నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా రూపొందిన 'అనగనగా ఒక రాజు' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'మారి' దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో, కథానాయికగా మీనాక్షి చౌదరి అలరించగా, కీలకమైన పాత్రలో రావు రమేశ్ నటించారు. సంక్రాంతి బరిలో .. గట్టిపోటీ మధ్యలో దిగిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు 'గౌరవపురం' జమీందారు గోపరాజు మనవడు. అయితే తాత చేసిన మితిమీరిన దానధర్మాల వలన ఆస్తులన్నీ కరిగిపోతాయి. రాజు మాత్రం తాత సంపాదించిన ఆస్తులన్నీ అలాగే ఉండి ఉంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడినని కలలు కంటూ కంటూ ఉంటాడు. శ్రీమంతుల కుటుంబం .. ఒకే కూతురు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, తాను అనుకున్నట్టుగా వైభవంగా బ్రతకొచ్చని భావిస్తాడు. అదే సమయంలో అతనికి చారులత (మీనాక్షి చౌదరి) తారసపడుతుంది. 

'పెదపాలెం' శ్రీమంతుడు భూపతిరాజు (రావు రమేశ్) ఒక్కగానొక్క కూతురే చారులత. ఆమెను పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిలైపోతుందని భావిస్తాడు. 'ఆపరేషన్ చారులత' పేరుతో, తన స్నేహితులతో కలిసి పక్కాగా ప్లాన్ చేస్తాడు. ఆమె దృష్టిలో మంచివాడిగా మార్కులు కొట్టేస్తాడు. భూపతిరాజుచే శభాష్ అనిపించుకుని అతని ఇంటికి అల్లుడైపోతాడు. తన కోరిక నెరవేరినందుకు హ్యాపీగా ఫీలవుతున్న సమయంలోనే అతనికి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి? ఆ తరువాత అతను రాజకీయాల వైపు ఎందుకు వెళతాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ:  ఏదైనా ఒక పాత కథను కొత్త కోణంలో చెప్పడం ఒక పద్ధతి. లేదంటే పాత కథనే మరింత ఆసక్తికరంగా చెప్పడం రెండో పద్ధతి. 'అనగనగా ఒక రాజు' విషయానికి వస్తే, ఇది రెండో కోవకి  చెందిన కథగా చెప్పుకోవచ్చు.  విలేజ్ నేపథ్యం .. గ్రామీణ రాజకీయాలు .. అక్కడి మనుషుల స్వరూప స్వభావాల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. 

ఎంతసేపు తాను విలాసంగా .. వైభవంగా గడపాలి, బరువు బాధ్యతలు లేకుండగా బ్రతకాలి అనే స్వార్థంతో ఆలోచించే ఒక యువకుడి చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ పాత్రను నడిపించిన విధానం ఆడియన్స్ ఆశించే వినోదాన్ని వడ్డిస్తూ వెళుతుంది. ఫస్టాఫ్ లో 'ఆపరేషన్ చారులత' ఎపిసోడ్, సెకండాఫ్ లో రీల్స్ ద్వారా రాజకీయాల ప్రచారం వంటి ఎపిసోడ్స్ మరింత ఫన్ గా అనిపిస్తాయి. కామెడీని పరుగులు తీయిస్తాయి.

ఈ సినిమా కథలో కొత్తదనం కనిపించదు. జరగబోయేది ఆడియన్స్ గెస్ చేసేలానే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే .. సంభాషణలు ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తాయి. మొదటి నుంచి చివరివరకూ కథనం ఎక్కడా స్పీడ్ తగ్గదు. అందువలన అసలు బోర్ అనే మాటకు అవకాశం లేకుండా చేసిన సినిమా ఇది. సరదా సంభాషణలు .. కలర్ఫుల్ గా పాటలు .. ఆ చివర్లో ఒకింత ఎమోషన్ తో సాగిపోతూ అప్పుడే సినిమా అయిపోయిందా అనుకునేలా చేస్తాయి. నవీన్ పోలిశెట్టి వన్ మేన్ ఆర్మీగా నడిపించిన సినిమా ఇది. 

పనితీరు: సాధారణంగా కథ వేగంగా మొదలై ఆ తరువాత స్పీడ్ తగ్గడం .. నిదానంగా మొదలై స్పీడ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మొదటి నుంచి కథను చాలా వేగంగా పరిగెత్తిస్తూ చివరి వరకూ నాన్ స్టాప్ కామెడీని అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అందరికీ అనుభవంలో ఉన్న కథనే అయినా, ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. 

నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ .. మీనాక్షి చౌదరి గ్లామర్ పేక్షకుల నుంచి మంచి మార్కులను రాబడతాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. యువరాజ్ కెమెరా పనితనం బాగుంది. అందమైన ఫ్రేమ్స్ తో మరింత అందాన్ని తీసుకొచ్చాడు. మిక్కీ జె మేయర్ బాణీలు .. నేపథ్య సంగీతం హుషారెత్తిస్తాయి. కల్యాణ్ శంకర్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా అనిపిస్తుంది. ఎక్కడా కూడా సమయాన్ని వృధా చేయకపోవడం విశేషం. 

ఈ మధ్య కాలంలో సంభాషణల పరంగా అలరించిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 'వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందారా' .. 'ఆ పిల్ల ఆధార్ కార్డు .. ఈ పిల్ల గ్రీన్ కార్డు' .. 'ఫారినర్స్ లేని గోవా .. పాలు లేని కోవా లాంటిది' .. 'పది మందితో నడిస్తే వాకింగ్ అంటారు .. ర్యాలీ అనరు. వంటి డైలాగ్స్ హాయిగా నవ్విస్తాయి. 

ముగింపు
: సంక్రాంతి అంటే పల్లె పండుగ .. రంగు ముగ్గుల పండగ. సంక్రాంతి అంటే ఓ సరదా ..  ఓ సందడి. అలాంటి సందడిని పుష్కలంగా అందించే సినిమా ఇది. స్వార్థం కంటే త్యాగం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనే సందేశం ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది.