Sajjanar: చైనా మాంజా వినియోగం... హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

Sajjanar Hyderabad CP Gets Notice from Human Rights Commission on China Manja
  • చైనా మాంజాకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని సీపీకి ఆదేశం
  • మాంజా అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక కోరిన హెచ్ఆర్సీ
  • ఫిబ్రవరి 26 లోగా నివేదిక అందించాలన్న మానవ హక్కుల సంఘం
చైనా మాంజాకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రామారావు ఇమ్మానేని అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. చైనా మాంజాకు సంబంధించి తక్షణమే నివేదిక సమర్పించాలని సీపీని ఆదేశించింది.

సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై న్యాయవాది రామారావుతో పాటు పలువురు ఇతర న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో మాంజా అమ్మకాలను, వినియోగాన్ని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికను అందించాలని సీపీని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఫిబ్రవరి 26వ తేదీలోగా పోలీసులు చేపట్టిన చర్యల నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.

చైనా మాంజా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది. ఈ దారానికి గాజు ముక్కల పొడిని అద్దుతారు. ఈ దారంతో పతంగులను ఎగురవేసిన సందర్భాలలో పక్షులు గాయపడటం, కొందరు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బైకులపై వెళ్లేవారికి ఈ దారం మెడకు తగిలితే ప్రమాదకరంగా పరిణమించి కోసుకుపోయే అవకాశం ఉంది. ఇటీవల చైనా మాంజా కారణంగా పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో చైనా మాంజా వినియోగంపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
Sajjanar
Hyderabad CP
China Manja
Human Rights Commission
Telangana
Sankranti

More Telugu News