ఇల్లు కట్టుకోవడానికి ఇదే సరైన సమయం... రుణంపై రూ.2.50 లక్షల రాయితీ!

మనిషి కనీస అవసరాల్లో గూడు కూడా ఒకటి. సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి లక్ష్యం. ఇందుకు తన వంతు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. సామాన్య, మధ్య తరగతి ప్రజలందరు రుణంపై ఇల్లు సమకూర్చుకునేందుకు వీలుగా కొంత భారాన్ని కేంద్రం మోస్తోంది. రుణంపై చెల్లించే వడ్డీలో సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం వివరాలు చూద్దాం.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికింద భిన్న రకాల ఆదాయ వర్గాలు ఇంటి రుణంపై వడ్డీ రేటులో సబ్సిడీ పొందేందుకు అవకాశం ఉంది. గతంలో రూ.6 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికే ఈ పథకం కింద వడ్డీ రేటుపై సబ్సిడీ కల్పించగా, తాజాగా దీన్ని 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా విస్తరించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పథకం విషయంలో కొనుగోలుదారులకు తమవంతు సాయం కూడా అందిస్తున్నాయి.

మూడు కేటగిరీలు:

రూ.6 లక్షల వార్షికాదాయం, రూ.12 లక్షల వార్షికాదాయం, రూ.18 లక్షల వార్షికాదాయం.. ఇలా మూడు కేటగిరీల వారికి మూడు రకాల సబ్సిడీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏ కేటగిరీలో ఉన్న వారైనా రుణం ఎంత తీసుకుంటే అంత మొత్తంపైనా సబ్సిడీ లభించింది. ఈ విషయంలో ప్రభుత్వం పరిమితి విధించింది. అలాగే, రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు మించకుండా ఉండాలి.

వార్షికాదాయం రూ.6 లక్షల వరకు ఉన్న వారు రుణంపై ఇల్లు సమకూర్చుకుంటే వారికి వడ్డీ రేటులో 6.5 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే ఉదాహరణకు గృహ రుణంపై 9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నారనుకోండి. 6.5 శాతం సబ్సిడీ పోను 2.5 శాతమే చెల్లించాలి. అది కూడా రూ.6 లక్షల రుణానికే ఈ సబ్సిడీ లభించేది. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. రూ.6లక్షల మొత్తంపైనే వడ్డీ రేటులో రాయితీ ఉంటుంది. మిగిలిన రూ.4లక్షలపై అసలు వడ్డీ రేటు ఎంతుంటే అంత చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద వడ్డీపై రాయితీ రూపేణా ఈ వర్గం వారికి కలిగే ప్రయోజనం రూ.2,46,625.

వార్షికాదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారు ఇంటి రుణంపై వడ్డీలో 4 శాతం సబ్సిడీ పొందవచ్చు. అది కూడా రూ.9 లక్షల మొత్తానికే. ఒకవేళ రుణం ఇంతకు మించి తీసుకుని ఉంటే మిగిలిన మొత్తంపై వడ్డీ రేటు సాధారణ రేటు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీలో రాయితీ రూపేణా వీరికి దక్కే నికర ప్రయోజనం రూ.2,39,843.  

వార్షికంగా రూ.18 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారు కూడా ఇంటి రుణంపై వడ్డీ రేటులో 3 శాతం సబ్సిడీ పొందవచ్చు. అది కూడా రూ.12 లక్షల రుణానికే గరిష్టంగా లభిస్తుంది. వడ్డీపై రాయితీ రూపేణా ఈ వర్గం వారికి కలిగే ప్రయోజనం రూ.2,44,468.

ఈఎంఐ ఎంత మేర తగ్గుతుంది..?
ఈ మూడు కేటగిరీల్లోని వారికి వడ్డీలో రాయితీ కారణంగా నెలవారీ చెల్లించాల్సిన రుణ వాయిదా (ఈఎంఐ) సుమారు రూ.2,000కు పైనే తగ్గనుంది. రూ.6 లక్షల వార్షికాదాయ పరిమితిలో ఉన్న వారికి రూ.6 లక్షల రుణంపై 6.5 శాతం సబ్సిడీ ప్రయోజనం రూపేణా నెలవారీ రూ.2,219 ఈఎంఐ తగ్గుతుంది. ఇక రూ.12 లక్షల ఆదాయ శ్లాబ్ లో ఉన్న వారు రూ.9 లక్షల రుణంపై 4 శాతం వడ్డీ రాయితీ రూపంలో ఈఎంఐ రూ.2,158 తగ్గుతుంది. ఇక రూ.18 లక్షల ఆదాయ కేటగిరీలోని వారికి రూ.12 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీగా ఈఎంఐ రూ.2,200 తగ్గుతుందని అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ వడ్డీ రాయితీ పథకం అందరికీ ప్రయోజనం. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లిస్తున్న వారికి మరింత లబ్ధి కలుగుతుంది. ఉదాహరణకు 30 శాతం పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకం కింద మొదటి సారి సొంతింటిని సమకూర్చుకుంటే ఏటా రూ.60వేలకు పైనే ఆదా చేసుకోవచ్చు.

2022 నాటికి అందరికీ సొంతిల్లు కల్పించాలనేది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఉద్దేశం. అందుకే వడ్డీపై రాయితీలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ దృష్ట్యా మొదటి సారి ఇల్లు సమకూర్చుకుంటున్నవారికే వీటిని పరిమితం చేసింది. కనుక దీనికి దరఖాస్తు చేసుకుంటున్న వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట అప్పటికే ఇల్లు ఉండరాదు. కుటుంబ సభ్యులు అంటే భార్యా, భర్త, వివాహం కాని పిల్లలు అని అర్థం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్ బీ), హడ్కోలకు నోడల్ ఏజెన్సీలుగా సబ్సిడీ పథకాల అమలు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కోసం లేదా ఉన్న ఇల్లు విస్తరణ కోసం రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారు కూడా వడ్డీలో 3 శాతం రాయితీని ప్రభుత్వం నుంచి పొందవచ్చు.


More Articles