విద్యార్థుల్లో ప్రతిభకు సానపెట్టే పరీక్షలు

చదువంటే ప్రేమ... ఇష్టం. చదువులో ముందుండడం మరీ ఇష్టం. పోటీలో ఫస్ట్ ప్లేస్ నాదే అన్నది నేటి తరం విద్యార్థినీ విద్యార్థుల అభిమతం. టాప్ స్కోర్ కొట్టాలన్నది వారి లక్ష్యం. మొత్తంగా పోటీ అంటే వారికి ఓ పాజిటివ్ కిక్కు. నిజమే పోటీ వారిలో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. కసిని పెంచుతుంది. ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తుంది.

విద్యార్థులకు పోటీ పరీక్షలు ఎన్నో... పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఇటువంటివి లెక్కకు మిక్కిలి. వాటిని ఓ అవకాశంగా మలుచుకుంటే ప్రతిభ మరింత మెరుస్తుంది. పది మందిలో విజేతగా నిలబెడుతుంది. అలాంటివేవో చూద్దాం...

విద్యార్థి సామర్థ్యానికి పోటీ పరీక్షలు ఎంతో అనుకూలమైనవి. స్కూళ్లలో నేర్చుకున్న విద్యా సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని పోటీ పరీక్షల్లో ఉపయోగించడం ద్వారానే అసలైన సామర్థ్యంగా, ప్రతిభగా మారుతుందన్నది నిపుణుల మాట. ఇక పోటీ పరీక్షలన్నవి విద్యార్థులను ప్రతిభలో ప్రోత్సహించడమే కాకుండా, స్కాలర్ షిప్ ల రూపంలో సాయం చేయడం అదనపు ఆకర్షణీయాంశం. లక్ష్యాల దిశగా సాగిపోయేందుకు ఇవన్నీ పాజిటివ్ టానిక్స్. మేధో, తార్కిక నైపుణ్యాలను పెంపొందించడం పోటీ పరీక్షల ప్రధాన ఉద్దేశ్యం.

representative imageనేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ)
జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్ష ఇది. ప్రతిభావంతులకు స్కాలర్ షిప్ అందించేందుకు గాను ఈ పరీక్షను నిర్వహిస్తారు. నెల నెలా స్కాలర్ షిప్ అకడమిక్ కెరీర్ పూర్తయ్యే వరకు లభిస్తుంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, మెంటల్ అబిలిటీ సామర్థ్యాలను పరీక్షిస్తారు.

రెండంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రాల స్థాయిలో రాత పరీక్ష ఉంటుంది. పేపర్ 1 లో భాగంగా 100 మార్కులకు మ్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సమయం 90 నిమిషాలు. అలాగే, శాట్ పరీక్ష 100 మార్కులకు (సైన్స్ 40, సోషల్ సైన్సెస్ 40, మ్యాథ్స్ 20 మార్కులకు) ఉంటుంది. రాష్ట్ర స్థాయి పరీక్షలో ఎంపికైన వారు జాతీయ స్థాయి పరీక్షలోనూ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 లో మ్యాట్ 100 మార్కులకు (90 నిమిషాలు), శాట్ 100 మార్కులు (90 నిమిషాలు) ఉంటుంది. వివరాలకు  http://www.ncert.nic.in/ వెబ్ సైట్ చూడవచ్చు.

కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)
కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక శాఖ కేవీపీవైని 1999లో ప్రారంభించింది. సైన్స్, ఇంజనీరింగ్, వైద్య పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పరీక్ష ఉద్దేశ్యం. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల కరిక్యులమ్ ఆధారంగానే ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది.

మొదటి దశలో ఆప్టిట్యూడ్ పరీక్ష ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లోంచి అర్హులైన వారిని ఈ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. రెండో దశలో ఆప్టిట్యూడ్ పరీక్షలో షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. తుదిగా ఎంపికైన వారికి స్కాలర్ షిప్ లభిస్తుంది. విజేతలకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించే ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ ఎంఎస్ కోర్సులో నేరుగా అడ్మిషన్ పొందే అర్హత లభిస్తుంది. వివరాలకు http://kvpy.iisc.ernet.in/ వె బ్ సైట్ ను సందర్శించవచ్చు.

representative imageడాక్టర్ హోమీబాబా బాల్ విద్యానిక్ స్పర్థ (హెచ్ బీబీవీఎస్)
ముంబై సైన్స్ టీచర్స్ అసోసియేషన్ 1981లో హెచ్ బీబీవీఎస్ ను ప్రారంభించింది. సైన్స్ లో ప్రతిభగల విద్యార్థులను వెతికి పట్టుకుని, వారిని సైన్స్ అంశాలు, పరిశోధనల దిశగా ప్రోత్సహించడం ఈ పరీక్ష లక్ష్యం. ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆరు, తొమ్మిదో తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల నుంచే పరీక్ష నిర్వహణ ఉంటుంది. రెండో దశలో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పరీక్ష ఉంటుంది. మూడో దశలో ఓరల్ టెస్ట్, ఇంటర్వ్యూ, యాక్షన్ రీసెర్చ్ రిపోర్ట్ సమర్పణ ఉంటాయి. మరిన్ని వివరాలకు http://www.msta.in/ వెబ్ సైట్  నుంచి తెలుసుకోవచ్చు.

నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ (ఎన్ఎస్ఓ)

సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (ఎస్ఓఎఫ్) దీన్ని నిర్వహిస్తుంటుంది. పరీక్షలో వచ్చిన మార్కుల ప్రకారం ర్యాంకులు కేటాయిస్తారు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులందరూ ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులకు చెందిన సైన్స్, మ్యాథ్స్ సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు.

మొదటి దశలో స్కూల్ స్థాయిలోనే పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత సిటీ, రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. ఎస్ఓఎఫ్ నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షతో పాటు నేషనల్ సైబర్ ఒలింపియాడ్ అనే మరో పరీక్ష కూడా నిర్వహిస్తుంటుంది. పూర్తి వివరాలకు  http://www.sofworld.org/ ఈ వెబ్ ను ఆశ్రయించడం ద్వారా తెలుసుకోవచ్చు.

యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్ (యూసీవో)

యూనిఫైడ్ కౌన్సిల్ ఏటా యూసీవోను నిర్వహిస్తుంటుంది. విద్యార్థులు తమ మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు అందరూ ఈ పరీక్షలో పాల్గొనవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుల సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయి.
రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. స్కూల్ స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది. ఇందులో ప్రతీ తరగతి నుంచి ఎంపికైన విద్యార్థులను తదుపరి పరీక్షకు అనుమతిస్తారు. తర్వాతి దశలో స్కూల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష పెడతారు. ఇందులో టాపర్స్ ను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు... http://www.unifiedcouncil.com/

నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ)
విద్యార్థులు స్కూల్లో నేర్చుకున్న దానికంటే సంబంధిత సబ్జెక్ట్ లలో మరింత ప్రావీణ్యాన్ని సముపార్జించేందుకు వీలుగా ఈ పరీక్షను యూనిఫైడ్ కౌన్సిల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇలాంటివే పలు రకాల పరీక్షలు సైతం నిర్వహిస్తుంది. భారత్ నుంచే కాకుండా పలు ఇతర దేశాల విద్యార్థులు ఎన్టీఎస్ఈ పరీక్ష రాస్తుంటారు. దీన్ని రెండు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు రాయవచ్చు. సీబీఎస్ఈ పాఠ్యాంశాల నుంచే పరీక్షా పత్రాలు రూపొందిస్తారు.

విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు వీలుగా రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా మొదటి దశలో రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక ఉంటుంది. రెందో దశలో ఎన్సీఈఆర్టీ పరీక్ష నిర్వహిస్తుంది. అవసరమైనన్ని మార్కులు పొందిన విద్యార్థులు అందరూ స్కాలర్ షిప్ లకు అర్హులు.  http://www.unifiedcouncil.com/ వెబ్ సైట్ నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు.

మ్యాథ్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎంటీఎస్ఈ)representative image
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ మ్యాథమేటిక్స్ నిర్వహించే పోటీ పరీక్షయే ఎంటీఎస్ఈ. మెంటల్ అబిలిటీ, మ్యాథమేటికల్ రీజనింగ్, కచ్చితత్వం, వేగం తదితర అంశాలపై ఈ పరీక్షలో దృష్టి పెడతారు. మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠ్యాంశాలను అనుసరిస్తే చాలు. తరగతుల వారీగా టాప్ ర్యాంకర్లను ఎంపిక చేసి వారికి స్కాలర్ షిప్ లను అందిస్తారు. వివరాలకు  http://www.ganithasasthraparishad.org/ వెబ్ సైట్ ను ఆశ్రయించవచ్చు.

ఇంటర్నేషనల్ మ్యాథమేటిక్స్ ఒలింపియాడ్ (ఐఎంవో)
దేశవ్యాప్తంగా, విదేశాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో మ్యాథమేటిక్స్ నైపుణ్యాలు, ప్రతిభను పరీక్షించి ప్రోత్సహించడం ఈ పరీక్ష నిర్వహణలో ప్రధాన ఉద్దేశ్యం. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఈ పరీక్షను రాయవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా పరీక్షా పత్రాలు ఉంటాయి. తరగతుల వారీగా ట్యాప్ ర్యాంకర్లకు స్కాలర్ షిప్ లను జారీ చేస్తారు. వివరాలకు https://www.imo-official.org/ వెబ్ సైట్ ను ఆశ్రయించవచ్చు.

నేషనల్ లెవల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్ఎల్ఎస్ టీఎస్ఈ)
యూనీఫైడ్ కౌన్సిల్ నిర్వహించే పరీక్ష ఇది. దేశంలోని ప్రముఖ పోటీ పరీక్షల్లో ఇదీ ఒకటి. రెండు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు హాజరు కావచ్చు. మ్యాథ్స్, సోషల్ సైన్స్, మెంటల్ అబిలిటీ అంశాలు ఈ పరీక్షలో భాగంగా ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అంశాలు హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించే పరీక్షలో ఉంటాయి. 100 ప్రశ్నలు, 100 మార్కులు, 90 నిమిషాల సమయం.
ఎంపిక విధానం రెండు అంచల్లో ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. ఇందులో ఎంపికైన వారికి రెండో దశలో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహిస్తారు. ఈ https://www.unifiedcouncil.com వెబ్ సైట్ ను ఆశ్రయించవచ్చు.

representative imageనేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఇన్ జూనియర్ సైన్స్ (ఎన్ఎస్ఈజేఎస్)
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికస్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్  ఎగ్జామినేషన్ (హెచ్ బీసీఎస్ఈ) సంయుక్తంగా ఎన్ఎస్ఈజేఎస్ పరీక్ష నిర్వహణ చూసుకుంటాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు అందరూ పాల్గొనవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల పాఠ్యాంశాల నుంచి పరీక్ష నిర్వహిస్తారు. సైన్స్, జనరిక్ కంటెంట్ లపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. మొదట స్కూల్ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారు జాతీయ స్థాయిలో పరీక్షకు హాజరుకావచ్చు. మరిని వివరాలకు http://www.iapt.org.in/  వెబ్ సైట్ ను సంప్రదించడం ఉపయోగకరంగా ఉంటుంది.

స్టేట్ లెవల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్

దీన్ని కూడా యూనిఫైడ్ కౌన్సిలే నిర్వహిస్తుంది. నాలుగు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు అందరూ దీన్ని రాసేందుకు అర్హులు. సైన్స్ సిలబస్ ఆధారంగానే పరీక్ష నిర్వహణ ఉంటుంది. మొదట స్కూల్ స్థాయిలో ఎంపిక ఉంటుంది. ఇలా ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు... http://www.unifiedcouncil.com/slstse.aspx

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ సైన్స్ (ఐవోఎస్)

సొసైటీ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఏటా ఐవోఎస్ ను నిర్వహిస్తుంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇది జరుగుతుంది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు అందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా పరీక్ష ఉంటుంది. స్కూల్ స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారు రెండో దశలో రాష్ట్ర స్థాయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరీక్ష ఉంటుంది. ఇందులో టాప్ ర్యాంకర్లను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలను http://www.sofworld.org/నుంచి తెులుసుకోవచ్చు.

రీజినల్ మ్యాథమేటిక్స్ ఒలింపియాడ్ (ఆర్ఎంవో)
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హెచ్ బీసీఎస్ఈ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్చు. సీబీఎస్ఈ కరిక్యులమ్ ఆధారంగా విద్యార్థుల మ్యాథమేటిక్స్ విజ్ఞానాన్ని పరీక్షిస్తారు. స్కూల్ స్థాయిలోనే పరీక్ష నిర్వహించి టాపర్లను గుర్తిస్తారు. మరిన్ని వివరాల కోసం http://www.isical.ac.in/~rmo/వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.  

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమేటిక్స్ (ఐవోఎం)representative image
గణితంలో నైపుణ్యాన్ని పరీక్షించేందుకు వీలుగా ఏటా సొసైటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఎస్ఎస్ఈ) దీన్ని నిర్వహిస్తుంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇది జరుగుతుంది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగగతి వరకు విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ నుంచే పరీక్ష ఉంటుంది.
మొదటి దశలో స్కూల్ స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయి పరీక్ష ఉంటుంది. ఇక్కడ ఎంపికైన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు. వివరాలకు...  https://www.imo-official.org

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఐవోఈఎల్)  
ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష ఇది. ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని పరీక్షించేందుకు కంప్యూటర్ లిటరరీ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంటుంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు రాయవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల సిలబస్ నుంచే పరీక్ష పత్రాలు రూపొందిస్తారు. మొదటి దశలో స్కూల్ స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది. ప్రతీ తరగతి నుంచి ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో పరీక్ష పెడతారు. ఇందులో ఎంపికైన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు http://schools.aglasem.com/ వెబ్ సైట్ చూడొచ్చు.

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ (ఎన్ఎస్ఈబీ)
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, అసిసోయేషన్ ఆఫ్ బయాలజీ టీచర్స్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష ఇది. ఇంటర్ విద్యార్థులు అర్హులు. బయలాజీ, సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా ఇది ఉంటుంది. తొలుత పాఠశాల స్థాయిలో, అక్కడ ప్రతిభ చూపిన వారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. వివరాలకు  http://iapt.org.in/

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ కెమిస్ట్రీ (ఎన్ఎస్ఈసీ)
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్  ఫిజిక్స్ టీచర్స్, అసిసోయేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్స్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించే మరో ప్రతిష్టాత్మక పరీక్ష ఇది. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకించినది. కెమిస్ట్రీ పాఠ్యాంశాలపై ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. తొలుత స్కూల్ స్థాయిలో ఎంపికైన విధ్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష రాసేందుకు అర్హులు. వివరాలకు http://iapt.org.in వెబ్ సైట్ ను చూడొచ్చు.

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆస్ట్రానమీ (ఎన్ఎస్ఈఏ)representative image
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తుంటాయి. ఇది కూడా ఇంటర్ విద్యార్థులకే పరిమితం. సీబీఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా ఫిజిక్స్ పై ఫోకస్ ఉంటుంది. స్కూల్ స్థాయిలో అర్హత సాధించిన వారు జాతీయ స్థాయి పరీక్షకు సైతం హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలకు  http://iapt.org.in

నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫిజిక్స్ (ఎన్ఎస్ఈపీ)

ఈ పరీక్షను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఇంటర్ విద్యార్థులు దీన్ని రాయవచ్చు. సీబీఎస్ఈ ఫిజిక్స్ పాఠ్యాంశాల ఆధారంగా పరీక్ష ఉంటుంది. తొలుత స్కూల్ స్థాయిలో పరీక్ష నిర్వహించి ప్రతిభగలవారిని ఎంపిక చేస్తారు. వీరు జాతీయ స్థాయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. వివరాలకు http://iapt.org.in

జోనల్ ఇన్ఫర్మేషన్ ఒలింపియాడ్ (జెడ్ఐవో)
ఇండియన్ అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ (ఐఏఆర్సీఎస్) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్ష ఇది. ఆల్గోరిథమ్స్, కంప్యూటింగ్ లో అసాధారణ ప్రతిభావంతులను ఎంపిక చేయడమే ఈ పరీక్ష నిర్వహణ ఉద్దేశ్యం. ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఈ పరీక్షను రాయవచ్చు. సీబీఎస్ఈ కరిక్యులమ్ నుంచే పేపర్ రూపొందించడం జరుగుతుంది. తొలుత రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహణ ఉంటుంది. దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకర్లుగా నిలిచిన వారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉంటుంది. వివరాలను http://www.iarcs.org.in సైట్ నుంచి తెలుసుకోవచ్చు.

ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఒలింపియాడ్ (ఐఐవో)
కంప్యూటర్ రంగంలో ప్రావీణ్యాన్ని పరీక్షించేందుకు ఇది జరుగుతుంది. కంప్యూటర్ లిటరరీ ఫౌండేషన్ ఏటా నిర్వహిస్తుంటుంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు దీన్ని రాయవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల పాఠ్యాంశాల నుంచి పరీక్ష పేపర్లను రూపొందిస్తారు. తొలుత స్కూల్ స్థాయిలో ప్రతిభగల విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఇక్కడ అర్హత సొందిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వివరాలకు http://www.iarcs.org.in

నేషనల్ సైబర్ ఒలింపియాడ్
సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష ఇది. రెండు నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దీనిలో పాల్గొనవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠ్యాంశాల నుంచి పరీక్ష ఉంటుంది. తరగతుల వారీగా టాప్ ర్యాంకర్లకు స్కాలర్ షిప్ లు అందిస్తారు. http://www.sofworld.org/nco ఈ వెబ్ సైట్ నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు.

నేషనల్ ఇంటరాక్టివ్ మ్యాథ్ ఒలింపియాడ్ (ఎన్ఐఎంవో)representative image
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంట్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నిర్వహించే పరీక్ష ఇది. చాలా ప్రాచుర్యం పొందినది. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు దీన్ని రాయవచ్చు. మ్యాథ్స్, సైన్స్, మెంటల్ అబిలిటీని పరీక్షీస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో రాత పరీక్ష జరుగుతుంది. 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఇస్తారు. ఇక్కడ ఎంపికైన వారు జాతీయ స్థాయి పరీక్ష రాసేందుకు అర్హులు. పూర్తి వివరాలకు... http://www.eduhealfoundation.org/

నేషనల్ బయోటెక్నాలజీ ఒలింపియాడ్ (ఎన్బీటీవో)
ఎదుహీల్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్ష ఇది. విద్యార్థుల్లో బయోటెక్నాలజీ సబ్జెక్ట్ పై ఉన్న అసాధారణ ప్రతిభను పరీక్షించేందుకు దీన్ని నిర్వహిస్తున్నారు. ఐదు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు దీన్ని రాయవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుల కరిక్యులమ్ ఆధారంగా జరుగుతుంది. 50 ప్రశ్నలకు 50 మార్కులు, 60 నిమిషాల సమయం ఉంటుంది. తొలుత రాష్ట్రాల స్థాయిలో పరీక్ష ఉంటుంది. అక్కడ ఎంపికైన వారికి జాతీయ స్థాయిలో పరీక్ష పెడతారు. వివరాలకు http://www.eduhealfoundation.org

జియోజీనియస్
ఇండియన్ జియోగ్రఫీ ఒలింపియాడ్ పరీక్ష ఇది. జియోగ్రఫికల్ నైపుణ్యాలను పరీక్షించేందుకు దీన్ని నిర్వహిస్తారు. రెండు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు రాయవచ్చు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే పరీక్ష పత్రాలను రూపొందిస్తారు. తొలుత రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహించి టాపర్లను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారికి జాతీయ స్థాయిలో పరీక్ష పెడతారు. వివరాలకు ..  http://www.geogeniusindia.com/

నాలెడ్జీ ఒలింపియాడ్(కేవో)

నాలెడ్జీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షే కేవో. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల సిలబస్ లోని సైన్స్, మ్యాథ్స్ పాఠ్యాంశాల నుంచి పరీక్షా పత్రాలను రూపొందిస్తారు. ఎక్కువగా విద్యార్థుల జనరిక్ నాలెడ్జీని పరీక్షిస్తారు. కేవోలో రెండు మెయిన్ పరీక్షలు ఉంటాయి. మ్యాథమేటిక్స్  ఒలింపియాడ్, నేషనల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ . వివరాలకు http://aisect.org/

సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ నేషనల్ లెవల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్
విశ్వభారతి ఫౌండేషన్ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటుంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. మ్యాథమేటిక్స్ 40 మార్కులు, సైన్స్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు 100 మయార్కులు, 90 నిమిషాల సమయం ఇస్తారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారికి అవార్డులను ప్రదానం చేస్తారు. వివరాలకు http://www.suchirindiafoundation.org/

representative imageఅసెస్ మెంట్ ఆఫ్ స్కాలస్టిక్ స్కిల్స్ త్రూ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ (అస్సెట్)
ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్ అనే సంస్థ అస్సెట్ ను ఏటా నిర్వహిస్తుంటుంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు అర్హులు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కరిక్యులమ్ ఆధారంగానే ఇది ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ కోర్ సబ్జెక్టులు. సోషల్ స్టడీస్, హిందీ ఆప్షనల్ సబ్జెక్టులు. పాఠశాల స్థాయిలో టాపర్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. వివరాలకు http://www.ei-india.com/

ఇంటర్నేషనల్ అసెస్ మెంట్ ఫర్ ఇండియన్ స్కూల్స్ (ఐఏఐఎస్)
ఐఏఐఎస్ పరీక్షను మూడు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు అందరూ రాయవచ్చు. ఇది కఠినంగా ఉంటుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల పాఠ్యాంశాలపైనే ఈ పరీక్ష చేపడతారు. ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల నుంచి పరీక్షలు ఉంటాయి. తరగతుల వారీగా టాప్ ర్యాంకర్లకు స్కాలర్ షిప్ లను అందిస్తారు. http://www.macmillaneducation.in/iais

కాంపిటీషన్స్, ఒలింపియాడ్స్ లో ఎందుకు పాల్గొనాలి..?
representative imageవిద్యార్థులు అదనపు జ్ఞాన సముపార్జనకు పోటీ పరీక్షలు అవకాశం కల్పిస్తాయి. పరీక్షల్లో ప్రశ్నలను ఎదుర్కోవడం ఎలా, సమాధానాలు ఇచ్చే తీరు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ వారిలో వస్తాయి. పోటీలన్నవి విద్యార్థులను మరింత పదును తేలేలా చేస్తాయన్నది నిపుణుల విశ్లేషణ.  ఒలింపియాడ్స్ పరీక్షల వల్ల విద్యార్థులు స్కూల్, పట్టణం, రాష్ట్రం, జాతీయ స్థాయిలో తమ సామర్థ్యాన్ని, పనితీరును శిశ్లేషించుకుంటారు.

విద్యార్థులను నైతికంగా వెన్నుతట్టి, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహాన్ని అవార్డులు ఇస్తాయి. క్యాష్ అవార్డులు, మెడల్స్, గిఫ్ట్ లు, సర్టిఫికెట్లు ఇవన్నీ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఎన్ఎస్టీఎస్ఈ, ఎన్టీఎస్ఈ, జేఎస్టీఎస్ఈ, ఎన్ఎస్ఓ, ఐఎంవో అనేవి విద్యార్థుల్లో ఐక్యూ, లాజికల్, అనలైటికల్ సామర్థ్యాను పెంచుతాయి. ఇవి జేఈఈ, నీట్ తరహా పరీక్షలను ఎదుర్కొనేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.


More Articles