క్రెడిట్, డెబిట్ కార్డు... ఏది ఎప్పుడు వాడితే నయం...?

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు... ఈ రెండూ చెల్లింపుల కోసం వాడే సాధనాలు. రెండింటితోనూ ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటేనే ఎప్పుడు ఏది వాడితే లాభమన్న అవగాహన ఉంటుంది. అందుకే ఈ రెండింటి మధ్య తేడాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

ఏటీఎం కమ్ డెబిట్ కార్డుrepresentative image
ఈ కార్డు అనేది మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలు కల్పిస్తుంది. వేతనం కావచ్చు లేదా వేరొకరు మీ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకు శాఖ వరకు వెళ్లాల్సిన పని లేకుండా సులభంగానే ఏటీఎం కమ్ డెబిట్ కార్డుతో ఏటీఎం యంత్రం నుంచి డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. లేదా షాపింగ్ చేసి డిజిటల్ రూపంలో బిల్లు చెల్లింపులు జరపవచ్చు. అప్పుడు నేరుగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మేరకు నగదు తగ్గిపోతుంది. అంటే కచ్చితంగా బ్యాంకులో్ నగదు ఉంటేనే ఈ కార్డుతో ఉపయోగం.  

క్రెడిట్ కార్డుrepresentative image
ఈ కార్డు ద్వారా వాడే ప్రతి రూపాయి కూడా రుణమే. అక్షరాలా అప్పు తీసుకోవడం. దాన్ని వడ్డీ లేకుండానే తిరిగి చెల్లించుకోవచ్చు. కాకపోతే అది బిల్లింగ్ సైకిల్ చివరి గడువు లోపు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో క్రెడిట్ కార్డు అక్కరకు వస్తుంది. గ్రేస్ పీరియడ్ తర్వాత వడ్డీతో చెల్లించే సౌలభ్యం ఉంటుంది. దీనిపై 2 రూపాయలు. అంతకు మించిన వడ్డీ వసూలు చేస్తారు. క్రెడిట్ కార్డుతో లిమిట్ మేరకు అవసరమైతే ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు రెండింటిపైనా 16 అంకెల కార్డు నంబర్లు ఉంటాయి. అలాగే, ఎక్స్ పయిరీ తేదీ, పిన్ నంబర్లు కూడా. క్రెడిట్ కార్డు వినియోగంపై ప్రతీ నెలా బిల్లు వస్తుంటుంది. దాంతో వ్యయాల వివరాలను సమీక్షించుకునే వీలుంటుంది.  

ఫీజులు

చార్జీలు, ఫీజుల విషయానికొస్తే క్రెడిట్, డెబిట్ కార్డుల మధ్య తేడా ఉంటుంది. సాధారణంగా డెబిట్ కార్డుపై రూ.150 నుంచి రూ.200 వార్షిక చార్జీల విధింపు ఉంటుంది. ఇది మినహా ఇతరత్రా ఎటువంటి లావాదేవీల చార్జీల వడ్డనా ఉండదు. అదే క్రెడిట్ కార్డులపై రెన్యువల్ చార్జీ పేరుతో రూ.400 నుంచి వేల రూపాయల వరకు జారీ చేసిన సంస్థలు వసూలు చేస్తుంటాయి. దీన్నే మెయింటెనెన్స్ ఫీజు అని కూడా అంటారు. కొన్ని సంస్థలు మొదటి ఏడాది ఈ ఫీజు వసూలు చేయవు. కొన్ని రెండు మూడేళ్లు, ఐదేళ్లు కూడా వెసులుబాటు ఇస్తుంటాయి.

క్రెడిట్ కార్డు వినియోగంపై లావాదేవీల వ్యయం ఉంటుంది. ఏటీఎంల నుంచి నగదు తీసుకుంటే ఆ చార్జీలు వేరు. ఇది 2.5 శాతం వరకు ఉంటుంది. వడ్డీ చార్జీలు, ఆలస్యంగా చేసే చెల్లింపులపై జరిమానాలు, ఓవర్ లిమిట్ ఫీజులు ఇలా అనేక రూపాల్లో వడ్డన ఉంటుంది. కార్డుపై అప్పు పరిమితి రూ.10వేలు ఉంటే, మీరు రూ.10001 వినియోగించుకున్నా... అదనంగా రూ.500 వరకు ఫీజు పడుతుంది. ఇక క్రెడిట్ కార్డుతో అంతర్జాతీయ వెబ్ సైట్లు, ఇతర దేశాల్లో లావాదేవీలు చేస్తే 3.5 శాతం వరకు చార్జీలు పడతాయి.
 
స్టేట్ మెంట్ కావాలంటే అందుకు ప్రత్యేకంగా ఫీజు, కార్డు మార్చేందుకు రూ.250 రూపాయల వరకు రుసుము, క్రెడిట్ కార్డుపై చెల్లింపుల బౌన్స్ జరిగితే, ఉదాహరణకు ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకుని వాయిదా చెల్లించే సమయానికి కార్డు లిమిట్ అంతా ఖర్చు చేశారనుకోండి. అప్పుడు బౌన్స్ అవుతుంది. దీంతో చార్జీల మోత మోగుతుంది. క్రెడిట్ కార్డు లావాదేవీల విలువపై సుమారుగా 15 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి రావడం కూడా భారమే.

వ్యయ నియంత్రణ

డెబిట్ కార్డు అనేది నగదుకు డిజిటల్ రూపం అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వల ఆధారంగా డెబిట్ కార్డును వాడుకోగలరు. ఖాతాల్లో డబ్బు ఖాళీ అయితే వాడేందుకు ఏమీ ఉండదు. అందుకే అవసరాల మేరకు చూసుకుంటూ జాగ్రత్తగా వాడుతుంటారు. అదే క్రెడిట్ కార్డు అయితే నగదు కాదు అప్పు. కార్డుపై పరిమితి మేరకు వాడుకోవచ్చు. అప్పుగా వచ్చేది కనుక నియంత్రణ లేకపోతే ఉన్న పరిమితి మేరకు అంతా వాడేసే ప్రమాదం ఉంటుంది.

సాధారణంగా క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, ట్రావెల్ పాయింట్లు, రివార్డు పాయింట్లు రూపంలో ప్రతిఫలాలు అందుకోవచ్చు. తెలివైన స్మార్ట్ వినియోగదారులు క్రెడిట్ కార్డుల ద్వారా నెలవారీ షాపింగ్ చేస్తూ గ్రేస్ పీరియడ్ లోపల ఆ మొత్తం బకాయిలను బ్యాంకు ఖాతాలోని నిల్వలతో చెల్లించేస్తే సరిపోతుంది. దీనివల్ల రివార్డు పాయింట్ల రూపంలో వారు బాగానే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధమైన క్రెడిట్ కార్డుల్లోనూ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులు, లైఫ్ స్టయిల్, ప్రీమియం, షాపింగ్ అండ్ క్యాష్ బ్యాక్, బిజినెస్, కో బ్రాండెడ్ కార్డులు అని ప్రయోజనాల రీత్యా భిన్న రకాల కార్డులు అందుబాటులో ఉన్నాయి.

క్రెడిట్ స్కోరుrepresentative image
క్రెడిట్ కార్డు వాడి తిరిగి సకాలంలో చెల్లించడం ద్వారా సిబిల్ స్కోరును పెంచుకోవచ్చు. ఏ రుణమైనా సిబిల్ స్కోరు చూసే ఇస్తారన్న విషయం తెలిసిందే. అంటే, క్రెడిట్ కార్డు ద్వారా అప్పు వాడుకుంటూ దాన్ని సకాలంలో చెల్లించడం వల్ల మంచి రుణ చరిత్ర ఉందన్న మార్కు స్కోరులో ప్రతిఫలిస్తుంది. అదే సమయలో్ సకాలంలో తీర్చకుండా బకాయి పడితే రుణ చరిత్ర కూడా దెబ్బతింటుంది. కానీ, డెబిట్ కార్డుతో ఈ విధమైన ప్లస్, మైనస్ లు లేవు.

representative imageభద్రత ఎంత...?
డెబిట్ కార్డులతో అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణకు వీల్లేకుండా బ్యాంకులు సాధారణంగా బ్లాక్ చేస్తుంటాయి. మోసాలకు ఆస్కారం లేకుండా ఈ చర్య. కొన్ని బ్యాంకులు మాత్రం ఇందుకు అనుమతిస్తున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలకు వీల్లేనప్పుడు పేపాల్ అకౌంట్ ద్వారా డెబిట్ కార్డులను లింక్ చేసుకుని అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

అంతర్జాతీయంగా చాలా కార్డులు ఒకే దశ గుర్తింపు విధానాన్ని అమలు చేస్తున్నాయి. వెబ్ సైట్లలో కొనుగోళ్లకు 3డీ సెక్యూర్ పిన్ అవసరం లేదు. లావాదేవీ పూర్తి కావడానికి కార్డుపై ఉన్న 16 అంకెల నంబర్, ఎక్స్ పయిరీ తేదీ ఇస్తే చాలు. మరి ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డు పోతే, ఎవరి కంట్లో అయినా ఆ వివరాలు పడితే దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా దేశాలు రెండు దశల గుర్తింపు విధానాన్ని ఆచరిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ 3డీ సెక్యూర్ పిన్ తప్పనిసరి. కొన్ని ఈ రెండింటికి అదనంగా చిప్ బేస్డ్ కార్డును కూడా అందిస్తున్నాయి. దీంతో ఫోర్జరీకి అవకాశం ఉండదు. క్రెడిట్ కార్డు దారులకు మోసాల నుంచి రక్షణ ఉంటుంది. సాధారణంగా మోసాల వల్ల జరిగే నష్టాలకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది.

క్రెడిట్ కార్డులను ఎందుకు అడగడం?

అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకు ఖాతాల నిర్వహణ అనేది కొంచెం ఖరీదైన వ్యవహారం. ప్రతీ నెలా బ్యాంకుకు ఫీజు చెల్లించుకోవాలి. ఖాతా తెరిచేందుకూ చార్జీల భారం ఉంటుంది. కానీ,  క్రెడిట్ కార్డు మాత్రం సులభంగా తీసుకోవచ్చు. పెద్దగా చార్జీల భారం ఉండదు. అందుకే ఆయా దేశాలలో క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువ. పైగా ఈఎంఐ సదుపాయం క్రెడిట్ కార్డుతోనే లభిస్తుంది. డెబిట్ కార్డులపై దాదాపుగా ఉండదు. అందుకే క్రెడిట్ కార్డులను అడుగుతుంటాయి. వీటిపైనే ఎక్కువ ఆఫర్లు ఇస్తుంటారు.

ఏటీఎం, డెబిట్

మీ దగ్గరున్న కార్డుపై ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అని ఉంటే అది రెండు రకాలుగా పనిచేస్తుందని అర్థం. ఏటీఎంలలో, పీవోఎస్, ఆన్ లైన్ లావాదేవీలకు, చెల్లింపులకు ఉపకరిస్తుంది. కేవలం ఏటీఎం కార్డు అని ఉంటే దానితో ఏటీఎంల నుంచి నగదును మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. దాంతో రెస్టార్టెంట్లు, దుకాణాల్లో చెల్లింపులకు అవకాశం ఉండదు. ప్రస్తుతం దాదాపుగా అన్ని బ్యాంకులు ఏటీఎం కమ్ డెబిట్ కార్డులనే అందిస్తున్నాయి. ఒకవేళ పాత కార్డులు ఉండి ఉంటే వాటిని మార్చుకోవడం మంచిది.


More Articles