'అన్నపూరణి' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

  • 'అన్నపూరణి'గా నయనతార 
  • డిసెంబర్ 1న థియేటర్లకు వచ్చిన సినిమా
  • అక్కడ విమర్శలను ఎదుర్కొన్న కంటెంట్  
  • డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ 
  • ఒక యువతి లక్ష్య సాధనే ప్రధానంగా సాగే కథ 

నయనతార ప్రధానమైన పాత్రగా రూపొందిన 'అన్నపూరణి' అనే తమిళ సినిమా, క్రితం నెల 1వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. జతిన్ సేథి - రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకి, నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. రిలీజ్ సమయంలో తమిళనాట వర్షాల కారణంగా ఈ సినిమా ఆశించినస్థాయిలో జనంలోకి వెళ్లలేకపోయింది. అలాంటి ఈ సినిమా క్రితం నెల 29వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళనాడులోని 'తిరుచ్చి' ప్రాంతంలో రంగరాజన్ (అచ్యుత కుమార్) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తల్లి .. భార్య శారద (రేణుక) ... కూతురు అన్నపూర్ణి (నయనతార) ఇది ఆయన ఫ్యామిలీ. ఆయన శ్రీరంగం ఆలయంలో అర్చకుడు. స్వామివారి నైవేద్యానికి అవసరమైన వంటకాలు ఆయనే సిద్ధం చేస్తూ ఉంటాడు. అందువలన ఆ ప్రాంతంలో ఆయనకి మంచి గౌరవం .. పలుకుబడి ఉంటాయి. 

పూర్ణికి చిన్నప్పటి నుంచి కూడా వంటలు చేయడం పట్ల ఆసక్తి ఉంటుంది. వయసుతో పాటు ఆ కోరిక బలపడుతూ వస్తుంది. ఆనంద్ (సత్యరాజ్) మాదిరిగా గొప్ప 'చెఫ్' కావాలనేది ఆమె ఆశయంగా మారుతుంది. అందువలన ఆమె 'హోటల్ మేనేజ్ మెంట్' కోర్స్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా చేస్తే మాంసం కూడా వండవలసి వస్తుందని చెప్పి, తండ్రి నిరాకరిస్తాడు. అయితే ఆమె మనసుకి నచ్చిందే చేయమని చెప్పి, స్నేహితుడైన ఫరాన్ (జై) ప్రోత్సహిస్తాడు.

 ఎంబీఏ చేస్తున్నట్టుగా తండ్రికి అబద్ధం చెప్పి, హోటల్ మేనేజ్ మెంట్ లో పూర్ణి చేరుతుంది. బాగా వంట చేయాలంటే .. ముందుగా వాటిని టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో పూర్ణి నాన్ వెజ్ తినడం మొదలుపెడుతుంది. పూర్ణి కారణంగా స్వామివారికి నైవేద్యాలను తయారు చేసే పని నుంచి రంగరాజన్ ను తొలగిస్తారు. ఆ అవమానాన్ని అతను తట్టుకోలేకపోతాడు. దాంతో కూతురుకి పెళ్లి చేసి పంపించాలని నిర్ణయించుకుంటాడు. 

పెళ్లి పీటలపైకి వెళ్లవలసిన సమయంలో పూర్ణి, తన లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో చెన్నైకి పారిపోతుంది. అక్కడ ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆమె ఎలా అధిగమిస్తుంది? గొప్ప చెఫ్ కావాలనే ఆమె కోరిక నెరవేరుతుందా? ఆ ప్రయత్నంలో ఆమెకి సాయపడేది ఎవరు? అడ్డుపడేది ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

ఈ కథను నీలేశ్ కృష్ణ తయారు చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే .. సంభాషణలను కూడా తానే సమకూర్చాడు. తాను ఎంచుకున్న కథాంశం కారణంగా .. ఈ సినిమా విడుదల సమయంలో తమిళనాట విమర్శలను గట్టిగానే ఎదుర్కున్నాడు. వాటిని తట్టుకుని నిలబడ్డాడు. కథగా చూసుకుంటే, దర్శకుడిగా తాను చెప్పదలచుకున్న విషయాలను చాలా క్లారిటీతో చెబుతూ వెళ్లాడు. 

ఒక వైపున నయనతార పాత్ర ... మరో వైపున ఆమె తండ్రి పాత్ర .. ఆమెను ఇష్టపడే జై పాత్ర .. ఆమె విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్న తండ్రీ కొడుకులుగా సత్యరాజ్ - కార్తీక్ కుమార్ పాత్రలను ఉంచుతూ ఈ కథను బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాడు. కథ అంతా కూడా ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తాను అనుకున్నది సాధించడం కోసం ఒక యువతి ఎన్ని అవాంతరాలను ... అడ్డుగోడలను దాటుకుంటూ వెళ్లిందనేది నీలేశ్ చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. 

పూర్ణి పాత్రలో నయనతార నటన గొప్పగా అనిపిస్తుంది. ఒక వైపున ఆచారాలు .. మరో వైపున కూతురి ధోరణికి మధ్య నలిగిపోయే తండ్రిగా అచ్యుత కుమార్ నటన ఆకట్టుకుంటుంది. కీలకమైన పాత్రలో సత్యరాజ్ నటన మెప్పిస్తుంది. అందరూ కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. చిన్నప్పటి పూర్ణి పాత్రను పోషించిన ఓవి భండార్కర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది.

తమన్ నేపథ్య సంగీతం .. సత్య సూర్యన్ ఫొటోగ్రఫీ కథకు అదనపు బలాన్ని తీసుకొచ్చాయి. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. ఈ కథ మొత్తం కూడా ఎమోషన్స్ ప్రధానంగా నడుస్తుంది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ కి ఛాన్స్ లేని కంటెంట్ ఇది. కాస్త కామెడీ టచ్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేశారు. ఒక బయోపిక్ మాదిరిగా కాస్త సీరియస్ గానే సాగే ఈ కథ, నయనతార అభిమానులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ. 

Movie Details

Movie Name: Annapoorani

Release Date:

Cast: Nayanthara, Sathyaraj, Jai, Achyuth Kumar, K. S. Ravikumar, Karthik Kumar, Renuka

Director: Nilesh Krishnaa

Producer: Jatin Sethi - R Ravindran

Music: Thaman

Banner: Naad Sstudios - Trident Arts

Annapoorani Rating: 3.00 out of 5


More Movie Reviews