‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు:సూర్య

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు:సూర్య
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. 

ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. "ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. 

త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. మమిత ఎనర్జిటిక్ గా నటించింది. 

వెంకీ సిన్సియర్ డైరెక్టర్. 200 శాతం కష్టపడతారు. దర్శకుడు కంటే రచయితగా ఇంకా ఎక్కువ అభిమానిస్తాను. ఇంత గొప్పగా రాయడం మామూలు విషయం కాదు. వెంకీతో మళ్ళీ కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. శివకుమార్ కుమారులైన మమ్మల్ని తెలుగు దత్త పుత్రులు అన్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఎంతో ప్రేమ ఇచ్చారు. ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అంతే ప్రేమ ఇస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ముందుగా తక్కువ సమయంలో ఈ వేడుక జరగడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. సినీ పరిశ్రమకు అండగా ఉంటుందన్నందుకు, గద్దర్ అవార్డులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు.. సినీ పరిశ్రమ తరపున తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. డబ్బులు పెట్టి థియేటర్ కి వెళ్ళి సినిమా చూసి, నచ్చితే పదిమందికి చెప్పే ప్రేక్షకుల దగ్గర నుంచి.. సినిమాలో ఉన్న తప్పొప్పులు చెప్పే రివ్యూయర్ల వరకు నాకు అందరూ ముఖ్యమే. ఏదైనా తప్పు చేస్తే, దానిని సరి చేసుకొని మరింత బాధ్యతగా పని చేస్తాను. ఈ సినిమా నాకెంతో సంతృప్తిని ఇచ్చింది. 

థియేటర్లో చూసే ప్రేక్షకులకు కూడా ఆ సంతృప్తిని  కలిగిస్తుంది. ఇది సూర్య గారి అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు, సూర్య అభిమానుల కుటుంబాల కోసం కూడా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఈ మాట నేను దర్శకుడిగా చెప్పట్లేదు, ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. ఎడిటర్ నవీన్ నూలి సినిమా చూసి హిట్ కొట్టేశావు అన్నారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రాధిక గారు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సినిమా చూసిన తర్వాత ఇలాంటి అమ్మ కావాలి, ఇలాంటి ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది. సూర్య గారు, మమిత జోడిని తెరమీద చూస్తే ప్రేమలో పడిపోతారు. నేను సూర్య గారి వీరాభిమానిని. గత 20 ఏళ్లుగా ఆయన ప్రతి సినిమా చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆయన్ని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సూర్య గారు గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. సేవా కార్యక్రమాలతో ఆయన ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు." అన్నారు. 

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలో.. మేము సంజయ్ రామస్వామిని మళ్ళీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. సూర్య గారు ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గజినీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ చేరుతుందని నేను హామీ ఇస్తున్నాను. చాలారోజుల తర్వాత స్టేజ్ మీద చాలా ధైర్యంగా, నమ్మకంగా చెబుతున్నాను.. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా చూశామనే అనుభూతితో థియేటర్ నుండి బయటకు వస్తారు. తల్లికొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత అమ్మని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా త్రివిక్రమ్ గారికి చాలా నచ్చింది. త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇంతవరకు మా బ్యానర్ లో ఫెయిల్ అవలేదు. సినిమాలో సూర్య గారు తప్ప ఎవరూ కనిపించలేదని త్రివిక్రమ్ గారు అన్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే అంటారు.. సూర్య చాలా అందంగా ఉన్నారని. సూర్య గారి పాత్రను వెంకీ చాలా బాగా డిజైన్ చేశాడు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి పాత్రను చూస్తే ఎంత కిక్ వస్తుందో, ఈ సినిమాలో సూర్య గారి పాత్రను చూస్తే అంత కిక్ ఇస్తుంది. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు. ఒక మంచి సినిమా చూశామనే సంతృప్తిని కలిగిస్తుంది." అన్నారు. 

కథానాయిక మమితా బైజు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నాగవంశీ గారికి, వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. సూర్య గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రాధిక గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి ఆగస్టు 14న విడుదలవుతున్న మా ‘విశ్వనాథ్ & సన్స్’ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను." అన్నారు. 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. "వెంకీ అట్లూరి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేస్తూ, గొప్ప దర్శకుడిగా ఎదుగుతుంటే.. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి 40 ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. సినీ కార్మికుల పిల్లల కోసం మంచి పాఠశాల కట్టించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని మా కుటుంబంతో కలిసి చూస్తాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.

ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. "హైదరాబాద్ లో ఇలాంటి ఒక వేడుకలో పాల్గొని చాలా సంవత్సరాలు అయింది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అందుకే ఇక్కడికి వచ్చాను. వెంకీ అట్లూరి, నాగవంశీ గారు, సూర్య, మమితా బైజు ఇలా మా టీమ్ అందరి కోసం వచ్చాను. అందరూ దీనిని ఫ్యామిలీ సినిమా అంటున్నారు. కానీ, నా దృష్టిలో ఇదొక లవ్ స్టోరీ. ఫ్యామిలీతోనే కాదు, ఫ్రెండ్స్ తో కూడా ఈ సినిమాకి వెళ్లొచ్చు. ఈ జనరేషన్ కి ఇది ముఖ్యమైన సబ్జెక్ట్. ప్రేమ, బంధం విలువను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. మనసుకి దగ్గరయ్యే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. నాగవంశీ గారు వండర్ఫుల్ ప్రొడ్యూసర్. లీడర్ లా అన్నీ ఆయనే చూసుకుంటారు. 

వెంకీ అట్లూరి చూడటానికి చిన్న కుర్రాడిలా కనిపిస్తారు. కానీ, గొప్పగా ఆలోచిస్తారు. ప్రేమ గురించి, బంధాల గురించి ఇంత గొప్పగా రాయడం చూసి ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. మంచి సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. నాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. మమితా బైజుకి మంచి భవిష్యత్ ఉంది. సూర్య మనసున్న నటుడు. కళ్లలో నిజాయితీ ఉంటుంది. సూర్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మనసులో ఉన్న భయాలను వదిలి, ఎంతో కష్టపడి గొప్ప నటుడిగా ఎదిగాడు. సూర్య గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి. ఎందరికో సాయం చేస్తున్నారు." అన్నారు. 


VISWANATH & Sons
VISWANATH and Sons
surya
Venky Atluri
Suryadevara Naga Vamsi

Watch Today's Deals on Amazon

More Press News