అమర పోలీసులకు ఘన నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై, హోమ్ మంత్రి, డీజీపీ

హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్ ఘననివాళులు అర్పించారు. నేడు ఉదయం గోషామహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో పాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబసభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా సంఘ విద్రోహుల చేతుల్లో 377 మంది పోలీసులు మరణించారని, విధి నిర్వహణలో అమరులైన ఈ అమర పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు విధి నిర్వహణలో రాష్ట్రంలో కేవలం ఒక పోలీసు మాత్రమే మరణించారని, ఈ సంవత్సరం ఒక్కరు కూడా మరణించలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుగా ఉందని, ఇతర రాష్ట్రాలను పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, సీసీటీవీల ఏర్పాటు, మహిళా భద్రతకు ప్రత్యేక విభాగం, కమాండ్ కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు తదితర వినూత్న విధానాల అమలు ద్వారా మన పోలీసు శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విధినిర్వహణలో తెలంగాణ రాష్ట్రంలో  మొత్తం 62 మంది పోలీసులు మరణించారని వీరి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ, ఆయా కుటుంబాలకు అండదండలుగా ఉంటామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో శాంతి, ప్రజలకు భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని ఈ అమర పోలీసులు మనకు, సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. టెక్నాలజీ ఉపయోగించి శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దారించుకోగా ఇప్పటి వరకు 8.25 లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కోవిడ్ సమయం పోలీస్ శాఖ ను సవాల్ గా మారిందని అన్నారు. ఉగ్రవాదం, నక్సలిజంను ఏ విధంగా ఎదుర్కున్నామో, ఫ్రంట్ లైన్ వారియర్ గా కోవిడ్ ను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు వారి రక్షణ అవసరాల కొరకు ఏర్పర్చుకొన్న వ్యవస్థే పోలీసు వ్యవస్థ అని అన్నారు. ప్రజల్లో తమ విశ్వసనీయత, నమ్మకం పెరిగే విధంగా పోలీసులు మనసా, వాచా, కర్మణ కృషి చేయాలన్నారు.

గత సంవత్సరం మార్చి నుంచి కోవిడ్ మహమ్మారి పోలీసుశాఖకు ఒక కొత్త ఛాలెంజ్ ను విసిరిప్పటికీ పోలీసులు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇతర నేరాలను ఎదుర్కొన్నట్లే కోవిడ్ ను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అంతే పట్టుదలతో ఎదుర్కొన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు.  

More Press News