తరచూ అలెర్జీ సమస్యలు... ఎందుకని?

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా... అలెర్జీ అన్న పదం వినిపిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిలో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. తుమ్ములు, దగ్గు, ముక్కు కారటం, దురదలు ఇలా అలెర్జీ వలన కనిపించే లక్షణాలు, సమస్యలు చాలా మందికి అనుభవమే. ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 30 శాతం మంది వరకు అలెర్జీ బాధితులే. ఆధునిక కాలంలో బాగా విస్తరించిపోయిన ఈ సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అలెర్జీ అంటే ఏంటి...?
representational imageఆహారం, పుప్పొడి రేణువులు, దుమ్ములోని పురుగులు (డస్ట్ మైట్స్), మందులు, ఇలా ఎన్నో వాటి వల్ల ఈ సమస్య వస్తుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ అన్నది మన శరీరంలో అతి క్లిష్టమైన వ్యవస్థ. వైరస్, బ్యాక్టీరియా, టాక్సిన్ల (ఫారీన్ సబ్ స్టాన్స్/ఫారీన్ ఇన్వేడర్స్) నుంచి మన శరీరాన్ని కాపాడుతూ ఉండే వ్యవస్థ. అలెర్జీ కారకాలు మన శరీరంలోకి చొరబడడం ఆలస్యం వీటిని హానికారకాలుగా గుర్తించిన ఆ క్షణమే రోగ నిరోధక వ్యవస్థ వాటిపై దాడి మొదలు పెడతుంది. ఉదాహరణకు ఓ పుప్పొడి రేణువు (అలెర్జీ కారకం) మన శరీరంలోకి ప్రవేశించిందనుకోండి. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థ ఆ పుప్పొడి ఎక్కడ ఉందో గుర్తిస్తుంది. దానిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీ బాడీలనే ఇమ్యునోగ్లోబులిన్లు (వీటిలోనూ ఐజీఈ, ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ రకాలున్నాయి) అంటారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి ప్రయాణం చేసి పుప్పొడిపై దాడికి గాను రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవే అలెర్జీ రియాక్షన్ కు కారణం అవుతాయి. ఈ రియాక్షన్ ముక్కు, ముక్కు నాసికా కుహరములలోను, గొంతు, ఊపిరితిత్తులు, చెవులు, కడుపు, చర్మంలోపల లక్షణాలకు దారితీస్తుంది. కొన్ని పదార్థాలే ఎందుకు అలెర్జీకి దారితీస్తాయి, వేరేవి ఎందుకు కారణం కావన్న దానికి ఇంత వరకు కచ్చితమైన కారణాలు నిర్ధారణ కాలేదు. అలాగే, కొందరు అలెర్జీకి లోనైతే, అవే కారకాలు మరికొందరిలో అలెర్జీకి దారితీయకపోవడం వెనుకనున్న కారణాలను కూడా పరిశోధనలు ఇతమిద్ధంగా తేల్చలేదు.  

అలెర్జిక్ రైనైటిస్ (ముక్కు కారటం), అలెర్జిక్ కంజెంక్టివైటిస్ (కంటి దురదలు, అలెర్జీలు), అలెర్జిక్ ఆస్తమా, యుర్టికేరియా (హైవ్స్), ఫుడ్ అలెర్జీలు. ఇవి అతి సాధారణంగా, ఎక్కువగా కనిపించే అలెర్జీలు. అలెర్జీ కారకాలను గాలి ద్వారా పీల్చవచ్చు. ఆహారం ద్వారా కడుపులోకి తీసుకోవచ్చు. మందులు లేదా పురుగు కాటు ద్వారా చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించొచ్చు. ఏ మార్గం ద్వారా శరీరంలోకి ప్రవేశించాయన్నదాన్ని బట్టి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఆహారంలో అలర్జీ కారకాలుంటే దాన్ని తీసుకున్నప్పుడు విడుదలయ్యే మీడియేటర్స్ చర్మంపై దద్దుర్లకు కారణమవుతాయి.

అలెర్జిక్ రైనైటిస్
representational imageఅలెర్జిక్ వ్యాధుల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. కాలానుగుణంగా లేదా ఎప్పుడూ ఉండొచ్చు. దీన్ని హేఫీవర్ అని కూడా అంటుంటారు. అదే పనిగా తుమ్ములు, ముక్కు కారటం, ముక్కులు మూసుకుపోవడం, ముక్కులో, కళ్లల్లో, నోటి పై భాగంలో దురద ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడూ వేధిస్తుంటే ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్, పెంపుడు జంతువులు, బూజు కారణం కావొచ్చు. ప్రధానంగా గాలిలో చేరిన అలెర్జీ కారకాలు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుల్లో చేరడం వల్ల ఈ సమస్య నిరంతరం వేధిస్తుంటుంది. అలెర్జీ కారకాలు ముక్కులోపలికి చేరిన తర్వాత కణజాలం వాపునకు గురవుతుంది. ఈ అలెర్జీకి కళ్లు, చెవులు, సైనస్ తోనూ సంబంధం ఉంటుంది.

యుర్టికేరియా (దద్దుర్లు)
representational imageచర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. పెద్దగా లేదా చిన్నగా ఉండొచ్చు. దురద ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, మందుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చిన్నారుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు.

అలెర్జిక్ కంజెంక్టివైటిస్
representational imageఅలెర్జీ కారకాలకు కళ్లు స్పందించినప్పుడు ఏర్పడే లక్షణాలు కళ్లు ఏర్రబారడం, దురద, వాపు. నీరు కారడం, కనుగుడ్డు చుట్టుపక్కల, కను రెప్పల లోపలి వైపు భాగంలో వాపు, మంట వుంటాయి.

ఆస్తమా
ఆస్తమా అన్నది దీర్ఘకాలిక, ఎడతెగని ఊపిరితిత్తుల సమస్య. దగ్గు, ఛాతీ బిగపట్టినట్టు ఉండడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, పిల్లికూతలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా లక్షణాల్లో శ్వాస నాళాల్లో వాపు వచ్చి అవి కుచించుకుపోతాయి. దాంతో శ్వాస కష్టంగా అనిపిస్తుంది. ఆస్తమా సమస్య ఉన్న 78 శాతం మందిలో అలెర్జిక్ రైనైటిస్ కూడా ఉంటుంది. ఈ రెండింటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎక్కువ మందిలో అలెర్జిక్ రైనైటిస్ తోనే మొదలై ఆస్తమాగా మారుతుంది. ఆస్తమా ఉన్న వారికి శ్వాసకోస ఇన్ఫెక్షన్లు వస్తే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది.

ఫుడ్ అలెర్జీ
ఫుడ్ అలెర్జీ ఉన్న వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలు సరిపడవు. దీంతో ఆ పదార్థాలు తీసుకున్నప్పుడు అందులో ఉండే అలెర్జీ కారకాలపై పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఆవు పాలు, గుడ్లు, వేరు శనగ, గోధుమ, సోయా, చేపలు, షెల్ ఫిష్, నట్స్ లో ఉండే కాంపోనెంట్స్ వల్ల ఫుడ్ అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్ (పెన్సిలిన్), యాస్పిరిన్, ఐబూప్రోఫెన్ తరహా యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ ఔషధాల వల్ల కూడా అలెర్జిక్ రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

సైనసైటిస్
representational imageనాసికా కుహరములలో ( ముక్కకు అనుసంధానంగా ముక్కు పక్కన కంటి కింద భాగంలో ఉండేవి) వాపునే సైనసైటిస్ అంటారు. సైనసైటిస్ సమస్యలో ఇలా వాపు కారణంగా రంధ్రాలు మూసుకుపోతాయి. అవి ఫ్లూయిడ్ తో పూడుకుపోతాయి. అప్పుడు క్రిములు వృద్ధి చెంది ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. తలనొప్పి, ముక్కు భాగంలో నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్స్
అనాఫిలాక్సిస్ అనేది తీవ్రమైన ప్రాణాంతక అలెర్జిక్ రియాక్షన్. ఆహార పదార్థాలు, పురుగులు కుట్టడం, మందుల వల్ల ఈ రియాక్షన్ రావచ్చు. ఒకే సమయంలో ఒకటికి మించిన ప్రాంతాల్లో ఈ రియాక్షన్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. వేడిగా ఉండడం, ఎర్రబారడం, ఎర్రగా ర్యాష్ ఉండి దురద పెట్టడం, శ్వాస సమస్య, గొంతు పట్టేసినట్టు ఉండడం, ఆందోళన, వాంతులు, డయేరియా, తిమ్మిర్లు వంటివి కనిపిస్తాయి. కొందరిలో రక్తపోటు పడిపోయి షాక్ కు లోను కావచ్చు. ఈ రియాక్షన్ కు వెంటనే చికిత్స ఇప్పించాలి. లేకుంటే ప్రాణాంతకం అవుతుంది.

అలెర్జీలు కనిపిస్తే ఏం చేయాలి...?
representational imageఅలెర్జీ సమస్యలు కనిపిస్తే ఇమ్యునాలజిస్ట్ లేదా ఎండీని సంప్రదించాలి. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక పరిశీలన, చర్మ పరీక్ష, రక్త పరీక్షల ద్వారా వైద్యులు అలెర్జీ కారకాలను గుర్తిస్తారు. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రీట్ మెంట్ కు ప్లాన్ చేస్తారు. ఇంజెక్షన్లు, టాబ్లెట్లు సూచించవచ్చు. యాంటీ హిస్టామిన్స్, నాసల్ యాంటీ హిస్టామిన్స్, నాసల్ కార్టికోస్టెరాయిడ్ డ్రాప్స్, ఆస్తమాలో ఇన్ హేలర్స్, ఓరల్ స్టెరాయిడ్స్ ఇలా  మందులు సూచిస్తారు. ఇవి కూడా దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. దాదాపు చాలా రకాల అలెర్జీలకి శాశ్వత నిర్మూలన లేదు. వాటిని అదుపు చేయడం వరకే చికిత్స. అలెర్జీలకు సమర్థవంతమైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ వాటిని పూర్తిగా నిర్మూలించే సమర్థవంతమైన చికిత్సలు సాధ్యం కాలేదు. పిల్లల్లో ఆహారం, మందుల పరంగా ఉన్న అలెర్జీలు తర్వాత కాలంలో వాటంతట అవే కనుమరుగు అయ్యే అవకాశం ఉంటుంది.

ఎవరికి రిస్క్
అలెర్జీలు ఏ వయసులోనయినా రావచ్చు. ఆహార పరమైన అలెర్జీలు మాత్రం చిన్న వయసులోనే మొదలవుతాయి. కుటుంబ చరిత్ర, జెనెటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రులకు అలెర్జీలు ఉంటే పిల్లలకూ అవి రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. సహజంగా జన్మించడం కాకుండా, సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలకు అలెర్జీల రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

నివారణ
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ఇది ఈ రోజు దాదాపుగా అసాధ్యం. ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్ వల్ల అలెర్జీలు వస్తుంటే తేమ తక్కువ ఉండేలా చూసుకోవడంతోపాటు వారానికోసారి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్లను వేడినీటితో వాష్ చేయాలి. ఇంట్లో పెంపుడు జంతువుల కారణంగా అలెర్జీలు వస్తుంటే వాటిని ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో పీల్చే వాయువును స్వచ్ఛంగా మార్చేందుకు ఎయిర్ ప్యూరిఫయర్లు మార్కెట్లో ఉన్నాయి. వాటిని వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. చల్లటి గాలి కారణంగా అలెర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ సమస్యలు వస్తుంటే ముక్కుకు వస్త్రం ధరించడం వల్ల ఉపయోగం ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అలెర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయాల్లో ఇంట్లో రూమ్ హీటర్స్ ను వాడడం మంచిది.


More Articles