'దృఢమ్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

మలయాళంలో 'షేన్ నిగమ్' కి మంచి క్రేజ్ ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృఢమ్'. జీతూ జోసెఫ్ శిష్యుడు 'మార్టిన్ జోసెఫ్' ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరించాడు. అందువలన ఈ సినిమాపై ఆయన మార్క్ కనిపిస్తుంది. మే 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో కలుపుకుని ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

విజయ్ (షేన్ నిగమ్) 'పాలక్కడ్' కి చెందిన యవకుడు.తల్లిదండ్రుల కోరిక మేరకు అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఫస్టు పోస్టింగ్ పై, అడవిని అనుకుని ఉన్న ఓ విలేజ్ కి వెళతాడు. అక్కడి పోలీస్ స్టేషన్ స్టాఫ్ గా, కృష్ణన్ ..బాలన్ .. సత్యన్ .. ఆనంద్ .. విద్య .. రమ్య  ఉంటారు. కృష్ణన్ మాత్రం పదవీ విరమణకు దగ్గరలో ఉంటాడు. అందరూ కూడా విజయ్ ను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. క్వార్టర్స్ లో సరదాగా గడుపుతూ ఉంటారు. 

అలాంటి సమయంలోనే ఆ విలేజ్ కి సంబంధించిన ఆయా ప్రదేశాలలో ఒక్కొక్కటిగా శవాలు బయటపడుతూ ఉంటాయి. గుర్తుపట్టలేనంత దారుణమైన స్థితిలో ఆ శవాలు ఉంటాయి. అందరూ కూడా తల వెనుక భాగంలో బలమైన గాయం ఏర్పడిన కారణంగా చనిపోయారనే విషయం పోస్టు మార్టం నివేదికలో వెల్లడవుతుంది. అదే సమయంలో ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి 120 సవర్ల బంగారం .. 50 లక్షల నగదు మాయమవుతుంది. ఆ ఫైనాన్స్ కంపెనీని 'షాజీ' నిర్వహిస్తుంటాడు.

ఒక వైపున దొంగలను .. మరో వైపున హంతకులను పట్టుకోవడానికి విజయ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. హంతకుడు ఒకరేనా? ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దొంగతనానికీ .. ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో విజయ్ దర్యాప్తు కొనసాగుతూ ఉంటుంది. ఈ  ఇన్వెస్టిగేషన్ లో ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో మలయాళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. అందువలన ఈ జోనర్ కి సంబంధించిన సినిమాల పట్ల ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. అదే జోనర్ లో రూపొందిన 'దృఢమ్' సినిమా  కోసం కూడా అలాగే ఎదురుచూశారు. ఇది జీతూ జోసెఫ్ సమర్పించిన సినిమా కావడం, అంచనాలు పెరగడానికి మరో కారణమైంది. 

ఈ కథ ఫారెస్టును అనుకుని ఉన్న ఒక విలేజ్ చుట్టూ .. ఆ విలేజ్ లోని పోలీస్ స్టేషన్ చుట్టూ .. అక్కడ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్న పోలీసుల చుట్టూ తిరుగుతుంది. ఒక వైపున హత్యలు .. మరో వైపున ఫైనాన్స్ కంపెనీలో జరిగిన చోరీ .. ఈ రెండు సంఘటనల మధ్యలో సాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథగా మనం ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.

మార్టీన్ చాలా వివరంగా ఈ కథను రాసుకున్నాడు. తన గురువైన జీతూ జోసెఫ్ మార్క్ కి దగ్గరగా ఈ కథను తీసుకుని వెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. పోలీసులు .. నేరస్థులు .. ఇంటరాగేషన్ .. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడానికి గట్టిగానే ట్రై చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవలసి ఉంటుంది.

సాధారణంగా చాలా కథలు ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కొత్త మలుపు తీసుకుంటూ ఉంటాయి. అక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటి ఒక మలుపు ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది. అప్పటి వరకూ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సన్నివేశాలు .. అనుమానిత పాత్రలు తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. అయితే ఈ తతంగం మొత్తం నడిచిన తీరు చాలా నిదానంగా అనిపిస్తుంది. 

సినిమా మొత్తం కూడా చివరి 30 నిమిషాలపై ఆధారపడి నడుస్తుంది. ఈ అరగంట నిడివిలో నడిచే ఎపిసోడ్ కోసమే మిగతా గంటన్నర కథను సాగదీశారని చెప్పొచ్చు. అయితే పోలీసు పాత్రలను పోషించిన ప్రతి ఆర్టిస్ట్ ప్రదర్శించిన నటన రియలిస్టిక్ గా అనిపిస్తూ, మనలను కథ వెంట కదిలేలా చేస్తుంది. మిగతా గంటన్నర కథపై కూడా మరింత కసరత్తు చేసుంటే, ఇది జీతూ జోసెఫ్ సినిమా అంటే నమ్మేసేలా ఉండేది.

హత్యలు .. దొంగతనాలు .. అనుమానితులు .. ఇన్వెస్టిగేషన్లు అంటూ గతంలో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి.  అయితే ఆ సినిమాలలో ఎవరూ చూడని ఒక క్లైమాక్స్ ను .. ఎంతమాత్రం ఊహించని క్లైమాక్స్ ను ఈ సినిమాలో చూడొచ్చు. అరగంటసేపు మనలను కదలనీయకుండా చూసే ఈ క్లైమాక్స్ కోసమే ఈ సినిమాను చూడొచ్చునేమో అనిపించేలా ఉంటుంది.

కథాకథనాలు కాస్త నిదానంగానే నడుస్తాయి. అయినా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేసినవి ఏమైనా ఉన్నాయంటే అవి లొకేషన్స్ అనే చెప్పాలి. అద్భుతమైన లొకేషన్స్ ఆడియన్స్ ఆకలి తీరుస్తాయి. ఇక నేపథ్య సంగీతం కూడా సందర్భానికి తగినట్టుగా వెళుతుంది. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. 

ఇంతవరకూ వచ్చిన పోలీస్ కథలకు ఈ కథ చాలా భిన్నంగా అనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే చివరి అరగంట కోసం, దానికి ముందున్న కథను సాగదీయడమే కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. 'పరిస్థితులే కొంతమందిని హీరోలను చేస్తాయి .. మరికొంతమందిని విలన్స్ గా మారుస్తాయి' అనే ఒక డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఆ పరిస్థితులు ఏమిటనేది తెలుసుకోవడానికి ఒక గంటన్నరసేపు ఓపిక పడితే, మిగతా అరగంట కథ ఆ అసంతృప్తిని దూరం చేస్తుందనే చెప్పాలి.               

Movie Details

Movie Name: Dridam

Release Date:

Cast: Shane Nigam, Dinesh Prabhakar,Saniya Fathima,Mathew Varghese,Krishna Prabha

Director: Martin Joseph

Producer: Mukesh R Mehta

Music: Sreerag Saji

Banner: E4 Experiments

Dridam Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews