'జూబ్లీ' - ఓటీటీ రివ్యూ

  • అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పై 'జూబ్లీ'
  • సినిమా ప్రపంచం నేపథ్యంతో కూడిన ఇతివృత్తం 
  • 1940 - 50 కాలంలో నడిచే కథ 
  • ఆ కాలాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ 
  • అప్పటి కథకి తగినట్టుగానే నిదానంగా సాగిన కథనం 
  • సీజన్ 2 ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

సినిమా అనేది ప్రతి ఒక్కరికీ ప్రధానమైన వినోద సాధనం. అలాంటి సినిమా నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. సినిమావాళ్ల జీవితాలు .. వృత్తి పరమైన టెన్షన్లు .. ఆ పరిశ్రమలో ఉండే ఆకర్షణలు .. సంబంధాలు .. రాజకీయాలు .. అవమానాల నేపథ్యంలో చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. కానీ 1940 - 50 మధ్య కాలంలో ఇండస్ట్రీ నేపథ్యంలో నడిచే కొన్ని జీవితాల కథగా వచ్చిన వెబ్ సిరీస్ 'జూబ్లీ'. అమెజాన్ ప్రైమ్ లో నిన్నటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 5 ఎపిసోడ్స్ ను వదిలారు.

కథలోకి వెళితే .. శ్రీకాంత్ రాయ్ (ప్రసేన్ జిత్ ఛటర్జీ) ముంబైకి చెందిన ఒక ప్రముఖ నిర్మాత. రాయ్ స్టూడియో అధినేత ఆయన. తన బ్యానర్ పై ఆయన వరుస సినిమాలు చేసి దెబ్బ తినేసి ఉంటాడు. ఆయన భార్య సుమిత్ర కుమారి (అదితీ రావు హైదరి). ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున రాయ్ స్టూడియో వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది. స్టూడియోను తాకట్టు పెట్టి రాయ్ చివరి ప్రయత్నం చేయడానికి రంగంలోకి దిగుతాడు.


ఆ సినిమాలో హీరోగా జమ్షద్ ఖాన్(నందీశ్ సింగ్ సంధు)ను తీసుకోవాలని అనుకుంటాడు. ఆ స్టూడియోలో నెల జీతంపై పనిచేస్తున్న జమ్షద్ పై సుమిత్ర కుమారి మనసు పారేసుకుంటుంది. అతనితో కలిసి సరదాగా గడపడానికి 'లక్నో' వెళ్లిపోతుంది. ఈ విషయం రాయ్ కి తెలిసినా .. సినిమా పూర్తిచేయడమే తన లక్ష్యమని అనుకుంటాడు. కానీ ఒక వైపున నాటకాలను వదులుకోలేక .. మరో వైపున రాయ్ ను ఫేస్ చేయలేక ఆ సినిమా చేయడానికి జమ్షద్ నిరాకరిస్తాడు. 

దాంతో జమ్షద్ ను ఒప్పించి అతనితో పాటు తన భార్య సుమిత్రను కూడా తీసుకుని రమ్మని, తన దగ్గర పనిచేసే వినోద్ దాస్ (అపరశక్తి ఖురాన) ను రాయ్ పంపిస్తాడు. ఆ పనిపై వినోద్ 'లక్నో' వెళ్లినప్పుడు అక్కడ ఏవో అల్లర్లు జరుగుతుంటాయి. ఆ సమయంలోనే జమ్షద్ - వినోద్ కలిసి ప్రయాణిస్తున్న కారు, ప్రమాదానికి గురవుతుంది. అల్లరి మూకలు అటుగా రావడంతో వినోద్ తప్పించుకుంటాడు. వారి చేతికి చిక్కిన జమ్షద్ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని వినోద్ అనుకుంటాడు. 

తప్పనిసరి పరిస్థితులలో వినోద్ నే హీరోగా పెట్టి 'సంఘర్ష్' అనే సినిమాను నిర్మిస్తాడు రాయ్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, వినోద్ పెద్ద స్టార్ అవుతాడు. ఈ నేపథ్యంలోనే జమ్షద్ స్నేహితుడైన 'జై' తో వినోద్ కి పరిచయమవుతుంది. పంజాబ్ నుంచి శరణార్థులుగా 'జై' ఫ్యామిలీ ముంబైకి వచ్చేస్తుంది. అక్కడ పెద్ద మనిషిగా చలామణి అయ్యే ప్రతాప్ కూతురు కిరణ్ .. 'జై' ని ప్రేమిస్తూ ఉంటుంది. 'జై' మాత్రం నీలోఫర్ (వామిక గబ్బి)ని ప్రేమిస్తుంటాడు. ఆమె మనసు మంచిదే అయినా, తను చేసే వృత్తికి .. పెళ్లికి పొంతన కుదరదని ఆమె భావిస్తూ ఉంటుంది. 

ఇక జమ్షద్ ఏమయ్యాడో తెలియక ఆయన ఆచూకీ కనుక్కునే ప్రయత్నాల్లో సుమిత్ర కుమారి ఉంటుంది. వ్యాపార పరంగా రాయ్ ను దెబ్బకొట్టడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. వినోద్ తో తన భర్త చేసిన సినిమాలకి బిజినెస్ జరక్కుండా సుమిత్ర ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. జమ్షద్ దగ్గర గతంలో మేకప్ మేన్ గా పనిచేసిన మక్సూద్, తన యజమాని మరణానికి వినోద్ కారణమని భావించి, సుమిత్రతో చేతులు కలుపుతాడు. రాయ్ అంటే పడని నిర్మాతలు వినోద్ ను తమ వైపు తిప్పుకోవడానికి త్రి చేస్తుంటారు. వినోద్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కావాలని 'జై' ట్రై చేస్తుంటాడు. 

రాయ్ ను ఆయన శతృవులు దెబ్బతీయగలుగుతారా? తనని స్టార్ హీరోను చేసిన రాయ్ ను వినోద్ వదిలేసి వెళ్లిపోతాడా? మక్సూద్ తో కలిసి సుమిత్ర ఏమిచేస్తుంది? వినోద్ తో సినిమా చేయాలనే జై కోరిక నెరవేరుతుందా? అతని వివాహం ఎవరితో జరుగుతుంది? అసలు జమ్షద్ చనిపోయాడా? అనేవి ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. శ్రీకాంత్ రాయ్ గా ప్రసేన్ జిత్ ఛటర్జీ .. వినోద్ దాస్ గా అపరశక్తి  ఖురానా .. నీలోఫర్ పాత్రలో వామికా గబ్బి నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ అని చెప్పచ్చు. 


భారీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కీ, విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించాడు. 1940 - 50 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా .. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ విషయంలోను .. కార్లు .. రైళ్ల దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. డైరెక్టరు  .. ఆర్టు డైరెక్టర్ కలిసి ఎంత కసరత్తు చేశారనేది అర్థమైపోతుంది. కథాపరంగా తెరపైకి వచ్చిపోయే పాత్రలు ఎక్కువ. ఆ పాత్రలన్నిటినీ తీర్చిదిద్దడంలో దర్శకుడు ప్రతిభను అభినందించవలసిందే. 

ఇక ఈ కథకి స్క్రీన్ ప్లే మరింత ముఖ్యం. అక్కడక్కడా కొన్ని పాత్రల మధ్య కాస్త గ్యాప్ వచ్చినా, మళ్లీ దార్లో పడిపోతూనే ఉంటాయి. అతుల్ సబర్వాల్ స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ కి చాలా కీలకంగా నిలిచిందని చెప్పచ్చు. ఇక అమిత్ త్రివేది స్వరపరిచిన పాటలు ఆకట్టుకుంటాయి. అలోక్ నంద దాస్ గుప్తా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. ప్రతీక్ షాహ్ కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. ఇక ఎక్కడా ఎలాంటి అయోమయం తలెత్తకుండా ఎడిటింగ్ పనితీరు నీట్ గా కనిపిస్తుంది. 

 ప్లస్ పాయింట్స్: 1940- 50 నేపథ్యాన్ని టైటిల్స్ దగ్గరా నుంచే ఫాలో అయిన వెబ్ సిరీస్ ఇది. ఆ కాలంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి పాత్ర పట్ల స్పష్టతతో ముందుకు వెళ్లారు.  ఆ కాలం నాటి సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. వెహికల్స్ .. ఫర్నీచర్ ఇలా అన్ని అంశాలు కూడా ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తాయి. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... చిత్రీకరణ కూడా మంచి మార్కులు కొట్టేస్తాయి.

మైనస్ పాయింట్స్: ఈ కథను ఆ కాలంలో జరుగుతున్నట్టుగా నిదానంగా చూపించారు. అందువలన ఈ జనరేషన్ వారికి అక్కడక్కడా కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు. మధ్యలో ఎంట్రీ ఇచ్చే పాత్రల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన, ఆల్రెడీ పరిచయమైన పాత్రల మధ్య గ్యాప్ పెరిగింది. అక్కడక్కడా అనువాదంలో ఇమడని డైలాగ్స్ .. అసభ్య పదజాలం ఇబ్బంది పెడతాయి. నిడివి ఎక్కువగా ఉన్న ఎపిసోడ్స్ ను నింపాదిగా చూడగలిగితే మాత్రం, ఈ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. సీజన్ 2 .. ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Movie Details

Movie Name: Jubilee

Release Date:

Cast: Prasenjit Chattarjee, Aparshakthi, Khurna, Aditi Rao Hydari, Shwetha Basu Prasad, Wamiqa Gabbi, Arun Govil

Director: Vikramadithya

Producer: Deepa De Motwane

Music: Amrith Trivedi

Banner: Reliance Entertainments

Jubilee Rating: 3.50 out of 5


More Movie Reviews