో పనిచేసిన కంపెనీల్లో నిర్వహించిన బాధ్యతలు తదితర సమాచారాన్ని హైలైట్ చేయాలి.

representational image50+ వయసులో
కెరీర్ లో ఇప్పటి వరకూ సాగించిన అన్వేషణ వేరు. 50 ఏళ్ల తర్వాత ఉద్యోగాన్వేషణ వేరు. సాధారణంగా ఈ వయసులో అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. ఎక్కువ శాతం కంపెనీలు 50 ఏళ్లు పైబడిన వారిని తాజాగా ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపించవు. అందుకే ఉన్న పరిమిత అవకాశాల నుంచే మీకంటూ అవకాశాన్ని అందుకోవాలంటే నైపుణ్యాల పరంగా, అర్హతల పరంగా మీరు మెరుగైన స్థానంలో ఉండాలి. లింకెడిన్ ప్రొఫైల్, రెజ్యుమే తప్పుల తడక కాకుండా అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. ఈ వయసులో అవకాశం ఇవ్వడం వల్ల కంపెనీకి భారం కానేకాదని, తన నైపుణ్యాలు కంపెనీకి అక్కరకు వస్తాయని, ఏ విధమైన బాధ్యతలు అప్పగించినా చేయగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసేలా ఉండాలి. అలాగే, శారీరకంగా, మానసికంగా ఫిట్ గానూ ఉండడం అవసరమే.


More Articles