మలయాళంలో హారర్ కామెడీ జోనర్ నుంచి ఏదైనా సినిమా వచ్చిందంటే, ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తారు. అందుకు కారణం ఈ తరహా కథలను వాళ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేస్తారని భావిస్తారు. అందుకు తగినట్టుగానే ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలలో చాలావరకూ థియేటర్ల దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ ఉంటాయి. అలా మే 28వ తేదీన విడుదలైన సినిమానే 'కరక్కం'. సుభాశ్ లలిత దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ధనుష్ (శ్రీనాథ్ భాసి) ఒక డాన్సర్. అతను పెద్దగా సంపాదించకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి అసహనాన్ని ఎదుర్కుంటూ ఉంటాడు. 'పింకీ' (ఫెమీనా జార్జ్) ప్రేమతో ఆ బాధను మరిచిపోతుంటాడు. అలాంటి పరిస్థితులలో అతనికి 'ఖాజా' (ప్రవీణ్) పరిచయమవుతాడు. న్యూ ఇయర్ వేడుకలలో బాగా తాగేసిన ఆ ఇద్దరూ, స్మశానానికి చేరుకుంటారు. విపరీతంగా తాగేసిన కారణంగా అక్కడే పడిపోతారు. కాస్త మత్తు వదిలిన తరువాత అక్కడి నుంచి బయల్దేరతారు. 

అప్పుడే ఆ స్మశానంలో సమాధులపై ఉంచబడిన ఐదు ఇత్తడి శిలువలు కనిపిస్తాయి. దాంతో వాటిని అమ్మేసి సొమ్మును చేసుకోవచ్చనే ఆలోచనతో వాటిని లాగేస్తారు. ఆ సమయంలోనే తన రూమ్ 'కీ'ని ధనుష్ అక్కడ పారేసుకుంటాడు. ఆ తరువాత ఆ శిలువలను అమ్మడానికి వెళ్లగా, అలాంటి వస్తువులను కొనే 'వర్గీస్' చనిపోతాడు. దాంతో వాటిని ఏం చేయాలనేది వాళ్లకి పాలుపోదు.'కీ' కోసం మళ్లీ స్మశానానికి వెళ్లిన వాళ్లకి అక్కడ పోలీసులు ఉండటం చూస్తారు. శిలువలను తీసిన వారిని ప్రేతాత్మలు వెంటాడతాయని అక్కడ ఫాదర్ చెప్పడం విని భయపడిపోతారు. 

అప్పటి నుంచి నిజంగానే ఐదు ప్రేతాత్మలు వాళ్లను వెంటాడటం మొదలుపెడతాయి. డాన్స్ ట్రూప్ కి సంబందించిన డ్రెస్ లో ప్రేతాత్మలు కనిపించడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో వాళ్లు పారా సైకాలజిస్ట్ 'నకుల్'ను కలుస్తారు.  అతనికి కూడా దెయ్యాల వలన భయంకరమైన అనుభావం ఎదురవుతుంది. దాంతో వాళ్లంతా ఫాదర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తారు. 30 ఏళ్లనాటి ఆ సమాధులు ఎవరివనేది తెలుసుకుని, వాళ్ల బంధువులను తీసుకొస్తే .. వాళ్లతో శిలువలు పెట్టించవలసి ఉంటుందని ఫాదర్ చెబుతాడు. 
    
దాంతో ధనుష్ .. అతని లవర్ పింకీ .. ఖాజా .. పారా సైకాలజిస్ట్ నకుల్ అందరూ కలిసి, ప్రేతాత్మలుగా కనిపిస్తున్న వారి వివరాలను సేకరించడం కోసం రంగంలోకి దిగుతారు. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఇంతకీ చనిపోయిన ఆ ఐదుగురు ఎవరు? వారి చావుకు కారకులు ఎవరు? ఎందుకు ప్రేతాత్మలుగా మారతారు? అనేది మిగతా కథ.

సమాధులలో నుంచి ప్రేతాత్మలు బయటికి రావడం .. కథానాయకుడి వెంటపడటం ఫస్టాఫ్ గా, అలా వెంటాడుతున్న ప్రేతాత్మల నుంచి బయటపడటానికి హీరో బృందం ప్రయత్నించడం సెకండాఫ్ గా ఈ సినిమా నడుస్తుంది. అసలు చనిపోయినదెవరు? అనే అంశంతో ఈ కథ ప్రీ క్లైమాక్స్ దిశగా పరిగెడుతుంది. వాళ్లు చనిపోవడానికి కారకులైనవారిని బయటికి తీసే ప్రయత్నంతో ఈ కథ క్లైమాక్స్ కి చేరుకుంటుంది. 

ఈ కథలో ప్రధానమైన పాత్రలు రెండే. కీలకమైనవిగా మరో రెండు .. మూడు పాత్రలు ఆ తరువాత తెరపైకి వస్తాయి. ఇక ప్రేతాత్మల పాత్రలు అప్పుడప్పుడు తెరపై మెరుస్తాయి. ఇది మ్యూజికల్ హారర్ కామెడీ అని చెప్పారు. కానీ ఎక్కడా హారర్ అనేది కనిపించదు .. కామెడీ అనేది నవ్వించదు. ప్రేతాత్మలు డాన్స్ ట్రూప్ కాస్ట్యూమ్స్ తో కనిపించడం అటు హారర్ .. ఇటు కామెడీ రెండూ వర్కౌట్ కాకుండా చేసిందని చెప్పొచ్చు.

తెరపైకి ప్రేతాత్మలు రాగానే ఆడియన్స్ లో ఈ కంటెంట్ పై ఇంట్రెస్ట్ పోతుంది. ప్రేతాత్మలుగా మారినవాళ్లు ఎందుకు చనిపోయారు? అందుకు దారితీసిన పరిస్థితులేమై ఉంటాయి? అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తించే అవకాశం ఉందనే చిన్న ఆశ ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. కానీ ఆ అంశాలు కూడా అప్పటి వరకూ సాగిన కథకు భిన్నంగా ఏమీ అనిపించవు. ఫ్లాష్ బ్యాక్ బలమైనదిగా కానీ, బరువైనదిగా కానీ కనిపించదు. 

నటీనటుల నటన గురించి చెప్పుకునే స్థాయిలో పాత్రలను మలచడం జరగలేదు. బబ్లూ అజూ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అక్కడక్కడా సన్నివేశాలను .. సంభాషణలను డామినేట్ చేయడం వినిపిస్తుంది. నిధిన్ రాజ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.

ఇది చాలా సింపుల్ కంటెంట్. కథాకథనాలపై పెద్దగా కసరత్తు జరగలేదు. బలహీనమైన హారర్ సన్నివేశాలతో .. పేలవమైన కామెడీతో సాగుతుంది. కంటెంట్ కి అన్నివైపుల నుంచి అవసరమైన హంగులను అద్దుతూ ఆసక్తిని రేకెత్తించాలనే ప్రయత్నం జరగలేదు. సిల్లీ సన్నివేశాలతో సాగిపోతూ, అసహనానికి గురిచేస్తుంది.