మన కేలండర్ ఎప్పుడు మొదలైంది... న్యూ ఇయర్ ఏ దేశంలో ఎప్పుడు.. ఎలా...?

ప్రతీ ఒక్కరు రోజులో ఒక్కసారైనా కేలండర్ ముఖం చూస్తారు. లేదంటే సెల్ ఫోన్.. కాదంటే చేతి గడియారంలో కనీసం తేదీని అయినా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక చోట తేదీ, నెల, సంవత్సరం వేయాల్సి రావచ్చు. తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని సంబరంగా జరుపుకోవడం తెలిసిందే. కానీ, జనవరి 1వ తారీఖునాడూ సంతోషంగా పలకరించుకుంటారు. తేదీ, సంవత్సరం ఎక్కడైనా రాయాల్సి వస్తే, వారి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయాల్సి వస్తే ఇంగ్లిష్ కేలండరే ప్రామాణికం. వర్తక, వాణిజ్యానికి, పరిపాలనకు ఈ కేలండరే ప్రామాణికం. ప్రజా జీవితంతో ఇంతలా పెనవేసుకున్న ఈ కేలండర్, నూతన సంవత్సరం, వేడుకలు, విశేషాల సమాహారమే ఈ కథనం.

ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఓ యువతి తన దరఖాస్తుపై తాను దుర్మిఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షరుతువు, అషాడ మాసం, శుక్లపక్షం, విదియ తిథి నాడు జన్మించానని రాస్తే ఎంతవరకు అర్థమవుతుంది...? ఆమెకు ఎన్నేళ్లన్నది తెలుసుకోవడం కష్టం. అందుకే సంప్రదాయం అంటే మక్కువ ఉన్న భారతీయులు సైతం ఇంగ్లిష్ కేలండర్ ను వాడుకోక తప్పని పరిస్థితి. తెలుగువారే కాదు, ఈ ప్రపంచంలో అధిక శాతం మందికి నేడు గ్రెగోరియన్ కేలండరే ఆధారం. సామాజిక, వ్యక్తిగత, పరిపాలన, వాణిజ్య ఇలా ఏ అంశానికైనా కేలండర్ కావాలి. ఇది ఒక కాలచక్ర గమనిక. కాలానికి ఓ డైరీ.

కాల చక్రగమనంలో మనం ఆగిపోతామేమో గానీ, కాలం మాత్రం ఆగదు. సూర్యుడి చుట్టూ భూమి తన కక్ష్య పరిధిలో తిరిగే సమయాన్ని ఆధారంగా చేసుకుని సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజు, వారం, నెల అనే భాగాలతో ఓ సంవత్సరాన్ని రూపొందించారు ఖళోగ శాస్త్రవేత్తలు. భూ గమనం వల్లే రుతువులు కూడా మారుతుంటాయి. కొన్ని నెలలు చలి వాతావరణం, కొన్ని నెలలు వేడి, కొన్ని నెలలు వర్షాలు ఇవన్నీ భూగమనం వల్లే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. చరిత్రలో ఏన్నో కేలండర్లు రూపొందాయి. కానీ, ఏవీ నిలబడలేదు. representative imageకేలండర్లు ఏవైనాగానీ, సూర్యమానం, చాంద్రమానం ఆధారంగా రూపొందినవే. తొలి కేలండర్ కంచుయుగంలో రూపుదిద్దుకుందని చెబుతారు. ఆ తర్వాత బేబీలోనియన్ కేలండర్, జోరాష్ట్రియన్ కేలండర్, హెర్భ్యూ కేలండర్, హిందూ కేలండర్లు, రోమన్ కేలండర్ ఇలా ఎన్నో రూపొందాయి.

క్రీస్తు కంటే ముందు 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ రోమన్ కేలండర్ ను సమూలంగా మార్చి కొత్త కేలండర్ ను అందుబాటులోకి తెచ్చాడు. దీన్ని జూలియన్ కేలండర్ అని పిలిచేవారు. ఇది తొలి సౌరమాన కేలండర్. 1582 అక్టోబర్ లో జూలియన్ కేలండర్ ను మరింత మెరుగుపరిచి (అంటే కచ్చితత్వాన్నితీసుకొచ్చి) ఆధునిక కేలండర్ ను అమల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి పోప్ గ్రెగరీ - 13. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న కేలండర్ ఇదే. ప్రస్తుత కేలండర్ కంటే ముందున్నవి చాంద్రమాన ఆధారిత కేలండర్లు.

కేలండర్ నామకరణం...

ఈ పదాన్ని రోమన్ కేలండర్ లో మొదటి రోజు పదం calenae నుంచి తీసుకున్నది. దీనర్థం కేలారే. అంటే కాలింగ్ (పిలవడమని అర్థం). కొత్తగా వచ్చిన చంద్రుడ్ని చూసిన వెంటనే పిలిచే పదం ఇది. లాటిన్ లో కేలండరియమ్ అంటే అకౌంట్ బుక్, రిజిస్టర్ అనే అర్థాలున్నాయి. తొలినాళ్లలో కేలండియర్ అనే పదాన్ని ఉపయోగించేవారు. 13వ శతాబ్దానికి వచ్చే సరికి అది కేలండర్ గా మారిపోయింది.

representative imageసౌరమానం... చాంద్రమానం

ఒక సౌరమాన సంవత్సరంలో 12 చాంద్రమాన నెలలు ఉంటాయి. ప్రతీ 33 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సూర్య, చాంద్రమాన కేలండర్లు సమాన స్థితికి వస్తాయి. సూర్యమాన కేలండర్ కంటే చాంద్రమాన కేలండర్ లో 11 రోజులు తక్కువగా ఉంటాయి. అందుకే చాంద్రమాన కేలండర్ లో కొన్నేళ్లకు ఓసారి ఓ మాసాన్ని అదనంగా జోడిస్తారు. మన తెలుగులో అధిక మాసం మాదిరిగా.
సౌరమాన కేలండర్ లో ఒక ఏడాదికి 365.2425 రోజులు అని చెప్పవచ్చు. అయితే ఏడాదిలో 365 రోజులుగానే ఖరారు చేశారు. మిగిలిన పావు దినాన్ని... ప్రతీ నాలుగేళ్లకోసారి లీప్ డే పేరుతో ఒక రోజును అంటే 24 గంటలను అదనంగా జోడిస్తున్నారు. అయితే ఇంకా 11 నిమిషాల 14 సెకండ్లు ముందస్తుగా నడుస్తున్నట్టు లెక్క. ప్రతీ నాలుగేళ్లకోసారి లీపు డేని కలపడం అన్నది జూలియన్ కేలండర్ విధానం. గ్రెగోరియన్ కేలండర్ లోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు.representative image గ్రెగేరియన్ కేలండర్ సైకిల్ (కాల చక్రం) ప్రతీ 1,46,097 రోజులకు ఓసారి పునరావృతం అవుతుంటుంది. ఇది 400 ఏళ్లకు సమానం. ప్రతీ 400 ఏళ్లలో 303 సంవత్సరాలు 365 రోజులను కలిగి ఉంటాయి. మిగిలిన 97 సంవత్సరాలు మాత్రం 366 రోజులను (లీప్ డే) కలిగి ఉంటాయి. ప్రతీ నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరం అనుకుంటే 100 లీప్ రోజులు రావాలి. కానీ, ఏటా 11 నిమిషాల 14 సెకండ్లు వేగంగా నడవడం వల్ల లీపు దినాలు 97 రోజులకే పరిమితం అవుతాయి.

నెలలు... వాటి పేర్లు వెనుక...

ఇంగ్లిష్ కేలండర్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మాసాలుంటాయి. వీటి పేర్ల వెనుక కొన్ని అర్థాలున్నాయి.
జనవరి: janus. జానస్ అనే దేవుడి పేరును పెట్టారు. ఏదైనా ప్రారంభానికి ఆది దేవుడిగా జానస్ ను పరిగణిస్తారు.
ఫిబ్రవరి: februus. శుద్ధి చేసే పండుగ ఫిబ్రువా పేరు పెట్టారు.
మార్చి: mars. మార్స్ (అంగారకుడు) పేరుతో మార్చిగా నామకరం చేశారు.
ఏప్రిల్: aprilis అనేది అపీరియో, అపీరిరీ, అపెర్టస్ అనే పదాల నుంచి వచ్చిందని భావిస్తారు. ప్రారంభానికి అని అర్థం. .
మే: maia maiestas వసంత కాలానికి రోమన్ దేవత పేరు పెట్టారు.
జూన్: juno జూనో అనేది రోమన్ దేవత పేరు. బృహస్పతి భార్య.
జూలై: julius. జూలియస్ సీజర్ పేరుకు గుర్తుగా జూలైగా పేరు పెట్టారు.
ఆగస్ట్: agustus క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందిన చక్రవర్తి ఆగస్టస్ పేరుతో వచ్చిన నెల.
సెప్టెంబర్: Septem రోమన్ కేలండర్ ప్రకారం ఏడవ నెల గనుక సెప్టెంబర్ అని వచ్చింది.
అక్టోబర్: Octo అక్టో అంటే లాటిన్ లో ఎనిమిది. వెనుకటి రోమన్ కేలండర్ లో ఎనిమిదో నెల గనుక అక్టోబర్ అని పెట్టారు.
నవంబర్: Novem లాటిన్ లో తొమ్మిది. నవ అంటే మన తెలుగులోనూ తొమ్మిదనే అర్థం. వెనుకటి రోమన్ కేలండర్ లో ఇది తొమ్మిదో నెల గనుక నవంబర్ అని ఏర్పడింది.
డిసెంబర్: decem డిసెమ్ అంటే పది. వెనుకటి రోమన్ కేలండర్ లో ఇది పదో నెల అందుకే డిసెంబర్ అయింది.

representative imageఏ నెలలో ఎన్ని రోజులు

జనవరి 31 రోజులు
ఫిబ్రవరి 28 రోజులు / లీపు సంవత్సరంలో 29 రోజులు
మార్చి 31 రోజులు
ఏప్రిల్ 30 రోజులు
మే 31 రోజులు
జూన్ 30 రోజులు
జూలై 31 రోజులు
ఆగస్ట్ 31 రోజులు
సెప్టెంబర్ 30 రోజులు
అక్టోబర్ 31 రోజులు
నవంబర్ 30 రోజులు
డిసెంబర్ 31 రోజులు

జూలై, ఆగస్ట్ మాసాల్లో 31 రోజులు.. ఫిబ్రవరిలో 28 రోజులు ఎందుకు...?

కేలండర్ ముందుంచుకుని పరిశీలిస్తే... జూలై, ఆగస్ట్ మాసాలు వరుసగా 31 రోజులను కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఫిబ్రవరి మాసంలో మిగతా అన్ని మాసాల కంటే తక్కువగా 28 రోజులే కనిపిస్తాయి. ఇందుకు రెండు రకాల కథనాలు ఉన్నాయి. జూలియస్ సీజర్ పేరును జూలై మాసానికి పెట్టారని, ఆగస్టస్ పేరుతో ఆగస్ట్ మాసం ఏర్పడిందని పైన చెప్పుకున్నాం. ఆగస్టస్ సీజర్ రోమన్ చక్రవర్తి అయ్యే నాటికి ఆగస్ట్ పేరుతో నెల లేదు. సెక్సిటిలిస్ పేరుతో ఉండేది. తన పేరిట ఆగస్ట్ మాసం ఉండాలని, అది 31 రోజులు ఉండాలని కోరుకోవడంతో ఫిబ్రవరి మాసం నుంచి రెండు రోజులు తీసుకున్నారని, అందుకే ఫిబ్రవరి 28 రోజులకు తగ్గిపోయిందని చెబుతారు.

కానీ దీన్ని కొంతమంది చరిత్రకారులు అంగీకరించడం లేదు. వారి అభిప్రాయం ప్రకారం... న్యూమా పాంపీలియస్ కాలం నుంచీ ఫిబ్రవరి 28 రోజులతోనే ఉండేది.  అప్పట్లో ఆయన ఓ ఏడాదికి 355 రోజులుగా నిర్ణయించి, 12 చాంద్రమాన మాసాలుగా తేల్చాడు. అదృష్ట సంఖ్య ఉండాలన్న యోచనతో... ఏడు నెలలు 29 రోజులతోను, నాలుగు నెలలు 31 రోజులతోనూ ఉండేలా నిర్ణయించాడు. అయినప్పటికీ మరో నెల తక్కువ రోజులతో ఉండాల్సి వచ్చింది. దీంతో ఫిబ్రవరి మాసంలో 28 రోజులుగా ఖరారు చేసినట్టు కొందరు చరిత్రకారులు చెబుతారు.

సోలార్ కేలండర్లు

తొలినాళ్లలో రోమన్ కేథలిక్ దేశాలే గ్రెగోరియన్ కేలండర్ ను అమల్లో పెట్టాయి. అయితే, 19వ శతాబ్దంలో అంతర్జాతీయ వాణిజ్య రూపేణా సౌకర్యం కోసం మిగిలిన దేశాలూ ఈ కేలండర్ ను పాటించడాన్ని ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదొక ప్రామాణిక కేలండర్ అయింది. ఈ కేలండర్ ను చివరిగా 1923లో అమల్లోకి తీసుకున్న యూరోప్ దేశం గ్రీస్.

సౌరమానంలో ఒక ఏడాది అంటే...?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యూడి చుట్టూ తిరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇలా ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలమే ఒక ఏడాది. ఇలా భూమి గుండ్రంగా తిరిగే క్రమంలోనే పగలు, రాత్రి మారుతుంటాయి. అలాగే రుతువులు కూడా.
representative imageఎందుకిలా రుతువులు మారుతుంటాయి...?

భూ అక్షాంశ రేఖ నిటారుగా ఉండదు. 23.4 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. అందుకే భూమిపై కొన్ని ప్రాంతాలు ఎక్కువ సూర్యరశ్మిని అందుకుంటాయి. ఈ వంపు కారణంగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొన్ని ప్రాంతాలు సూర్యుడి దిశలో, కొన్ని వ్యతిరేక దిశలో ఉంటాయి.

భూమి సూర్యుడికి దూరంగా వెళ్లడం వల్ల శీతాకాలం వస్తుందని, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వేసవి కాలం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ అభిప్రాయం తప్పు. సూర్యుడి నుంచి భూమి ఎంత దూరంలో ఉందన్న అంశం రుతువులను నిర్ణయించదు. భూమి సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు ఉత్తరార్థగోళంలో శీతల వాతావరణం ఉంటుంది. సూర్యుడికి దూరంగా వెళ్లినప్పుడు వేసవి వాతావరణం వస్తుంది.

నిజానికి భూ భ్రమణం అనేది కచ్చితమైన సర్కిల్ లో ఉండదు. ఇది కొంచెం ఏటవాలుగా ఉంటుంది. భూమి సూర్యుడికి సమీపంగా వెళ్లినప్పుడు ఉత్తరార్ధగోళంలో శీతల వాతావరణం ఉంటుంది. దూరంగా వెళ్లినప్పుడు వేసవి వాతావరణం వస్తుంది. దక్షిణార్థగోళం విషయంలోనూ ఇలానే ఉంటుంది.

సింపుల్ గా భూమిని రెండు అర్ధగోళాలుగా పేర్కొంటారనే విషయం మనకు తెలుసు. ఇవి ఉత్తర, దక్షిణార్థగోళాలు. సూర్యుడివైపు వంపు తిరిగిన అర్థగోళంలో వేసవి ఉంటే... సూర్యుడి కిరణాలు నేరుగా ఈ ప్రాంతంలోని భూ ఉపరితలంపై పడతాయి. కనుక అధిక వేడి వాతావరణం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు పగటి వేళలు ఎక్కువగా, రాత్రి వేళలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో దక్షిణార్థ గోళంలోని ప్రాంతాలపై సూర్యుడి కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కనుక చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది.

చాంద్రమాన సంవత్సరం

ఇది చంద్రుడి 12 పరిపూర్ణ చక్రాల కాలం అంత. ఇందులో 354.37 రోజులు ఉంటాయి. దీన్నే ముస్లింలు పాటిస్తుంటారు. ముస్లింల క్యాలండర్ చాంద్రమానం ఆధారితమైనది.

జనవరి 1 వేడుకలు ఎప్పుడు మొదలయ్యాయి?

జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకోవడం తొలిసారిగా ప్రపంచ చరిత్రలో రోమ్ పట్టణంలో జరిగినట్టు చెబుతారు. క్రీస్తు కంటే ముందు 700 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి న్యూమా పాంటీలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను కొత్తగా కేలండర్ లో చేర్చినట్టు చెబుతారు. అంతకుముందు వరకు నూతన సంవత్సరం మార్చిలో మొదలై డిసెంబర్ లో ముగిసేది. కేవలం పది నెలల పాటే రోమన్ కేలండర్ కొనసాగింది. ఏడాదిలో ఉండే రోజులన్నీ ఆ పది నెలల్లోనే సర్దుబాటు చేశారు. పాంటీలియస్ జనవరి, ఫిబ్రవరిలను జత చేయడంతో జనవరి 1కి నూతన సంవత్సరం మారింది. ప్రారంభానికి అధిదేవత అయిన జానూస్ పేరిట తొలి నెలకు జనవరి అని నామకరణం చేశారు.

క్రిస్టియన్ శకంలోని మధ్య కాలంలో యూరోప్ ప్రాంతంలో జీసస్ జన్మదినమైన డిసెంబర్ 25న, అలాగే, మార్చి 25న నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. 1582లో మరింత కచ్చితత్వంతో గ్రెగోరియన్ కేలండర్ అందుబాటులోకి వచ్చినాగానీ 1752 వరకూ బ్రిటిష్ రాజ్యం, అమెరికన్ కాలనీలు మాత్రం మార్చిలోనే నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాయి. ఆ తర్వాత జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సంప్రదాయం క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది.

బహుమతుల సంప్రదాయం ఎప్పుడు...?

ఫ్లాండర్స్ (బెల్జియం), నెదర్లాండ్స్ లో ఏడవ శతాబ్దంలో నూతన సంవత్సరం మొదటి రోజున బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం తొలిగా మొదలైంది.

ఒక్కో దేశంలో ఒకటికి మించిన కేలండర్లు...

ప్రపంచంలో చాలా దేశాలు గ్రెగోరియన్ కేలండర్ ను ఆచరిస్తున్నప్పటికీ... కొన్ని చోట్ల ప్రాంతాల వారీగా ఇతర కేలండర్లను కూడా ఆచరించే విధానం ఉంది. ఇలాంటి చోట్ల నూతన సంవత్సరం జనవరి 1తో పాటు మరో రోజు కూడా ఉంటుంది. తెలుగువారికి ఉగాది ఉన్నట్టు. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో సెప్టెంబర్ 11న నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనిపేరు ఎంకుటాటష్. జూలియన్ కేలండర్ ఆధారిత ప్రాచీన కేలండర్ ను ఇక్కడ పాటిస్తారు. ఫిలడెల్ఫియా, అమెరికాలోని పెన్సిల్వేనియా జూన్ రెండో ఆదివారం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి. ఇక చైనా, వియత్నాంల నూతన సంవత్సరం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 మధ్య ప్రారంభం అవుతుంది. చైనా కేలండర్ చాంద్రమానం ప్రకారం సాగుతుంది.

కొరియన్లు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. ఇక్కడ నూతన సంవత్సరాన్ని సియోల్లాల్ అని పిలుస్తారు. అయినప్పటికీ కొరియన్లు జనవరి 1న కూడా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. కంబోడియన్లు, థాయ్ ల్యాండ్ ప్రజలు ఏటా ఏప్రిల్ 13 లేదా 14న కొత్త సంవత్సర సంబరాలు చేసుకుంటారు. ఇస్లామిక్ దేశాల్లో చాంద్రమానం ఆధారిత ఇస్లామిక్ కేలండర్ ను పాటించే విధానం ఉంది. దీని ప్రకారం మొహర్రం నెల మొదటి రోజు నూతన సంవత్సరం అవుతుంది.
 
మన దేశంలో...

క్రిస్టియన్లకు జనవరి 1నే నూతన సంవత్సరం. మార్వాడీ, గుజరాతీలకు దీపావళి కొత్త సంవత్సరం. ఉత్తరాది ప్రాంతాల్లో విక్రమ్ సంవత్ కేలండర్ ను ఫాలో అవుతుంటారు. హిందువుల్లోనూ భిన్న ప్రాంతాల వారు భిన్న సందర్భాలను నూతన సంవత్సరంగా చేసుకునే సంప్రదాయం ఉంది. అసోమ్, బెంగాల్, కేరళ, ఒడిశా, పంజాబ్, తమిళనాడులో సూర్యుడు మేషరాసిలోకి ప్రవేశించే సందర్భాన్ని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. హిందూ కేలండర్ ప్రకారమైతే చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సరారంభం. మన తెలుగువారం, కన్నడిగులు చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది(యుగాది)గా, నూతన సంవత్సరంగా జరుపుకోవడం తెలిసిందే.

జనవరి 1న కాన్పులెన్నో...

తమ వారసులకు పుట్టినరోజు జనవరి 1 కావాలన్నది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆకాంక్ష. ఏటేటా జనవరి 1న కాన్పులకు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అమెరికాలో ఏటా జనవరి 1న జన్మించిన తొలి శిశువుకు స్థానిక వ్యాపార వర్గాలు కానుకలు ఇచ్చే సంప్రదాయం ఉంది.

నింగినంటే వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరిగినా... కొన్ని ప్రాంతాల్లో వీటిని చూడడానికి రెండు కళ్లూ చాలవు.
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ (అమెరికా)
representative image
అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు లక్షల సంఖ్యలో తరలివస్తారు. టీవీల్లో ఈ వేడుకలను వీక్షించే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. టైమ్ స్క్వేర్ భవనాల్లో ఒకదానిపై టైమ్ బాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఫ్లాగ్ పోల్ పైనుంచి కిందకు 60 సెకండ్లలో దింపుతారు. నూతన సంవత్సరం ప్రారంభానికి నిమిషం ముందు ఇది మొదలవుతుంది. దీన్ని చూసేందుకే చాలా మంది వస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి.

రియో డీజెనీరో (బ్రెజిల్)

ప్రపంచంలో భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరిగే ప్రాంతాల్లో రీయో డీ జెనీరో కూడా ఒకటి. జనవరి 1న ఇక్కడ వేసవి మధ్య కాలం. సుమారు 20 లక్షల మంది డిసెంబర్ 31 సాయంత్రానికి ఇక్కడి సముద్ర తీరంలో వాలిపోతారు. అర్ధరాత్రి కొత్త సంవత్సర ఆగమనంలో సాగర జలాల్లో పుష్పాలు వేసి... కొత్త సంవత్సరంలో తమకు మంచి జరిగేలా చూడాలని ఆఫ్రికన్ జలదేవత అయిన యెమంజాను కోరుకుంటారు. బాణా సంచా వెలుగు జిలుగులు చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా వేడుకల నిర్వహణ ఉంటుంది. ఇక ఆ క్షణంలో మొదలైన సంగీతం, నృత్యాలు, మందు, విందులతో తెల్లవార్లూ అక్కడి వారు సంబరాల్లో మునిగితేలతారు.  
సిడ్నీ (ఆస్ట్రేలియా)
representative image
సముద్ర తీర నగరమైన సిడ్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రి ఓ కొత్త ప్రపంచాన్ని తలపిస్తుంది. విమాన ప్రదర్శనలు, తీరంలో ఆగిన పడవలు, భారీ స్థాయిలో క్రాకర్లు, లైటింగ్ షోతో దేదీప్యమానం అవుతుంది.

టోక్యో (జపాన్)

నూతన సంవత్సరం సందర్భంగా జపాన్ వాసులు ఇష్టమైన వంటకాలు రుచి చూసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఆహారం కీలకమన్నది వారి ఆలోచన. ఆలయాల్లో అర్ధరాత్రి కొత్త సంవత్సరం సమీపిస్తున్నందుకు సూచనగా గంటలు మోగుతాయి. జపాన్ చక్రవర్తి తన ప్యాలస్ ను జనవరి 1, 2వ తేదీలను ప్రజల కోసం తెరిచి ఉంచుతారు.

ఈఫిల్ టవర్ (ఫ్రాన్స్)

ఇక ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కూడా కొత్త సంవత్సర సంబరాలతో అదిరిపోయే వేదిక. ఈఫిల్ టవర్ కు జనవరి 1 వేడుకలకు వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. డిసెంబర్ 31 రాత్రి పారిస్ నగరం నిద్రపోదు. నగరమంతా భారీ సంఖ్యలో లైట్లు, క్రాకర్ల మోతలు, షాంపేన్ బాటిళ్ల పొంగులతో ఊగిపోతుంది. సిటీ ఆఫ్ లైట్స్ పేరుతో పారిస్ నగరం వేడుకలతో అదిరిపోతుంది. లైటింగ్ షో, క్రాకర్లు అదనపు ఆకర్షణలు.

మ్యాడ్రిడ్ (స్పెయిన్)

స్పెయిన్ లోని మ్యాడ్రిడ్ నగరంలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు అర్ధరాత్రి 12 గంటలు కొట్టిన వెంటనే 12 ద్రాక్ష పండ్లను లాగించేస్తారు. దీంతో కొత్త సంవత్సరంలో తమకు అంతా శుభమే జరుగుతుందన్నది వారి నమ్మకం.

లండన్ (యూకే)

యూరోప్ లో చివరిగా వేడుకలు జరిగే ప్రాంతం. అర్ధరాత్రి 10 నిమిషాల పాటు జరిగే లైట్ షో మరపురానిది. అర్ధరాత్రి లైట్ షో, క్రాకర్లు, విందులతో సంబరాలు ముగిసిపోవు. తెల్లవారే లండన్ వీధుల్లో మూడు గంటల పాటు మార్చ్ జరుగుతుంది.
క్రిస్ మస్ ఐలాండ్, లెబనాన్ లోని బీరుట్, హవాయి, వియన్నా, మెల్ బోర్న్, ఎడిన్ బర్గ్, ఆర్లాండో, లాస్ వెగాస్, బెర్లిన్, హాంగ్ కాంగ్ తదితర ప్రాంతాల్లోనూ సంబరాలను అంబరాన్నంటుతాయి.

కెనడా...

ఇక్కడ జనవరి 1 సెలవుదినం. టొరంటో, ఆటారియోలోని నయాగరా ఫాల్స్, ఎడ్మంటన్, కల్గరీ, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. జనవరి 1న ప్రజలు ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

ఇవి ఆసక్తికరమైనవి...

మెక్సికన్లు అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తింటారు. ఆ వెంటనే ఒకరిని ఒకరు విష్ చేస్తారు. ప్రజలు తమ ఇళ్లను అందంగా, రంగులతో అలంకరించుకుంటారు. ఎరుపు తమ జీవన విధానాన్ని, ప్రేమను పెంచుతుందని, పసుపుపచ్చ ఉద్యోగంలో అనుకూలతకు, ఆకుపచ్చ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుందని, తెలుపుతో ఆరోగ్యం వృద్ధి చెందుతుందన్నది అక్కడి వారి నమ్మకం. బ్రెడ్ పీస్ లో కాయిన్ ఉంచి... అందరికీ బ్రెడ్ ను అందిస్తారు. ఎవరికైతే కాయిన్ ఉన్న బ్రెడ్ వచ్చిందో వారిని దేవుడు అనుగ్రహించినట్టు భావిస్తారు. కొంత మంది ముగిసిపోయిన సంవత్సరంలో తమను బాధపెట్టిన విషయాలను, తప్పులను ఒక పేపర్ పై రాసి దాన్ని మంటలో వేస్తారు. ఈ చర్య ద్వారా తమలోంచి ఆ ప్రతికూలతను తొలగించుకున్నట్టు వారు భావిస్తారు.

జనవరి 1.... కొన్ని దేశాల్లో ముందుగా, కొన్ని చోట్ల ఆలస్యం!

డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలు (భారత కాలమానం): సమో అండ్ క్రిస్ మస్ ఐలాండ్/కిరిబాటి... పాలినేషియాలో దీవులతో కూడిన దేశం సమో, ఆస్ట్రేలియా పరిధిలోని క్రిస్ మస్ ఐలాండ్స్, సెంట్రల్ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఉండే కరిబటి దేశాలు ఈ ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందు జనవరి 1లోకి అడుగుపెడతాయి. భారతీయ కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలకే ఇక్కడి ప్రజలు నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోతారు.

డిసెంబర్ 31, మధ్యాహ్నం 3.45 గంటలు... న్యూజిలాండ్ లోని చాతమ్ ఐలాండ్స్ ప్రాంతం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
డిసెంబర్ 31, 4.30 గంటలు: న్యూజిలాండ్ లోని చాలా ప్రాంతాలు, ఫిజి, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు, టోంగా, ఫోనిక్స్ ఐలాండ్స్ లో కొత్త సంవత్సరం వస్తుంది.
డిసెంబర్ 31, 5.30 గంటలు: రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం.
డిసెంబర్ 31, 6.30 - 8.30 గంటల మధ్య: ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలు, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, పపువా న్యూగునియా, సాల్మన్ ఐలాండ్స్ లో కొత్త సంవత్సరం ప్రారంభం.
డిసెంబర్ 31, రాత్రి 8.30 గంటలు: జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభం.
డిసెంబర్ 31, 9 గంటలు: ఉత్తర కొరియా కొత్త సంవత్సరంలో అడుగుపెడుతుంది.
డిసెంబర్ 31, 9.30 గంటలు: చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ ఆస్ట్రేలియా, మలేసియా, తైవాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, బ్రూనై, హాంగ్ కాంగ్, సింగపూర్, మకావూల్లో జనవరి 1 ఆగమనం.
డిసెంబర్ 31, రాత్రి  10.30 గంటలు: ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు, థాయ్ ల్యాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, మంగోలియాలో ప్రారంభం.
డిసెంబర్ 31, 4.30 గంటలు: కొత్త సంవత్సరంలోకి మయన్మార్ ప్రవేశించే సమయం.
డిసెంబర్ 31, 11.30 - 11.45 గంటలు: బంగ్లాదేశ్, కజకిస్తాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, కిర్గిస్తాన్, భూటాన్, నేపాల్ లో ప్రారంభం.
అర్ధరాత్రి 12 గంటలకు (00.00ఏఎం): భారత్, శ్రీలంకలు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి.
జనవరి 1, 00.30 గంటలు: పాకిస్తాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, మాల్దీవులు, తజికిస్తాన్ లలో భారతీయ కాలమానంతో పోలిస్తే అరగంట ఆలస్యంగా కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది.
జనవరి 1, 1 గంట: అఫ్గానిస్థాన్ లో నూతన సంవత్సరారంభం.
జనవరి 1, 01.30 గంటలు: అజర్ బైజాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆర్మేనియా, ఒమన్, రష్యాలోని పలు ప్రాంతాలు, మారిషస్, సీచెల్లెస్ లో.
జనవరి 1, 2 గంటలు: కొత్త సంవత్సరంలోకి ఇరాన్ ప్రవేశం.
జనవరి 1, 2.30 గంటలు: సౌదీ అరేబియా, ఇతియేపియా, ఇరాక్, బెలారస్, సోమాలియా, మడగాస్కర్, టాంజానియా, ఎరిత్రియా, ఉగాండా, ఉక్రెయిన్, సూడాన్, యెమన్, కెన్యా, సౌత్ సూడాన్, ఖతార్, బహ్రెయిన్, జార్జియా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, కువైట్ లో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది.
జనవరి 1, 3.30 గంటలు: గ్రీస్, దక్షిణాప్రికాలోని మిగిలిన ప్రాంతాలు, ఫిన్లాండ్, టర్కీ, ఇజ్రాయెల్, ఈజిప్ట్, బల్గేరియా, పాలస్తీనా, సిరియా, జాంబియా, లిబియా, జోర్డాన్, సైప్రస్, లెబనాన్ తదితర ప్రాంతాలలో....
జనవరి 1, 4.30 గంటలు: జర్మనీ, నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, పోలండ్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, నైజీరియా, డెన్మార్క్, బెల్జియం, అల్జీరియా, టునీషియా, అంగోలా, సెర్బియా, వాటికన్ సిటీ, మొనాకోలో ప్రారంభం.
జనవరి 1, వేకువజామున 5.30 గంటలు: యూకే, పోర్చుగల్, ఐర్లాండ్ కొత్త సంవత్సరంలో అడుగుపెడతాయి. భారతీయులు తెల్లవార్లు సంబరాలు జరుపుకుని తెల్లవారుజామున 5.30 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఇంకా 27 దేశాలు నూతన సంవత్సరం రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
జనవరి 1, 6.30 గంటలు: పోర్చుగల్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం.
జనవరి 1, 7.30 గంటలు: బ్రెజిల్, జార్జియాలోని కొన్ని ప్రాంతాలు.
జనవరి 1, ఉదయం 8.30 గంటలు: అర్జెంటీనియా, ఉరుగ్వే, పరాగ్వే, ఫ్రెంచ్ గునియాలో కొత్త సంవత్సరం ఆరంభం.
జనవరి 1, 9.30 గంటలు: కెనడాలోని కొన్ని ప్రాంతాలు, డొమనికన్ రిపబ్లిక్, ప్యూర్టెరికో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, గయానా, అంటిగ్వా, బార్బుడా, బెర్ముడాలో.
జనవరి 1, ఉదయం 10.00 గంటలు: కొత్త సంవత్సరంలోకి వెనెజులా ప్రవేశం.
జనవరి 1, 10.30 - 1.30 గంటల మధ్య: అమెరికా, కెనడా, కొలంబియా, పెరూ, ఈక్వెడార్, క్యూబా, పనామా, హైతి, జమైకా, బహమాస్, హోండూరస్, బెలిజ్, నికరాగ్వ, కోస్టారికా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలాలో.
జనవరి 1, మధ్యాహ్నం 2.30 గంటలు: అమెరికాలోని అలాస్కాలో.
జనవరి 1, 3.30 గంటలు: అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో.
జనవరి 1, సాయంత్రం 5.30 గంటలు: చివరికి అన్నింటి కంటే ఆలస్యంగా అమెరికాలోని బాకర్, హోవర్డ్ దీవులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. అప్పటికే మనం జనవరి 1 సాయంత్రానికి చేరుకుంటాం.

ఈ దేశాల్లో జవవరి 1న కాదు...
representative image
చైనా చాంద్రమాన కేలండర్ ను పాటించే దేశం. ఇక్కడ జనవరి చివర్లో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. అలాగే చాంద్రమానాన్ని అనుసరించే దక్షిణకొరియా, వియత్నాంలోనూ జవవరి 1 నూతన సంవత్సరం కాదు. ఇరాన్ పర్షియన్ కేలండర్ ను అనుసరిస్తుంది. కంబోడియాలో ఏప్రిల్ 13, 14 తేదీల్లో కొత్త సంవత్సరం చేసుకుంటారు. ఇథియోపియాలో సెప్టెంబర్ 11 లేదా 12న జరుపుకుంటారు.  అలాగే, ఇస్లామిక్ దేశాల్లోనూ నూతన సంవత్సరం జనవరి 1 కాదు. ఇక మనదేశంలో జనవరి 1ని ఓ పండగలా జరుపుకున్నప్పటికీ... సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరాది ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రోజు జరుపుకుంటారు. 


More Articles